ఆరోగ్యం చిక్కడం ఎలా..? | Stomach grow even more dangerous | Sakshi
Sakshi News home page

ఆరోగ్యం చిక్కడం ఎలా..?

Published Mon, Apr 27 2015 11:10 PM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM

ఆరోగ్యం  చిక్కడం ఎలా..?

ఆరోగ్యం చిక్కడం ఎలా..?

కాస్త బొద్దుగా ఉన్నంత మాత్రాన తప్పేమీ లేదు. అయితే ఆ బరువు ఒక పరిమితికి లోపు ఉంటేనే అది ఆరోగ్యానికి సూచన. కానీ అదేపనిగా లావెక్కుతున్న కొద్దీ మధుమేహం, హైబీపీ వంటి మహాలావు అనారోగ్యాలు వస్తుంటాయి. అప్పుడు చిక్కితేనే ఆరోగ్యమూ మీ ఒంటికి చిక్కుతుంది. లావుకు  పరిమితి ఏమిటో... అది మించితే వచ్చే అనర్థాలు  ఎలా ఉంటాయో తెలిపేందుకే
 ఈ ప్రత్యేక కథనం.
 
 
పొట్ట పెరగడం మరింత ప్రమాదకరం...


పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడాన్ని సెంట్రల్ ఒబేసిటీ అంటారు. మన పొట్ట చుట్టూ అనేక పొరలు ఉంటాయి. సెంట్రల్ ఒబేసిటీలో కేవలం పొట్ట చర్మం కిందనేగాక పొట్ట కండరాల లోపలివైపు, జీర్ణాశయం, పేగుల చుట్టూ కూడా కొవ్వు పేరుకుపోతుంది. డయాబెటిస్, హైబీపీ, రక్తంలో కొవ్వు పెరిగిపోయే హైపర్ లిపిడేమియా అనే కండిషన్లు.... సాధారణ స్థూలకాయం ఉన్నవారిలో కంటే పొట్ట పెరిగిన వారిలోనే వచ్చేందుకు అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే మామూలు స్థూలకాయంతో పోలిస్తే పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం (పొట్ట పెరగడం) మరింత ప్రమాదకరం.
 
మనమే లావెక్కే పరిస్థితులకు ఉదాహరణలివి

మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండా లిఫ్టులు, ఎస్కలేటర్లు వాడుతున్నాం. టీవీ దగ్గరికి పోకుండానే ఛానెళ్లు మార్చేందుకు రిమోట్ ఉపయోగిస్తున్నాం.స్నానానికి నీళ్లు తోడుకోనవసరం లేకుండా నల్లా (కొళాయి), షవర్స్ ఉన్నాయి.కార్లో దూరప్రయాణం చేస్తూ... కనీసం కారైనా దిగకుండా భోజనాన్ని నోటి దగ్గరకు తెప్పించుకుంటున్నాం. దగ్గరి దూరాలకు కూడా వాహనాలను వాడుతున్నాం.

ఇవన్నీ మనకు మనం తెచ్చిపెట్టుకున్న సుఖదుఃఖాలు. వీటిలో కొన్నింటిని నివారించుకోవచ్చు. ఉదాహరణకు... మన ఆరోగ్యం కోసం లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కడం, టీవీ దగ్గరికి వెళ్లి ఛానెల్ మార్చడం, దగ్గరి దూరాలకు వాహనం ఉపయోగించకపోవడం వంటివి. జీవితాన్ని సుఖవంతం చేయడానికి ఇవన్నీ ఉన్నప్పుడు వీటినెందుకు ఉపయోగించుకోకూడదు అనే ప్రశ్న ఎవరైనా వేయవచ్చు. ఉదాహరణకు చేతికర్రను ఒక వయసు దాటిన తర్వాత పడిపోకుండా ఉండటం కోసం ఉపయోగిస్తాం. అంతేగానీ... ఎంత అందంగా ఉన్నా, ఖరీదైనదైనా అందుబాటులో ఉందికదా అని దాన్ని ఉపయోగించం కదా. అలాగే మోకాళ్ల నొప్పులు ఉన్నవారు, గుండె శస్త్రచికిత్స జరిగినవారూ, ఇతరత్రా కారణాలతో మెట్లు ఉపయోగించలేనివారే లిఫ్ట్‌లను ఉపయోగించాలి. ఇలా మన జీవనశైలిని మనమే మార్చుకోగలిగితే మేలు.
 
లావెక్కే క్రమంలో మన చేతుల్లో లేని పరిస్థితులివి...
 
జన్యుపరమైన అంశాలు  ఎండోక్రైన్ సమస్యలు
 మందుల దుష్ర్పభావం. వీటిని నివారించుకోవడం మన చేతుల్లో లేదు.
 
మనం స్థూలకాయులమా కాదా తెలుసుకోవడం ఎలా?

సాధారణంగా ఒక వ్యక్తి స్థూలకాయుడా, కాదా అని నిర్ధారణ చేయడానికి ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎమ్‌ఐ) అనే ప్రమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. దీన్ని కొలవడమూ చాలా సులభమే. ఒక వ్యక్తి బరువును కిలోగ్రాములలో తీసుకోవాలి. ఆ విలువను అతడి ఎత్తు స్క్వేర్‌తో భాగించాలి. స్క్వేర్ అంటే అదే సంఖ్యను మళ్లీ అదే సంఖ్యతో గుణించడమన్నమాట. ఎత్తు విలువను మీటర్లలో తీసుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి బరువు 130 కిలోలు. అతడి ఎత్తు 1.8 మీటర్లు అనుకుందాం. అప్పుడు అతడి బీఎమ్‌ఐ విలువ =  130 / 1.8 గీ 1.8 = 40.12 కి.గ్రా./మీ2. ఇప్పుడు ఈ విలువను బీఎమ్‌ఐ పట్టికలోని విలువలతో సరిపోల్చుకుని మీరు ఏ స్థూలకాయ స్థాయిలో ఉన్నారో నిర్ణయించుకోవచ్చు. (పైన పేర్కొన్న విలువ వ్యాధిగ్రస్థ స్థూలకాయం కిందికి వస్తుందన్నమాట). ఇలా ఎవరికి వారు తమ బరువును, ఎత్తును కొలుచుకుని తాము పరిమితికి మించి బరువున్నారా లేదా అన్నది తెలుసుకోవచ్చు.
 
బీఎమ్‌ఐ ఆధారంగా నిర్ధారణ చేసే స్థూలకాయ వర్గాలు విదేశీయులతో పోల్చి చూస్తే, భారతీయులలో కాస్త తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే విదేశీయులతో పోల్చి చూస్తే మనకు శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ, కండరాల పరిమాణం తక్కువ. అందువల్ల మన బీఎమ్‌ఐ తక్కువగా ఉన్నప్పటికీ వైద్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.
 
 అనారోగ్యకరమైన ఆహారం అంటే...

కొద్దిమోతాదుల్లో తీసుకున్నప్పటికీ పోషకవిలువలు తక్కువగా ఉండి, క్యాలరీలు ఎక్కువగా ఉండి... మనం బరువు పెరగడానికి తోడ్పడే ఆహారాన్ని అనారోగ్యకరమైన ఆహారంగా పేర్కొనవచ్చు.

