బొజ్జ బాగోతం | panyala jagannath tells about big stomach | Sakshi
Sakshi News home page

బొజ్జ బాగోతం

Published Sun, Mar 6 2016 10:47 PM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM

బొజ్జ బాగోతం

బొజ్జ బాగోతం

సిరిసంపదలకు చిరుబొజ్జే ఆనవాలు అనే నమ్మకం నానా నాగరికతల్లో అనాదిగా ఉన్నదే. తరాలు మారినా, యుగాలు మారినా ఈ నమ్మకంలో పెద్దగా మార్పు రాలేదు. అలాగని ఇదేమీ మూఢనమ్మకంలాంటిది కాదు. సిరిసంపదలకు అనులోమానుపాతంగా ‘మగా’నుభావుల పొట్టపెరగడం ఒక సహజ పరిణామం. కొందరు పుడుతూనే నోట్లో వెండిచెమ్చాతో పుడతారు. వాళ్లకు బాల్యావస్థలోనే బొజ్జపెరగడం మొదలవుతుంది. ఇంకొందరు యవ్వనదశలోనూ చువ్వల్లా చురుగ్గానే ఉంటారు. చిన్నప్పటి నుంచి ఢక్కామొక్కీలు తిని ఉంటారు. అవకాశం, అదృష్టం కలిసొస్తే ఇక విజృంభిస్తారు.
 
ఈ తిప్పలన్నీ దేనికంటారు? జానెడు పొట్ట కోసం కాదూ! అన్ని రుచులూ తృప్తిగా ఆరగించకపోతే ఈ దిక్కుమాలిన సంపాదనంతా దేనికోసమంటారు? లోకంలో ఎవరేమనుకుంటే నాకేం..? ఎవరెలా పోతే నాకేం..? చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష!
 
ఇదిగో! ఇలా అనుకోవడం వల్లనే చాలామంది జానెడు పొట్టను బానలా పెంచేసుకుపోతారు. పెళ్లయిన కొత్తలో కొసరి కొసరి వడ్డించే భార్య ‘చిరుబొజ్జే సింగారం’ అంటుంటే తెగ మురిసిపోతూ రెచ్చిపోయి మరీ భోజన ప్రతాపాన్ని ప్రదర్శిస్తారు. కొన్నేళ్లు గడిచాక చూసుకుంటే ఏముంటుంది? బానెడు పొట్ట... ఆ పొట్టతో పాటు వచ్చే నడుం నొప్పి, కీళ్ల నొప్పులు, సుగర్, బీపీ... వగైరా వగైరా ఉచిత బహుమతులు. అసలే ఉచితంగా వచ్చిన బహుమతులాయె! వదిలించుకుందామనుకున్నా ఒక పట్టాన వదిలి చావవు.
 
పుట్టినప్పుడు పొట్ట అందరికీ దాదాపు ఒకేలా ఉంటుంది. ఎదిగే క్రమంలోనే మార్పులు వస్తాయి. అలాగని జానెడు పొట్ట గాలి నింపిన బెలూన్‌లా అమాంతం ఒకేసారిగా ఉబ్బిపోదు. జిహ్వచాపల్యం ఆపుకోలేక దొరికినదల్లా నమిలి మింగేస్తూ ఉంటేనే... ఇంతై ఇంతింతై అన్నట్లుగా బానపొట్ట తయారవుతుంది. అదేపనిగా కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయని హెచ్చరించిన పెద్దలు ఆ పని వల్ల పొట్ట బానలా పెరిగిపోతుందని, అది ఒక పట్టాన తరగదని హెచ్చరించకపోవడం నిజంగా ఒక చారిత్రక అపరాధం.

పెద్దల మాట చద్దిమూట అంటారు గానీ, ఈ రోజుల్లో పెద్దల మాటలు, చద్ది మూటలు ఎవరికి రుచిస్తున్నాయి గనుక? పిజ్జా బర్గర్ల కాలం వచ్చిపడ్డాక స్కూళ్లకు వెళ్లే పిల్లకాయలు కూడా బొజ్జగణపయ్యల్లా తయారవుతున్నారు. అసలు బొజ్జగణపయ్యకు తొలిపూజలు చేయడం ఆచారంగా వస్తున్నందు వల్లే మన దేశంలో బొజ్జకు గ్లామర్ పెరిగిందేమోనని అనుమానం!
 
బానపొట్టల సమస్య మన దేశానికి మాత్రమే పరిమితం కాదు, అన్ని దేశాల్లోనూ ఉన్నదే. అమెరికాది అగ్రరాజ్యాల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. అగ్రరాజ్యాలు ఇప్పుడిప్పుడే ఈ సమస్యను గుర్తించి, పొట్టలు కరిగించే దిశగా చర్యలు ప్రారంభిస్తున్నాయి. మన దేశంలో మాత్రం ఈ సమస్యపై ఏలినవారు ఇంకా కళ్లు తెరవలేదు. అఫ్‌కోర్స్, మన దేశంలో బానపొట్టలకు రెట్టింపు సంఖ్యలో వీపులను అంటుకుపోయే సైజ్‌జీరో పొట్టలూ ఉన్నాయనుకోండి. సైజ్‌జీరో పొట్టల్లో ముఖ్యంగా రెండురకాలు కనిపిస్తాయి. గ్లామర్ కోసం కష్టపడి కడుపు మాడ్చుకుని సాధించేవి కొన్నయితే, తప్పనిసరి పస్తుల వల్ల మలమలమాడి ఎండిన పొట్టలు మరికొన్ని.

మాడిన పొట్టల్లో కాస్త ఆహారం నింపితే చాలు ఆరోగ్యంగా కోలుకుంటాయి. అయితే, బానపొట్టలను కరిగించి ఆరోగ్యకరంగా ఆరుపలకలతో అలరారేలా తీర్చిదిద్దడం అంత వీజీ కాదు గురూ! అసలే మగజన్మలకు బతుకే పెనుభారం. చిన్నప్పుడు చదువుల భారం. చదువు పూర్తయ్యాక ఉద్యోగ భారం. ఉద్యోగ భారం ఇంకా అలవాటు కాకముందే పెళ్ళయ్యాక మీదపడే సంసార భారం. అలాంటిది జానెడున్న పొట్ట కాస్త బానెడుగా విస్తరిస్తే, ఆ నడమంత్రపు అదనపు భారాన్ని తట్టుకోవడం అంత తేలిక కాదు. అడుగు తీసి అడుగు వేయడమే కష్టమవుతుంది.

ఎలాగోలా శక్తి కూడదీసుకుని గునగునమని వీధిలో నడుస్తూ ఉంటే గమనించే కుర్రకారు ‘కొబ్బరిబొండాం’ వంటి బిరుదులతో బహిరంగ రహస్యంగా సత్కరించేస్తారు. తెల్లారగట్లే వాకింగ్‌కు వెళ్దామనే ఉంటుంది. వీధిలో పాడు కుక్కలు వెంటపడితే పరుగు లంఘించుకునే శక్తి ఉండదు కదా! అందుకే ఆ కార్యక్రమానికి వాయిదా పడుతుంది. ఆరుపలకలేం అక్కర్లేదు గానీ, చదునైన ఏకపలక పొట్ట దక్కితే చాలురా భగవంతుడా! అని మొరపెట్టుకోని రోజు ఉండదు. జిమ్‌లో చేరాలనే ఉంటుంది. బరువులను చూస్తే భయం, గుండెదడ మొదలవుతాయి. అయినా తెగించి, బరువులెత్తితే ఆయాసం ముంచుకొస్తుంది. పొట్ట కరగడం దేవుడెరుగు! ఒంటినొప్పులు మొదలవుతాయి.

సిరిసంపదలకు చిరుబొజ్జే ఆనవాలు అనే నమ్మకం నానా నాగరికతల్లో అనాదిగా ఉన్నదే. తరాలు మారినా, యుగాలు మారినా ఈ నమ్మకంలో పెద్దగా మార్పు రాలేదు. అలాగని ఇదేమీ మూఢనమ్మకంలాంటిది కాదు. సిరిసంపదలకు అనులోమానుపాతంగా ‘మగా’నుభావుల పొట్టపెరగడం ఒక సహజ పరిణామం. కొందరు పుడుతూనే నోట్లో వెండిచెమ్చాతో పుడతారు. వాళ్లకు బాల్యావస్థలోనే బొజ్జపెరగడం మొదలవుతుంది.

ఇంకొందరు యవ్వనదశలోనూ చువ్వల్లా చురుగ్గానే ఉంటారు. చిన్నప్పటి నుంచి ఢక్కామొక్కీలు తిని ఉంటారు. అవకాశం, అదృష్టం కలిసొస్తే ఇక విజృంభిస్తారు. ఆబగా సిరిసంపదలను పోగేసుకుంటారు. బ్యాంకులో డబ్బును దాచుకున్నంత భద్రంగా ఒంట్లో కొవ్వును దాచుకుంటారు. వాళ్లకు సంప్రాప్తించిన నడమంత్రపు సిరిలాగానే, వాళ్ల నడమంత్రపు బొజ్జ కూడా అంతకంతకూ పెరిగిపోతూ ఉంటుంది.

బొజ్జబాబులందరూ బొజ్జలు కరగాలని కోరుకుంటూ ఉంటారు. నానా దేవుళ్లకీ మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు. ఇందులో వింతేమీ లేదు. ఈ ‘పైసా’చిక లోకంలో కొందరు మాత్రం దేశంలో బొజ్జలు వర్ధిల్లాలంటూ బొజ్జగణపయ్యకు పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకైనా మంచిదని భారీ బొజ్జతో అట్టహాసాన్ని చిందించే లాఫింగ్ బుద్ధుడిని కూడా ఆరాధిస్తూ ఉంటారు. బొజ్జలు కరిగించడమే వాళ్ల వ్యాపారం.

జిమ్ పరికరాలతో కొందరు, లిపోసక్షన్స్ అంటూ ఇంకొందరు పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలతో ఊదరగొట్టేస్తూ ఉంటారు. సిటింగుకు ఐదు కిలోల చొప్పున అరడజను సిటింగుల్లోనే ఎంతటి భారీ బొజ్జలనైనా అవలీలగా కరిగించేస్తామంటూ నమ్మబలుకుతూ ఉంటారు. బొజ్జలోనే కాదు, ఒంట్లో ఎక్కడ కొవ్వు పేరుకుపోయినా రిటైల్‌గా, హోల్‌సేల్‌గా కరిగించేస్తాం అంటూ టీవీ ప్రకటనల్లో బొద్దుగుమ్మల చేత చెప్పిస్తారు. బొర్ర తప్ప బుర్ర పెరగని బకరాలు అలాంటి ప్రకటనలను అమాయకంగా నమ్మేస్తారు. అక్కడికి వెళితే పొట్ట కరిగినా కరగకపోయినా, పర్సు కరగడం మాత్రం ఖాయం. మరీ ఆత్రపడి, కొవ్వు తొలగించుకోవడానికి కోతలకు సిద్ధపడితే ప్రాణాల మీదకు వచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు.
- పన్యాల జగన్నాథ దాసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement