సన్నటి మంట మీద ఆలివ్ ఆయిల్ చుక్కలతో ఉడికించిన గొడ్డుమాంసం ముక్కల్ని.. బన్‌ల మధ్యలో ఉంచి, దానికి కాస్త స్పెషల్ సాస్, అమెరికన్ చీజ్, పికిల్స్, ఆనియన్స్‌ను జతచేస్తే.. హాంబర్గర్ రెడీ అయినట్లే. ఇక ప్రఖ్యాత మెక్‌డోనాల్డ్స్‌లో తయారయ్యే బిగ్ మాక్ హాంబర్గరైతే.. ఎంత వరల్డ్ ఫేమసో చెప్పుకోవాల్సిన పనిలేదు. మెక్‌డోనాల్డ్స్ ఆహార ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తం కావడాన్ని క్యాపిటలిజం వ్యాప్తిగానూ అభివర్ణించే ఆర్థికవేత్తలు కొందరు.. ఏకంగా ఆకలి సూచికి ‘బిగ్ మాక్ ఇండెక్స్’ అని పేరు కూడా పేరుపెట్టారు. ఇక అమెరికాకే చెందిన ప్రఖ్యాత క్యాపిటలిస్టు, ప్రస్తుత దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం బిగ్ మాక్ అంటే నాలుక కోసుకుంటారు. ‘‘దాన్ని అలా అలా నోట్లో పెట్టుకుని కొరికితే.. వావాహ్.. ఆ టేస్టే వేరప్ప!’’ అనేది ఒకప్పటి ట్రంప్ మాట! ఇప్పుడాయన గొడ్డుమాంసం తినడం మానేశారు!
ట్రంప్ ఫిట్‌నెస్‌పై ఆందోళన : పలు అనుమానాలు, విమర్శల నేపథ్యంలో కొద్ది రోజుల కిందట ట్రంప్ చేయించుకున్న సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు ప్రాధాన్యం సంతరించుకున్న సంగతి తెలిసిందే. నాటి టెస్టుల్లో ఆయన ఆరోగ్యం భేషుగ్గా ఉందని తేలింది. అయితే ఫిట్‌నెస్ కాస్త ఆందోళనకరంగాఉంది. 6అడుగుల 3 అంగుళాల ఎత్తు, 71 ఏళ్ల వయసున్న ట్రంప్ 239 పౌండ్ల(108.4 కేజీల) బరువున్నారు. ఒబెసిటీ(అధికబరువు) కేటగిరీకి అతి చేరువలో ఉన్న ట్రంప్ డైట్ పాటించకుంటే ప్రమాదం ఎదుర్కోకతప్పదని వైట్‌హౌస్ ఫిజీషియన్ డాక్టర్ రోనీ జాక్సన్ సూచించారు. ఆ మేరకు గడిచిన రెండు వారాలుగా ట్రంప్ గొడ్డుమాంసం తినడం పూర్తిగా మానేశారు. అప్పటి నుంచి ఫిష్ శాండ్‌విచ్ (ఫిష్ ఓ ఫిలెట్), ఫ్రూట్ సలాడ్స్, చాక్లెట్ మిల్క్ షేక్‌లను మాత్రమే తీసుకుంటున్నారు.
విషప్రయోగ భయం! : బడా రియల్టర్ పుత్రుడిగా బిజినెస్‌లోకి ప్రవేశించిన డొనాల్డ్ ట్రంప్.. అతికొద్ది కాలంలోనే వ్యాపార సామ్రాజ్యాన్ని శిఖరస్థాయికి చేర్చారు. శత్రువుల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండే ట్రంప్.. ఆహారం విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. బయటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆహారాన్ని ముట్టనుగాక ముట్టరు! ప్రతి సందర్భంలోనూ మెక్‌డోనాల్డ్స్ నుంచి తెప్పించే బిగ్ మాక్‌ను మాత్రమే ఆరగించేవారు. తన ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఇలానే వ్యవహరించారు. ‘‘నాకు శుభ్రంగా ఉండటం చాలా ఇష్టం. పనిలో భాగంగా రకరకాల చోట్లకు వెళతాం. అయితే అక్కడ తయారుచేసిన ఆహారం శుభ్రంగా వండారా, లేదాని చెప్పలేం. మెక్‌డోనల్డ్స్ సురక్షిత ప్రమాణాలు పాటిస్తుంది కాబట్టే వాళ్ల బర్గర్లు మాత్రమే తింటా’’ అని ట్రంప్ ఓ సందర్భంలో చెప్పారు.
అయితే ట్రంప్ జాగ్రత్తల వెనుక ‘విషప్రయోగం’ భయం కూడా ఉందని ప్రఖ్యాత జర్నలిస్టు మిచెల్ వూల్ఫ్ అంటారు. ఇటీవలే తాను రాసిన ‘ఫైర్ అండ్ ఫ్యూరీ’ పుస్తకంలో ట్రంప్ గురించిన అనేక రహస్య విషయాలను చెప్పుకొచ్చారాయన. ‘‘ఆహారంలో విషప్రయోగం జరగొచ్చనే ఆందోళన ట్రంప్‌లో చాలా కాలంగా ఉంది. అందుకే ఆయన బయటికెళ్లినప్పుడు.. సురక్షితంగా వండిన మెక్‌డోనాల్డ్స్ పదార్థాలను మాత్రమే తినడానికి ఇష్టపడతారు. ఇది ఎప్పుడు మొదలైందో చెప్పలేనుగానీ, దశాబ్ధాలుగా ట్రంప్ ఇలానే చేస్తున్నారు’’ అని మిచెల్ వూల్ఫ్ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment