కోల్‌కతాలో 48 మంది ఏపీ తీర్థ యాత్రీకులకు అస్వస్థత
ఒంగోలు/నెల్లూరు/కావలి/హైదరాబాద్: పుణ్యక్షేత్రాల సందర్శనార్థం ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్లిన 48 మంది రాష్ట్రవాసులు రెండు రోజుల క్రితం కోల్‌కతాలో విషాహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులంతా ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలకు చెందిన వారు. వీరిలో 27 మంది నెల్లూరు, కావలికి చెందిన వారు కాగా, ఒంగోలువాసులు 21 మంది ఉన్నారు.
ఒక ప్రైవేటు పర్యాటక ఏజెన్సీ ప్యాకేజీలో గత నెల 29వ తేదీన ఒంగోలు నుంచి పొదిలి గురుస్వామి నాయకత్వంలో వీరంతా పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు. వీరిలో చాలా మంది బంధువులే. వీరు కాశీ, ప్రయాగ తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించిన అనంతరం కాళీమాత దర్శనం కోసం శుక్రవారం రైలులో కోల్‌కతా చేరారు.
హౌరా రైల్వే స్టేషన్‌లో దిగగానే ఎదురుగా ఉన్న గణేశ్ భవన్ అనే హోటల్‌లో బస చేశారు. అక్కడి హోటల్‌లో అల్పాహారం, భోజనం తీసుకున్నారు. ఆ తర్వాత వారికి తీవ్రవాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. తొలుత వీరిని అక్కడి గాంధీ సొసైటీ ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో చిన్న పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో ముగ్గురు బాలలు, ఐదుగురు మహిళలు ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం ఆదివారం సాయంత్రం వరకు 30 మందిని కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా, కోల్‌కతాలో అస్వస్థతకు గురైన వారికి అక్కడి అపోలో ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నామని, ప్రభుత్వ ఖర్చులతో స్వస్థలాలకు చేరుస్తాం ఏపీ మంత్రి పి.నారాయణ తెలిపారు.