Burgers
-
మెక్‌డొనాల్డ్స్‌లో ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి
మెక్‌డొనాల్డ్స్ ఔట్లెట్లో ఫుడ్ పాయిజన్ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. డజన్ల కొద్దీ కస్టమర్లు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. మెక్‌డొనాల్డ్స్ క్వార్టర్ పౌండర్ హాంబర్గర్లో తిన్న ఒకరు ఈ.కోలి (E.coli) బ్యాక్టీరియా సోకి చనిపోయారని, పది మందికిపైగా అస్వస్థతకు గురయ్యారని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) మంగళవారం వెల్లడించింది. సెప్టెంబరు చివరి వారంలో ప్రారంభమైన వ్యాప్తి, 10 పశ్చిమ రాష్ట్రాలలో విస్తరించింది. మొత్తం 49 కేసులు నమోదుకాగా.. ఎక్కువగా కొలరాడో, నెబ్రాస్కాలో కేంద్రీకృతమై ఉన్నాయని సీడీసీ తెలిపింది.సీడీసీ ప్రకటన వెలువడి కొద్ది గంటల్లోనే మెక్‌డోనాల్డ్స్ షేర్లు 6 శాతానికిపైగా పతనమయ్యాయి. అస్వస్థతతకు గురైనవారిలో 10 మంది ఆసుపత్రిలో చేరారని, వీరిలో తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధి హేమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్‌తో బాధపడుతోన్న చిన్నారి కూడా ఉంది. కొలరాడోలో ఓ వ్యక్తి మృతిచెందినట్టు సీడీసీ తెలిపింది. అస్వస్థతకు గురైన వ్యక్తులందరిలోనూ ఈ.కోలి బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నాయని, అనారోగ్యం బారిన పడటానికి వీరు ముందు మెక్‌డొనాల్డ్స్‌లో ఆహారం తీసుకున్నట్లు పేర్కొంది.వీరి అనారోగ్యానికి కారణమైన ఖచ్చితమైన పదార్ధాన్ని పరిశోధకులు ఇంకా గుర్తించనప్పటికీ, ఉల్లిపాయ ముక్కలు, బీఫ్‌ల(గొడ్డు మాంసం) కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై విచారణ పెండింగ్‌లో ఉన్న ప్రభావిత రాష్ట్రాల్లోని రెస్టారెంట్లు ఈ రెండింటి వాడకాన్ని తొలగించాయి. ‘నాకు, మెక్‌డొనాల్డ్స్‌లోని ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత చాలా ముఖ్యం. ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని మా ఔట్లెట్లలో ముక్కల చేసి ఉల్లిపాయల వినియోగించరాదని నిర్ణయం తీసుకున్నాం’ అని ఆ సంస్థ అమెరికా విభాగం ఛైర్మన్ జో ఎర్లింగర్ ఒక వీడియో విడుదల చేశారు.మెజార్టీ రాష్ట్రాలు ఈ.కోలికి ప్రభావితం కాలేదని, వ్యాధి ప్రభావిత రాష్ట్రాల్లో బీఫ్ ఉత్పత్తుల సమా ఇతర ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక, క్వార్డర్ పౌండర్‌లో ఆహారం తిని, డయోరియా, తీవ్రమైన జ్వరం, వాంతులు వంటి ఈ-కోలి లక్షణాలు బయటపడితే వైద్య సహాయం తీసుకోవాలని సీడీసీ సూచించింది. ఈ బ్యాక్టీరియా సోకిన మూడు నాలుగు రోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయి. అయితే చాలా మంది నాలుగు నుంచి ఏడు రోజుల్లోపే ఎలాంటి చికిత్స లేకుండానే కోలుకుంటారు. అయినప్పటికీ కొన్ని కేసులు తీవ్రంగా మారడం వల్లపరిస్థితి విషమించి ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తుంది. -
T20 World Cup 2024: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ ‘మూడ్ బర్గర్’ కావాలా నాయనా?
T20 World Cup 2024 : ఐపీఎల్ 2024 పోరు అలా ముగిసిందో లేదో ఐసీసీ మెన్స్ టీ 20 వరల్డ్‌కప్ క్రికెట్ ఫీవర్ ఫ్యాన్స్‌ను ఆవహించింది. ఈ నేపథ్యంలోనే హిందుస్థాన్ యూనిలీవర్‌కు చెందిన ఫుడ్స్ అండ్ యూనిలీవర్ ఫుడ్స్ సొల్యూషన్ ఇండియా హెల్మాన్స్ ఇండియా క్రికెట్ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పింది. మ్యాచ్‌లోని మూడ్‌కు తగ్గట్టుగా పాకశాస్త్ర నిపుణులతో కొత్త తరహా ‘'మూడ్ బర్గర్స్'ను లాంచ్ చేసింది. View this post on Instagram A post shared by Hellmann's India (@hellmannsindia)సోషల్ (SOCIALoffline) భాగస్వామ్యంతో లిమిడెట్ ఎడిషన్ మెనూని ప్రకటించింది. క్రికెట్ అభిమానుల మూడ్‌కు అనుగుణంగా జూన్ నెల అంతా వెజ్ , నాన్ వెజ్ వేరియంట్లలో వీటిని ప్రత్యేకంగా రూపొందించింది. ఇవి దేశవ్యాప్తంగా 53 సోషల్ అవుట్లెట్లలో అందుబాటులో ఉంటాయని హెల్మాన్స్ హెడ్ ప్రియాంక గంగూలీ తెలిపారు. జూన్ వరకు ఏదైనా ‘సోషల్’ అవుట్లెట్లను సందర్శింవచ్చు. లేదా ఆన్లైన్ ద్వారా జూన్ 6 నుంచి 30వ తేదీ దాకా స్విగ్గీ లేదా జొమాటో ద్వారా డెలివరీచేస్తారు. హెలెమాన్ మూడ్ బర్గర్స్ రిచ్, ఎక్స్ట్రా క్రీమీ, మయో-లైసియస్ లాంటి వెరియంట్స్లలో లభిస్తాయి. కొత్త బర్గర్స్ మెనూతో, ఈ క్రికెట్ సీజన్‌లోని ప్రతి మ్యాచ్‌లోని ప్రతీ క్షణాన్ని మరింత గుర్తుండిపోయేలా చేస్తుందని ఇంప్రెసారియో ఎంటర్టైన్మెంట్ & హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ దివ్య అగర్వాల్ చెప్పారు. -
ప్రముఖ కంపెనీకి ‘చీజ్’ తిప్పలు..
