మెక్‌డొనాల్డ్స్‌లో ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి | McDonalds Linked To One Death, Dozens Of Food Poisonings In US, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

మెక్‌డొనాల్డ్స్‌లో ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి, పది మందికిపైగా అస్వస్థత

Published Wed, Oct 23 2024 12:00 PM | Last Updated on Wed, Oct 23 2024 12:48 PM

McDonalds Linked To One Death, Dozens Of Food Poisonings In US

మెక్‌డొనాల్డ్స్ ఔట్‌లెట్‌లో ఫుడ్ పాయిజన్ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. డజన్ల కొద్దీ కస్టమర్లు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. మెక్‌డొనాల్డ్స్ క్వార్టర్ పౌండర్ హాంబర్గర్‌లో తిన్న ఒకరు ఈ.కోలి (E.coli) బ్యాక్టీరియా సోకి చనిపోయారని, పది మందికిపైగా అస్వస్థతకు గురయ్యారని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) మంగళవారం వెల్లడించింది. సెప్టెంబరు చివరి వారంలో ప్రారంభమైన వ్యాప్తి, 10 పశ్చిమ రాష్ట్రాలలో విస్తరించింది. మొత్తం 49 కేసులు నమోదుకాగా.. ఎక్కువగా కొలరాడో, నెబ్రాస్కాలో కేంద్రీకృతమై ఉన్నాయని సీడీసీ తెలిపింది.

సీడీసీ ప్రకటన వెలువడి కొద్ది గంటల్లోనే మెక్‌డోనాల్డ్స్ షేర్లు 6 శాతానికిపైగా పతనమయ్యాయి. అస్వస్థతతకు గురైనవారిలో 10 మంది ఆసుపత్రిలో చేరారని, వీరిలో తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధి హేమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్‌తో  బాధపడుతోన్న చిన్నారి కూడా ఉంది. కొలరాడోలో ఓ వ్యక్తి మృతిచెందినట్టు సీడీసీ తెలిపింది. అస్వస్థతకు గురైన వ్యక్తులందరిలోనూ ఈ.కోలి బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నాయని, అనారోగ్యం బారిన పడటానికి వీరు ముందు మెక్‌డొనాల్డ్స్‌లో ఆహారం తీసుకున్నట్లు పేర్కొంది.

వీరి అనారోగ్యానికి కారణమైన ఖచ్చితమైన పదార్ధాన్ని పరిశోధకులు ఇంకా గుర్తించనప్పటికీ, ఉల్లిపాయ ముక్కలు, బీఫ్‌‌ల(గొడ్డు మాంసం) కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై విచారణ పెండింగ్‌లో ఉన్న ప్రభావిత రాష్ట్రాల్లోని రెస్టారెంట్లు ఈ రెండింటి వాడకాన్ని తొలగించాయి. ‘నాకు, మెక్‌డొనాల్డ్స్‌లోని ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత చాలా ముఖ్యం. ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని మా ఔట్‌లెట్‌లలో ముక్కల చేసి ఉల్లిపాయల వినియోగించరాదని నిర్ణయం తీసుకున్నాం’ అని ఆ సంస్థ అమెరికా విభాగం ఛైర్మన్ జో ఎర్లింగర్ ఒక వీడియో  విడుదల చేశారు.

మెజార్టీ రాష్ట్రాలు ఈ.కోలికి ప్రభావితం కాలేదని, వ్యాధి ప్రభావిత రాష్ట్రాల్లో బీఫ్ ఉత్పత్తుల సమా ఇతర ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక, క్వార్డర్ పౌండర్‌లో ఆహారం తిని, డయోరియా, తీవ్రమైన జ్వరం, వాంతులు వంటి ఈ-కోలి లక్షణాలు బయటపడితే వైద్య సహాయం తీసుకోవాలని సీడీసీ సూచించింది. ఈ బ్యాక్టీరియా సోకిన మూడు నాలుగు రోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయి. అయితే చాలా మంది నాలుగు నుంచి ఏడు రోజుల్లోపే ఎలాంటి చికిత్స లేకుండానే కోలుకుంటారు. అయినప్పటికీ కొన్ని కేసులు తీవ్రంగా మారడం వల్లపరిస్థితి విషమించి ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement