
బర్గర్లు ఎందుకు బ్యాడ్ ఫుడ్ అంటే..!
బర్గర్లు, పిజ్జాలు ఆరోగ్యానికి అంత మేలు చేయవని అందరూ చెబుతుంటారు. పైగా పెరిగే పిల్లల్లో స్థూలకాయం వంటివి తెచ్చి వాళ్ల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తాయని అంటుంటారు. అయితే దీనికి కొన్ని నిర్దిష్టమైన నిదర్శనాలు ఇస్తున్నారు పరిశోధకులు. యునెటైడ్ కింగ్‌డమ్‌కు చెందిన శ్వాన్‌సీ యూనివర్సిటీ నిపుణులు కొన్ని తాజా అధ్యయనాల ఆధారంగా బర్గర్ల వంటివి ఎందుకు చేటు చేస్తాయో వివరిస్తున్నారు. వారు చెబుతున్న దాని ప్రకారం... అత్యంత సూక్ష్మమైన కణాలలో కార్బన్ డయాక్సైడ్ వంటి కలుషితమైన పదార్థాల నుంచి తమను తాము శుభ్రం చేసుకునే సామర్థ్యం ఉంటుంది.
ఈ కాలుష్యాలను విజయవంతంగా హరించే ఆహార పోషకాలను ‘యాంటీ ఆక్సిడెంట్స్’ అంటారన్న ది తెలిసిందే. బర్గర్లు ఇతర జంక్‌ఫుడ్స్‌లో ఈ యాంటీఆక్సిడెంట్స్ పాళ్లు గణనీయంగా తగ్గుతుంటాయి. అంతేకాదు ప్రాసెస్ చేసిన ప్రతి ఆహారంలోనూ అవి తగ్గుతూ పోతుంటాయి. దాంతో కణానికి తమను తాము శుభ్రం చేసుకునే సామర్థం అందకుండా పోతుంటుంది. ఫలితంగా కణం మరింత కాలుష్యభరితం అవుతుంటుంది. అలా కాలుష్యభరితం కావడమే క్యాన్సర్‌కు దోహదం చేస్తుందని వివరిస్తున్నారు ఆ పరిశోధనల్లో పాలుపంచుకున్న నిపుణుడు డాక్టర్ హసన్ హబౌబీ.