అమెరికన్ మల్టీనేషనల్ ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్డొనాడ్స్కు భారత్‌లో ‘చీజ్ బర్గర్లు’ తిప్పలు తెచ్చిపెట్టాయి. పశ్చిమ, దక్షిణ భారతదేశంలో మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లను నిర్వహించే వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ లిమిటెడ్ ఫుడ్ ఐటమ్స్ పేర్లు మార్చినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. మహారాష్ట్ర ఫుడ్ & డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ గత ఏడాది నెల రోజులపాటు విచారణ జరిపి ఈ ఫాస్ట్ ఫుడ్ చైన్ బర్గర్లు, నగ్గెట్లలో వెజిటబుల్ ఆయిల్ వంటి చౌకైన చీజ్ ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తోందని తేల్చింది. మెక్‌డొనాల్డ్స్‌లో అందించే బ్లూబెర్రీ చీజ్కేక్లలో హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కంటెంట్ ఉన్నందున వాటిని చీజ్కేక్గా నిర్వచించలేమని ఫుడ్ రెగ్యులేటరీ బాడీ తీర్పు చెప్పింది. మెక్‌డొనాల్డ్ సరైన లేబులింగ్ లేకుండా అనేక వస్తువులలో చీజ్ ప్రత్యామ్నాయాలను ఉపయోగిస్తోందని, తద్వారా నిజమైన చీజ్ తింటున్నట్లు వినియోగదారులను తప్పుదారి పట్టించారని ఆరోపించింది. అహ్మద్‌నగర్‌లోని మెక్‌డొనాల్డ్స్ అవుట్లెట్ లైసెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఫుడ్ ఐటమ్స్ పేర్లలో "చీజ్" అనే పదాన్ని వెస్ట్‌లైఫ్ లిమిటెడ్ తొలగించిందని, ఈ మేరకు సవరించిన మెనూను మహారాష్ట్ర ఫుడ్ & డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ తెలియజేసిందని డిసెంబర్ 18 నాటి లేఖను ఉటంకిస్తూ ఎన్డీటీవీ ప్రాఫిట్ కథనాన్ని ప్రచురించింది. కేసు అహ్మద్‌నగర్‌కు సంబంధించినది అయినప్పటికీ, దిద్దుబాటు చర్యను జాతీయంగా విస్తరించడం కోసం ఫాస్ట్‌ఫుడ్ చైన్‌పై ఫుడ్ సేఫ్టీ & స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కఠినంగా వ్యవహరిస్తుందో లేదో చూడాలి. -
రూ.20 వేలతో రూ.100 కోట్లు సంపాదించొచ్చా..?
బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలనేది ఒకప్పటి మాట. కానీ చదువు అనంతరం మంచి బిజినెస్ ఐడియాతో కోట్లు గడించవచ్చనేది నేటి ట్రెండ్. చాలా మంది యువత మంచి బిజినెస్ ఐడియాతో తాము అప్పటివరకు చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదిలి సొంతంగా వ్యాపారం మొదలుపెడుతున్నారు. కోట్లల్లో టర్నోవర్ చేస్తూ చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు. బెంగళూరులోని ఇన్ఫోసిస్‌లో బిరాజా రౌత్ ఆయన 21వ ఏట సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండేవాడు. ఆయనకు బర్గర్లంటే చాలా ఇష్టం. ఒక మంచి భారతీయ బ్రాండ్ బర్గర్లను తయారు చేసి విక్రయించాలనే ఆలోచన వచ్చింది. దాంతో 2011లో తన టెక్ ఉద్యోగానికి రాజీనామా చేసి కేవలం రూ.20 వేలు పెట్టుబడితో చిన్నస్థాయిలో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. తొలుత తాను పనిచేసిన ఆఫీసు సమీపంలో రోడ్డుపై కియోస్క్ ఏర్పాటు చేసి బర్గర్లు అమ్మడం మొదలుపెట్టాడు. రౌత్ గతంలో పనిచేసిన కంపెనీలోని తన సహచర ఉద్యోగులు, మిత్రులు తొలుత కస్టమర్లుగా మారారు. ఆయన తయారుచేస్తున్న గ్రిల్డ్ బర్గర్ రుచి నచ్చటంతో సమీపంలోని కంపెనీల్లో పనిచేస్తున్న వారుసైతం ఆయన బిజినెస్‌కు కస్టమర్లుగా మారారు. దాంతో బెంగళూరులో రౌత్ తయారుచేస్తున్న బర్గర్ మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ, బర్గర్ కింగ్ వంటి బ్రాండ్లకు గట్టి పోటీనిచ్చే స్థాయికి ఎదిగింది. దాంతో అతడు ‘బిగ్గీస్ బర్గర్’ పేరుతో కొత్త బ్రాండ్‌ను సృష్టించి దాని ద్వారా తన వ్యాపారం సాగించాడు. అలా ఎలక్ట్రానిక్ సిటీలో అతడు వ్యాపారం ప్రారంభించిన చోటుకు నగరంలోని చాలా మంది కస్టమర్లు బర్గర్ రుచి చూసేందుకు వచ్చేవారు. ఇదీ చదవండి: ‘రష్యా నుంచి చమురు దిగుమతి చేయకపోతే..’ కేంద్రం కీలక వ్యాఖ్యలు అలా ఫుడ్ లవర్స్ మనసు గెలుచుకోవటంతో బిగ్గీస్ బర్గర్ క్రమంగా లాభాలను ఆర్జించడం ప్రారంభించింది. 2023 నాటికి బిగ్గీస్ బర్గర్ కంపెనీ ఆదాయం రూ.100 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం రౌత్ తన వ్యాపారాన్ని టైర్-2,3 నగరాలకు విస్తరించాలనే యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బిగ్గీస్ బర్గర్ 14 రాష్ట్రాల్లోని 28 నగరాల్లో 130 శాఖలను విస్తరించింది. 2024లో వీటి సంఖ్యను 350కి పెంచాలని చూస్తున్నారు. -
వామ్మో! మామూలోడు కాదుగా.. 24 నిముషాల్లో అన్ని బర్గర్లు తిన్నాడా?
