న్యూఢిల్లీ: మీరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారా? వారి మాయమాటలు నమ్మి, సొమ్ము బదిలీ చేశారా? ఓటీపీలు, క్రెడిట్‌కార్డుల వివరాలు చెప్పేశారా? సాధారణంగా మీరు సైబర్‌క్రైమ్ పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసే లోపే నేరగాళ్లు డబ్బును తమ ఖాతాల నుంచి ఉపసంహరించేసుకుంటారు. ఇలాంటి మోసాలను ఆపి నేరగాళ్ల అకౌంట్లను స్తంభింపజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక వ్యవస్థను రూపొందించింది. మోసాన్ని గుర్తించి (మీ అకౌంట్ల నుంచి డబ్బు పోయినట్లు గుర్తించగానే) వెంటనే ఫిర్యాదు చేసేందుకు కేంద్ర హోంశాఖ హెల్ప్‌లైన్ నంబర్ 155260 అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్‌లో నంబర్‌ను ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులోకొచ్చింది.
ఆర్‌బీఐసహా అన్ని ప్రధాన బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, వ్యాలెట్లు, ఆన్‌లైన్ వాణిజ్య సంస్థ సహకారంతో ఈ హెల్ప్‌లైన్‌ను హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సి) నిర్వహిస్తోంది. ఈ మేరకు సిటిజెన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్, మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో (ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్) హెల్ప్‌లైన్ అమల్లో ఉంది. డబ్బును ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేసిన తర్వాత త్వరగా ఫిర్యాదు చేస్తే వెనక్కి రప్పించడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సదరు డబ్బు డిజిటల్ ఎకోసిస్టమ్ నుంచి బయటకు వెళ్లక ముందే అప్రమత్తమైతే చాలావరకు వెనక్కి వస్తుందని అంటున్నారు. అమాయకుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును సైబర్ నేరస్తులు ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు.. ఇలా ఐదు బ్యాంకుల ఖాతాల్లోకి మార్చినప్పటికీ సిటిజెన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్, మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా అధికారులు వెనక్కి రప్పించగలిగారు.
Comments
Please login to add a commentAdd a comment