ఫుడ్ ఛాలెంజ్‌లో పాల్గొని విజయాలు సాధించినవారు కొందరైతే, మరికొందరేమో దీనిని చాలా సీరియస్‌గా తీసుకుని, గెలవాలనే తాపత్రయంలో ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. సాధారణంగా ఎవరైనా ఒకటి లేదా రెండు బర్గర్లు తినగానే ఇక మావల్లకాదని చేతులెత్తేస్తారు! అలా కాదని బలవంతంగా ఎక్కిస్తే ఇక వాంతులే.. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే వ్యక్తి కేవలం 24 నిముషాల్లో ఎన్ని బర్గర్లు తిన్నాడో తెలిస్తే... ఖచ్చితంగా నోరెల్లబెడతారు. ఇంగ్లాండ్‌కు చెందిన కైలీ గిబ్సన్ (23) అనే వ్యక్తి ‘మెక్‌డోనల్డ్స్ క్రిస్టమస్ ఛాలెంజ్'లో పాల్గొని కేవలం 24 నిముషాల్లో ఏకంగా 6 బర్గర్లు లాగించేశాడు. పైగా ఇదంతా నాకు చాలా మామూలు విషయమని అంటున్నాడు కూడా. నిజానికి కైలీ గిబ్సన్ ప్రొఫెషనల్ ఈటర్. గత కొన్ని యేళ్లగా ప్రతిరోజూ లెక్కలేనన్ని లార్జ్ మీల్ ఈటింగ్ కాంపిటీషన్లలో పాల్గొంటున్నాడట కూడా. వీటికి సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియా ఎకౌంట్లలో చూడొచ్చు. ఐతే తినడం వరకూ సరే! మరి తిన్నదంతా ఎలా అరిగించుకుంటాడనేది ప్రతి ఒక్కరి ప్రశ్న. అతని సమాధానం ఏమిటో తెలుసా.. కాంపిటీషన్లో పాల్గొనడానికి ముందు, తిన్న తర్వాత భారీ స్థాయిలో వర్క్ఔట్స్ చేస్తానని చాలా తేలిగ్గా చెప్పేస్తున్నాడండీ..! మరి మీరేమంటారు.. చదవండి: వృత్తేమో టీచర్... వారానికోసారి మాత్రమే స్నానం.. కాస్తమీరైనా చెప్పండి!! -
పాక్‌లోనూ పోలీసులంతే.. బర్గర్లు ఉచితంగా ఇవ్వనందుకు
అడిగింది ఇవ్వకున్నా, చెప్పింది చెయ్యకున్నా ఏదో కేసు బనాయించి అరెస్ట్ చేసే కేడీ పోలీసుల్ని చాలా సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. అయితే కేవలం బర్గర్లు ఫ్రీగా ఇవ్వనందుకు ఏకంగా రెస్టారెంట్‌ని మూయించి, 19 మంది సిబ్బందిని అరెస్ట్ చేశారు పాకిస్తాన్లో కొందరు పోలీసులు. ‘జానీ అండ్ జుగ్నూ’ అనే రెస్టారెంట్లో బర్గర్లు ఆర్డర్ చేసి, ఉచితంగా ఇవ్వాలని పట్టుబట్టారు పోలీసులు. దానికి నిరాకరించినందుకు.. అక్కడ పనిచేసే సిబ్బందిని అరెస్ట్ చేసి.. సుమారు ఏడు గంటల పాటు పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించారు. అరెస్ట్ అయినవారిలో కిచెన్ సిబ్బంది కూడా ఉండటంతో ఆ హోటల్‌ను మూసివేయాల్సి వచ్చింది. ఆ రెస్టారెంట్ యజమాని ‘పోలీసులు మా రెస్టారెంట్ వర్కర్స్‌ని ఇబ్బంది పెట్టడం ఇదేం తొలిసారి కాదు. ఇలాంటి ఘటనలకు ఇదే చివరి రోజు కావాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశాడు. పైగా అరెస్ట్ అయిన సిబ్బంది అంతా వివిధ యూనివర్సిటీల్లో చదువుతూ రెస్టారెంట్లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్న యువతే. దాంతో ఆ ట్వీట్ వైరల్ అయ్యింది. విషయం తెలుసుకుని అప్రమత్తమైన ఉన్నతాధికారులు.. అందుకు కారణమైన పోలీసులను విధుల నుంచి సస్పెండ్ చేశారు. సీనియర్ ప్రావిన్షియల్ అధికారి ఇనామ్ ఘనీ కూడా ట్విట్టర్లో స్పందించాడు..‘ చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదు. అలాంటి వారిని క్షమించేది లేదు’ అంటూ! Lahore Johnny & Jugnu: Fast food staff arrested for not giving police free burgers pic.twitter.com/Ia1nT0yYDY — Murtaza Ali Shah (@MurtazaViews) June 15, 2021 -
అత్యంత ఖరీదైన ఈ బర్గర్ రుచిచూడాలంటే..
టోక్యో : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బర్గర్లలో ఒకటిగా నిలిచిన గోల్డెన్ జెయింట్ బర్గర్ ఆహార ప్రియులను అలరిస్తోంది. టోక్యోలోని గ్రాండ్ హ్యాత్ రెస్టారెంట్‌లోని ఓక్ డోర్ స్టీక్ హౌస్‌లో అందుబాటులో ఉన్న ఈ బర్గర్‌ను రుచిచూడాలంటే భారత కరెన్సీలో రూ 70,000లు వెచ్చించాల్సిందే. ఇంత ఖరీదైన ఈ బర్గర్లో ఏమేం ఉంటాయనే ఆసక్తి కలగడం సహజమే. మూడు కిలోల బరువుండే ఈ బర్గర్ 15 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ బర్గర్లో కిలో బీఫ్‌తో పాటు టొమాటోలు, చీజ్, బాతు మాంసం ఇంకా అల్లం, శాఫ్రాన్ సాస్ ఉపయోగిస్తారు. బన్పైన షాంపేన్, రెడ్, వైట్ వైన్లను స్ప్రే చేసి కస్టమర్లకు సర్వ్ చేస్తారు. ఈ గోల్డెన్ జెయింట్ బర్గర్‌ను చెఫ్ పాట్రిక్ షిమడ ఐడియాగా చెబుతున్నారు. ఈ బర్గర్ తయారీలో ఎనిమిది మంది సిబ్బంది పాలుపంచుకుంటారని చెఫ్ చెప్పుకొచ్చారు. ఇక ఈ బర్గర్‌ను రుచి చూడాలనుకునేవారు కనీసం మూడు రోజులు ముందు రిజర్వ్ చేసుకోవాలి. -
గొడ్డుమాంసం తినడం మానేశారు!
సన్నటి మంట మీద ఆలివ్ ఆయిల్ చుక్కలతో ఉడికించిన గొడ్డుమాంసం ముక్కల్ని.. బన్ల మధ్యలో ఉంచి, దానికి కాస్త స్పెషల్ సాస్, అమెరికన్ చీజ్, పికిల్స్, ఆనియన్స్‌ను జతచేస్తే.. హాంబర్గర్ రెడీ అయినట్లే. ఇక ప్రఖ్యాత మెక్‌డోనాల్డ్స్‌లో తయారయ్యే బిగ్ మాక్ హాంబర్గరైతే.. ఎంత వరల్డ్ ఫేమసో చెప్పుకోవాల్సిన పనిలేదు. మెక్‌డోనాల్డ్స్ ఆహార ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తం కావడాన్ని క్యాపిటలిజం వ్యాప్తిగానూ అభివర్ణించే ఆర్థికవేత్తలు కొందరు.. ఏకంగా ఆకలి సూచికి ‘బిగ్ మాక్ ఇండెక్స్’ అని పేరు కూడా పేరుపెట్టారు. ఇక అమెరికాకే చెందిన ప్రఖ్యాత క్యాపిటలిస్టు, ప్రస్తుత దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం బిగ్ మాక్ అంటే నాలుక కోసుకుంటారు. ‘‘దాన్ని అలా అలా నోట్లో పెట్టుకుని కొరికితే.. వావాహ్.. ఆ టేస్టే వేరప్ప!’’ అనేది ఒకప్పటి ట్రంప్ మాట! ఇప్పుడాయన గొడ్డుమాంసం తినడం మానేశారు! ట్రంప్ ఫిట్‌నెస్‌పై ఆందోళన : పలు అనుమానాలు, విమర్శల నేపథ్యంలో కొద్ది రోజుల కిందట ట్రంప్ చేయించుకున్న సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు ప్రాధాన్యం సంతరించుకున్న సంగతి తెలిసిందే. నాటి టెస్టుల్లో ఆయన ఆరోగ్యం భేషుగ్గా ఉందని తేలింది. అయితే ఫిట్నెస్ కాస్త ఆందోళనకరంగాఉంది. 6అడుగుల 3 అంగుళాల ఎత్తు, 71 ఏళ్ల వయసున్న ట్రంప్ 239 పౌండ్ల(108.4 కేజీల) బరువున్నారు. ఒబెసిటీ(అధికబరువు) కేటగిరీకి అతి చేరువలో ఉన్న ట్రంప్ డైట్ పాటించకుంటే ప్రమాదం ఎదుర్కోకతప్పదని వైట్‌హౌస్ ఫిజీషియన్ డాక్టర్ రోనీ జాక్సన్ సూచించారు. ఆ మేరకు గడిచిన రెండు వారాలుగా ట్రంప్ గొడ్డుమాంసం తినడం పూర్తిగా మానేశారు. అప్పటి నుంచి ఫిష్ శాండ్విచ్ (ఫిష్ ఓ ఫిలెట్), ఫ్రూట్ సలాడ్స్, చాక్లెట్ మిల్క్ షేక్‌లను మాత్రమే తీసుకుంటున్నారు. విషప్రయోగ భయం! : బడా రియల్టర్ పుత్రుడిగా బిజినెస్‌లోకి ప్రవేశించిన డొనాల్డ్ ట్రంప్.. అతికొద్ది కాలంలోనే వ్యాపార సామ్రాజ్యాన్ని శిఖరస్థాయికి చేర్చారు. శత్రువుల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండే ట్రంప్.. ఆహారం విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. బయటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆహారాన్ని ముట్టనుగాక ముట్టరు! ప్రతి సందర్భంలోనూ మెక్‌డోనాల్డ్స్ నుంచి తెప్పించే బిగ్ మాక్‌ను మాత్రమే ఆరగించేవారు. తన ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఇలానే వ్యవహరించారు. ‘‘నాకు శుభ్రంగా ఉండటం చాలా ఇష్టం. పనిలో భాగంగా రకరకాల చోట్లకు వెళతాం. అయితే అక్కడ తయారుచేసిన ఆహారం శుభ్రంగా వండారా, లేదాని చెప్పలేం. మెక్‌డోనల్డ్స్ సురక్షిత ప్రమాణాలు పాటిస్తుంది కాబట్టే వాళ్ల బర్గర్లు మాత్రమే తింటా’’ అని ట్రంప్ ఓ సందర్భంలో చెప్పారు. అయితే ట్రంప్ జాగ్రత్తల వెనుక ‘విషప్రయోగం’ భయం కూడా ఉందని ప్రఖ్యాత జర్నలిస్టు మిచెల్ వూల్ఫ్ అంటారు. ఇటీవలే తాను రాసిన ‘ఫైర్ అండ్ ఫ్యూరీ’ పుస్తకంలో ట్రంప్ గురించిన అనేక రహస్య విషయాలను చెప్పుకొచ్చారాయన. ‘‘ఆహారంలో విషప్రయోగం జరగొచ్చనే ఆందోళన ట్రంప్‌లో చాలా కాలంగా ఉంది. అందుకే ఆయన బయటికెళ్లినప్పుడు.. సురక్షితంగా వండిన మెక్‌డోనాల్డ్స్ పదార్థాలను మాత్రమే తినడానికి ఇష్టపడతారు. ఇది ఎప్పుడు మొదలైందో చెప్పలేనుగానీ, దశాబ్ధాలుగా ట్రంప్ ఇలానే చేస్తున్నారు’’ అని మిచెల్ వూల్ఫ్ రాశారు. -
బర్గర్లు ఇవ్వమంటే.. ఇవ్వరా?!
రియో డి జెనీరియో : బ్రెజిల్‌లోని అత్యంత ఖరీదైన నగరాల్లో రియో డిజెనీరియో ఒకటి. ఆర్థిక లావాదేవీలు అత్యధికంగా జరిగే ప్రాంతం కావడంతో ఖరీదైన హోటళ్లు, రిసార్టులు, రెస్టార్లు భారీగా ఉన్నాయి. ఇవి ఏడాది పొడుగునా బిజీగానే ఉంటాయి. అందులోనూ మెక్ డోనాల్డ్ రెస్టారెంట్‌కు స్థానికంగా డిమాడ్ ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆరుమంది వ్యక్తులు రెస్టారెంట్ వచ్చి 40 బర్గర్లు కావాలని చెప్పారు. వేడివేడిగా బర్గర్లు తెచ్చాక.. బిల్ పే చేయమని కౌంటర్లోని వ్యక్తి అడిగాడు.. బర్గర్ల కోసం వచ్చిన వ్యక్తి.. నేను బిల్ పే చేయను.. అంటూ.. తన వెంట తెచ్చుకున్న గన్‌తో ఒక్కసారిగా కాల్పులకు దిగాడు. అతనికి సహాయంగా మరో అయిదుమంది కూడా తుపాకులకు పని చెప్పారు. బుల్లెట్లు ఎక్కడ తగులుతాయన్న భయంతో రెస్టారెంట్లో ఉన్న వాళ్లంతా.. టేబుళ్ల కింద.. దాక్కున్నారు. ఈ ఘటనలో అదృష్టవవాత్తు ఎవరూ గాయపడలేదని మెక్‌డోనాల్డ్ అధికారులు ప్రకటించారు. బుల్లెట్లు తగిలి రెస్టారెంట్ పర్నీచర్ చాలా వరకూ పాడైందని.. చెప్పారు. అయితే బర్గర్లుకు డబ్బులు చెల్లించకుండా.. తుపాకి కాల్పుల పాల్పడ్డవారు.. డ్రగ్స్ డీలర్లని సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు చెబుతున్నారు. -
బర్గర్లు ఎందుకు బ్యాడ్ ఫుడ్ అంటే..!
బర్గర్లు, పిజ్జాలు ఆరోగ్యానికి అంత మేలు చేయవని అందరూ చెబుతుంటారు. పైగా పెరిగే పిల్లల్లో స్థూలకాయం వంటివి తెచ్చి వాళ్ల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తాయని అంటుంటారు. అయితే దీనికి కొన్ని నిర్దిష్టమైన నిదర్శనాలు ఇస్తున్నారు పరిశోధకులు. యునెటైడ్ కింగ్డమ్కు చెందిన శ్వాన్సీ యూనివర్సిటీ నిపుణులు కొన్ని తాజా అధ్యయనాల ఆధారంగా బర్గర్ల వంటివి ఎందుకు చేటు చేస్తాయో వివరిస్తున్నారు. వారు చెబుతున్న దాని ప్రకారం... అత్యంత సూక్ష్మమైన కణాలలో కార్బన్ డయాక్సైడ్ వంటి కలుషితమైన పదార్థాల నుంచి తమను తాము శుభ్రం చేసుకునే సామర్థ్యం ఉంటుంది. ఈ కాలుష్యాలను విజయవంతంగా హరించే ఆహార పోషకాలను ‘యాంటీ ఆక్సిడెంట్స్’ అంటారన్న ది తెలిసిందే. బర్గర్లు ఇతర జంక్‌ఫుడ్స్‌లో ఈ యాంటీఆక్సిడెంట్స్ పాళ్లు గణనీయంగా తగ్గుతుంటాయి. అంతేకాదు ప్రాసెస్ చేసిన ప్రతి ఆహారంలోనూ అవి తగ్గుతూ పోతుంటాయి. దాంతో కణానికి తమను తాము శుభ్రం చేసుకునే సామర్థం అందకుండా పోతుంటుంది. ఫలితంగా కణం మరింత కాలుష్యభరితం అవుతుంటుంది. అలా కాలుష్యభరితం కావడమే క్యాన్సర్‌కు దోహదం చేస్తుందని వివరిస్తున్నారు ఆ పరిశోధనల్లో పాలుపంచుకున్న నిపుణుడు డాక్టర్ హసన్ హబౌబీ. -
జంక్‌ఫుడ్ అదే పనిగా తింటే రొమ్ముక్యాన్సర్ ముప్పు ఎక్కువ!
పరిపరిశోధన టీనేజీలో పిల్లల్లో అదేపనిగా బర్గర్లు, జంక్‌ఫుడ్ తినే అలవాటు మరీ ఎక్కువైతే, అది భవిష్యత్తులో రొమ్ముక్యాన్సర్‌కు దారితీయవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కౌమార వయసులోని పిల్లలు తీసుకునే జంక్ఫుడ్స్, కేక్స్, బిస్కెట్ల వంటి పదార్థాల్లోని కొవ్వులు, నూనెల వల్ల వారు పెద్దయ్యాక అనర్థాలు కనిపించే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌కు చెందిన నిపుణుల అధ్యయనంలో తేలింది. ఆ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ విభాగం వారు 1998లో దాదాపు పదేళ్ల వయసుకు అటూ ఇటూగా ఉన్న కొంతమంది పిల్లల డేటాను సేకరించారు. అప్పటి నుంచి వారి ఆరోగ్య వివరాలను తరచూ నమోదు చేస్తూ ఉన్నారు. ‘డయటరీ ఇంటర్వెన్షన్ స్టడీ ఇన్ చిల్డ్రెన్’ (డిస్క్) పేరిట తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించారు. ఆ డేటా ఆధారంగా... టీనేజీ సమయంలో స్వాభావికమైన కొవ్వు పదార్థాలు, వెజిటబుల్ నూనెలు లాంటి అన్ని రకాల కొవ్వులు తీసుకునేవారిలో పెద్దయ్యాక రొమ్ముక్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుందని తెలిసింది. అంతేకాదు, పిల్లల కౌమార వయసులో ఉండే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు, పెద్దయ్యాక ఆల్కహాల్ కూడా తోడైతే ఆ ముప్పు మరింత ఎక్కువ అని తేలింది. ఆ అధ్యయన వివరాలన్నీ అమెరికా అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ జర్నల్ అయిన ‘క్యాన్సర్ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్ అండ్ ప్రివెన్షన్’లో ప్రచురితమయ్యాయి. -
బర్గర్ బకాసుర
తిక్క లెక్క ఈ ఫొటోలోని జపానీస్ కుర్రాడు బక్కపల్చగా కనిపిస్తున్నాడు కదా అని తక్కువగా అంచనా వేయకండి. ఇతడి పేరు తకరు కొబాయాషి. టాలెంట్‌లో ఈ కుర్రాడు బకాసురుడికి బ్రదర్‌లాంటోడు. ఇటలీలోని ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో భోజన ప్రతాపాన్ని ప్రదర్శించాడు. మూడు నిమిషాల్లోనే ఏకంగా పన్నెండు బర్గర్లను శుభ్రంగా స్వాహా చేసేసి ప్రేక్షకులను నోళ్లెళ్లబెట్టేలా చేశాడు. ఈ ఘనకార్యంతో ఇతగాడు తంతే గిన్నెస్‌బుక్‌లో పడ్డాడు. -
బొజ్జ బాగోతం
సిరిసంపదలకు చిరుబొజ్జే ఆనవాలు అనే నమ్మకం నానా నాగరికతల్లో అనాదిగా ఉన్నదే. తరాలు మారినా, యుగాలు మారినా ఈ నమ్మకంలో పెద్దగా మార్పు రాలేదు. అలాగని ఇదేమీ మూఢనమ్మకంలాంటిది కాదు. సిరిసంపదలకు అనులోమానుపాతంగా ‘మగా’నుభావుల పొట్టపెరగడం ఒక సహజ పరిణామం. కొందరు పుడుతూనే నోట్లో వెండిచెమ్చాతో పుడతారు. వాళ్లకు బాల్యావస్థలోనే బొజ్జపెరగడం మొదలవుతుంది. ఇంకొందరు యవ్వనదశలోనూ చువ్వల్లా చురుగ్గానే ఉంటారు. చిన్నప్పటి నుంచి ఢక్కామొక్కీలు తిని ఉంటారు. అవకాశం, అదృష్టం కలిసొస్తే ఇక విజృంభిస్తారు. ఈ తిప్పలన్నీ దేనికంటారు? జానెడు పొట్ట కోసం కాదూ! అన్ని రుచులూ తృప్తిగా ఆరగించకపోతే ఈ దిక్కుమాలిన సంపాదనంతా దేనికోసమంటారు? లోకంలో ఎవరేమనుకుంటే నాకేం..? ఎవరెలా పోతే నాకేం..? చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష! ఇదిగో! ఇలా అనుకోవడం వల్లనే చాలామంది జానెడు పొట్టను బానలా పెంచేసుకుపోతారు. పెళ్లయిన కొత్తలో కొసరి కొసరి వడ్డించే భార్య ‘చిరుబొజ్జే సింగారం’ అంటుంటే తెగ మురిసిపోతూ రెచ్చిపోయి మరీ భోజన ప్రతాపాన్ని ప్రదర్శిస్తారు. కొన్నేళ్లు గడిచాక చూసుకుంటే ఏముంటుంది? బానెడు పొట్ట... ఆ పొట్టతో పాటు వచ్చే నడుం నొప్పి, కీళ్ల నొప్పులు, సుగర్, బీపీ... వగైరా వగైరా ఉచిత బహుమతులు. అసలే ఉచితంగా వచ్చిన బహుమతులాయె! వదిలించుకుందామనుకున్నా ఒక పట్టాన వదిలి చావవు. పుట్టినప్పుడు పొట్ట అందరికీ దాదాపు ఒకేలా ఉంటుంది. ఎదిగే క్రమంలోనే మార్పులు వస్తాయి. అలాగని జానెడు పొట్ట గాలి నింపిన బెలూన్లా అమాంతం ఒకేసారిగా ఉబ్బిపోదు. జిహ్వచాపల్యం ఆపుకోలేక దొరికినదల్లా నమిలి మింగేస్తూ ఉంటేనే... ఇంతై ఇంతింతై అన్నట్లుగా బానపొట్ట తయారవుతుంది. అదేపనిగా కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయని హెచ్చరించిన పెద్దలు ఆ పని వల్ల పొట్ట బానలా పెరిగిపోతుందని, అది ఒక పట్టాన తరగదని హెచ్చరించకపోవడం నిజంగా ఒక చారిత్రక అపరాధం. పెద్దల మాట చద్దిమూట అంటారు గానీ, ఈ రోజుల్లో పెద్దల మాటలు, చద్ది మూటలు ఎవరికి రుచిస్తున్నాయి గనుక? పిజ్జా బర్గర్ల కాలం వచ్చిపడ్డాక స్కూళ్లకు వెళ్లే పిల్లకాయలు కూడా బొజ్జగణపయ్యల్లా తయారవుతున్నారు. అసలు బొజ్జగణపయ్యకు తొలిపూజలు చేయడం ఆచారంగా వస్తున్నందు వల్లే మన దేశంలో బొజ్జకు గ్లామర్ పెరిగిందేమోనని అనుమానం! బానపొట్టల సమస్య మన దేశానికి మాత్రమే పరిమితం కాదు, అన్ని దేశాల్లోనూ ఉన్నదే. అమెరికాది అగ్రరాజ్యాల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. అగ్రరాజ్యాలు ఇప్పుడిప్పుడే ఈ సమస్యను గుర్తించి, పొట్టలు కరిగించే దిశగా చర్యలు ప్రారంభిస్తున్నాయి. మన దేశంలో మాత్రం ఈ సమస్యపై ఏలినవారు ఇంకా కళ్లు తెరవలేదు. అఫ్కోర్స్, మన దేశంలో బానపొట్టలకు రెట్టింపు సంఖ్యలో వీపులను అంటుకుపోయే సైజ్‌జీరో పొట్టలూ ఉన్నాయనుకోండి. సైజ్‌జీరో పొట్టల్లో ముఖ్యంగా రెండురకాలు కనిపిస్తాయి. గ్లామర్ కోసం కష్టపడి కడుపు మాడ్చుకుని సాధించేవి కొన్నయితే, తప్పనిసరి పస్తుల వల్ల మలమలమాడి ఎండిన పొట్టలు మరికొన్ని. మాడిన పొట్టల్లో కాస్త ఆహారం నింపితే చాలు ఆరోగ్యంగా కోలుకుంటాయి. అయితే, బానపొట్టలను కరిగించి ఆరోగ్యకరంగా ఆరుపలకలతో అలరారేలా తీర్చిదిద్దడం అంత వీజీ కాదు గురూ! అసలే మగజన్మలకు బతుకే పెనుభారం. చిన్నప్పుడు చదువుల భారం. చదువు పూర్తయ్యాక ఉద్యోగ భారం. ఉద్యోగ భారం ఇంకా అలవాటు కాకముందే పెళ్ళయ్యాక మీదపడే సంసార భారం. అలాంటిది జానెడున్న పొట్ట కాస్త బానెడుగా విస్తరిస్తే, ఆ నడమంత్రపు అదనపు భారాన్ని తట్టుకోవడం అంత తేలిక కాదు. అడుగు తీసి అడుగు వేయడమే కష్టమవుతుంది. ఎలాగోలా శక్తి కూడదీసుకుని గునగునమని వీధిలో నడుస్తూ ఉంటే గమనించే కుర్రకారు ‘కొబ్బరిబొండాం’ వంటి బిరుదులతో బహిరంగ రహస్యంగా సత్కరించేస్తారు. తెల్లారగట్లే వాకింగ్‌కు వెళ్దామనే ఉంటుంది. వీధిలో పాడు కుక్కలు వెంటపడితే పరుగు లంఘించుకునే శక్తి ఉండదు కదా! అందుకే ఆ కార్యక్రమానికి వాయిదా పడుతుంది. ఆరుపలకలేం అక్కర్లేదు గానీ, చదునైన ఏకపలక పొట్ట దక్కితే చాలురా భగవంతుడా! అని మొరపెట్టుకోని రోజు ఉండదు. జిమ్‌లో చేరాలనే ఉంటుంది. బరువులను చూస్తే భయం, గుండెదడ మొదలవుతాయి. అయినా తెగించి, బరువులెత్తితే ఆయాసం ముంచుకొస్తుంది. పొట్ట కరగడం దేవుడెరుగు! ఒంటినొప్పులు మొదలవుతాయి. సిరిసంపదలకు చిరుబొజ్జే ఆనవాలు అనే నమ్మకం నానా నాగరికతల్లో అనాదిగా ఉన్నదే. తరాలు మారినా, యుగాలు మారినా ఈ నమ్మకంలో పెద్దగా మార్పు రాలేదు. అలాగని ఇదేమీ మూఢనమ్మకంలాంటిది కాదు. సిరిసంపదలకు అనులోమానుపాతంగా ‘మగా’నుభావుల పొట్టపెరగడం ఒక సహజ పరిణామం. కొందరు పుడుతూనే నోట్లో వెండిచెమ్చాతో పుడతారు. వాళ్లకు బాల్యావస్థలోనే బొజ్జపెరగడం మొదలవుతుంది. ఇంకొందరు యవ్వనదశలోనూ చువ్వల్లా చురుగ్గానే ఉంటారు. చిన్నప్పటి నుంచి ఢక్కామొక్కీలు తిని ఉంటారు. అవకాశం, అదృష్టం కలిసొస్తే ఇక విజృంభిస్తారు. ఆబగా సిరిసంపదలను పోగేసుకుంటారు. బ్యాంకులో డబ్బును దాచుకున్నంత భద్రంగా ఒంట్లో కొవ్వును దాచుకుంటారు. వాళ్లకు సంప్రాప్తించిన నడమంత్రపు సిరిలాగానే, వాళ్ల నడమంత్రపు బొజ్జ కూడా అంతకంతకూ పెరిగిపోతూ ఉంటుంది. బొజ్జబాబులందరూ బొజ్జలు కరగాలని కోరుకుంటూ ఉంటారు. నానా దేవుళ్లకీ మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు. ఇందులో వింతేమీ లేదు. ఈ ‘పైసా’చిక లోకంలో కొందరు మాత్రం దేశంలో బొజ్జలు వర్ధిల్లాలంటూ బొజ్జగణపయ్యకు పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకైనా మంచిదని భారీ బొజ్జతో అట్టహాసాన్ని చిందించే లాఫింగ్ బుద్ధుడిని కూడా ఆరాధిస్తూ ఉంటారు. బొజ్జలు కరిగించడమే వాళ్ల వ్యాపారం. జిమ్ పరికరాలతో కొందరు, లిపోసక్షన్స్ అంటూ ఇంకొందరు పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలతో ఊదరగొట్టేస్తూ ఉంటారు. సిటింగుకు ఐదు కిలోల చొప్పున అరడజను సిటింగుల్లోనే ఎంతటి భారీ బొజ్జలనైనా అవలీలగా కరిగించేస్తామంటూ నమ్మబలుకుతూ ఉంటారు. బొజ్జలోనే కాదు, ఒంట్లో ఎక్కడ కొవ్వు పేరుకుపోయినా రిటైల్‌గా, హోల్‌సేల్‌గా కరిగించేస్తాం అంటూ టీవీ ప్రకటనల్లో బొద్దుగుమ్మల చేత చెప్పిస్తారు. బొర్ర తప్ప బుర్ర పెరగని బకరాలు అలాంటి ప్రకటనలను అమాయకంగా నమ్మేస్తారు. అక్కడికి వెళితే పొట్ట కరిగినా కరగకపోయినా, పర్సు కరగడం మాత్రం ఖాయం. మరీ ఆత్రపడి, కొవ్వు తొలగించుకోవడానికి కోతలకు సిద్ధపడితే ప్రాణాల మీదకు వచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు. - పన్యాల జగన్నాథ దాసు -
బకాసుర బర్గర్
పరిపరి శోధన మామూలుగా బర్గర్లు ఎంత ఉంటాయి? అరచేతిలో ఇమిడిపోతాయి. మహా అయితే దోసిట్లో ఒదిగిపోతాయి. ఈ ఫొటోలో కనిపిస్తున్నది భారీగా తయారు చేసిన బర్గర్ శిల్పమేమీ కాదు, నిజమైన తినదగ్గ బర్గరే! దీని బరువు ఎంతంటారా? కేవలం 84.3 కిలోలు మాత్రమే. అమెరికాలోని మిషిగాన్ రాష్ట్రం సౌత్గేట్లో ‘మ్యాలీస్ స్పోర్ట్స్ గ్రిల్ అండ్ బార్’ 2009లో ఈ బకాసుర బర్గర్‌ను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. అమ్మకానికి అందుబాటులో ఉన్న అతిపెద్ద బర్గర్‌గా గిన్నెస్‌బుక్‌లోకి ఎక్కింది. దీని ధర ఎంతో కాదు, 400 డాలర్లు (సుమారు రూ.27,400) మాత్రమే!