ఉదాహరణకు అవి...   క్యాలరీలు తప్ప పోషకాలు లేని శుద్ధిపరిచిన (రిఫైన్‌డ్ ) ఆహారపదార్థాలు  కొవ్వులు, ఐస్‌క్రీమ్‌లు, కేకులు, స్వీట్స్  చక్కెర ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి హాని చేసే బిస్కెట్లు, చాక్లెట్లు, క్యాండీలు, కుకీలు, కూల్‌డ్రింక్స్, ఎనర్జీ డ్రింకులు,  కృత్రిమంగా తయారు చేసిన జ్యూసులు  పిజ్జాలు, బర్గర్‌లు  నూనెలో ఎక్కువసేపు (డీప్‌గా) వేయించిన పదార్థాలు (వడలు, పూరీలు, సమోసాలు, బజ్జీలు, బంగాళదుంప చిప్స్, ఫ్రెంచ్‌ఫ్రైస్).. ఇవన్నీ అనారోగ్యకరమైన ఆహారాలన్నమాట.  ఇక భారతీయుల విషయానికి వస్తే తళతళ మెరిసే తెల్ల అన్నం కూడా అనారోగ్యకరమైనదే. భారతీయులకు వరి అన్నం ప్రధానాహారమే. కానీ దాన్ని శుద్ధిపరచడం వల్ల (బాగా రిఫైన్ చేయడం వల్ల) మెతుకులు పోషకాలన్నీ కోల్పోయి తెల్లగా తళతళలాడుతూ కనిపిస్తుంటాయి. అంతే ఈ అన్నంలో క్యాలరీలు తప్ప, పోషకాలేమీ లేవన్నమాట. ఇలాంటి తెల్ల అన్నం తినడం వల్ల స్థూలకాయ సమస్య, చక్కెర వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువని పరిశోధనల్లో తేలింది.
 
అనారోగ్యకరమైన ఆహారాన్ని అప్పుడప్పుడు తీసుకోవచ్చా?


అనారోగ్యకరమైన ఆహారం ప్రమాదకరమని అనుకున్న తర్వాత అప్పుడప్పుడూ కొంచెం కొంచెం తీసుకోవచ్చా అని అడిగితే?... అది ప్రమాదకరం అని తెలిసి కూడా తీసుకోవచ్చని మీరు భావిస్తే తీసుకోండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వ్యసనాల వంటివి. వ్యసనాలను  వదిలించుకోవడం అంత సులభం కాదు. కాబట్టి అప్పుడప్పుడైనా తీసుకోవాలా, లేదా అని మీకు మీరే నిర్ణయించుకోవాలి.
 
ఎంత తిన్నాం అన్నది కాదు... ఏమి తిన్నాం అన్నది ముఖ్యం  (శక్తి సమతుల్యత)
 
శరీరం నిత్యం కొంత శక్తిని ఖర్చు పెడుతూనే ఉంటుంది. మనం నిద్రలో ఉన్నా కూడా కొంత శక్తి ఖర్చవుతూనే ఉంటుంది. ఈ శక్తిని బేసల్ మెటబాలిక్ రేట్ లేదా బేసల్ ఎనర్జీ ఎక్స్‌పెండిచర్ అంటారు. ఇది మనిసి ఎత్తు, బరువు, వయసు, కండరాల పరిమాణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇది సరాసరి 1000 నుంచి 1500 క్యాలరీల మధ్య ఉంటుంది. కొంతమందిలో ఇది 2500 క్యాలరీల వరకు కూడా ఉండవచ్చు. మనిషి జబ్బుపడినా, కొన్ని రకాల మందులు వాడినా, కండరాలను బలపరిచే వ్యాయామం చేసినా బేసల్ మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ ఇది తగ్గుతుంది. అవసరాన్ని బట్టి శరీరం బేసల్ మెటబాలిక్ రేట్‌ను పెంచుకోగలదు లేదా తగ్గించుకోగలదు. బేసల్ మెటబాలిక్ రేట్‌కూ, శరీరంలో ఉష్ణం ఉత్పత్తి కావడానికి ఖర్చయ్యే శక్తిని, మనం రోజూ ఇతర పనులకోసం (వ్యాయామం, రోజువారీ పనులు) ఉపయోగించే శక్తిని కలిపితే ‘టోటల్ ఎనర్జీ ఎక్స్‌పెండిచర్’ వస్తుంది. శక్తి సమతుల్యతను కాపాడే హార్మోన్లు, శరీర బరువును అవి నిర్ణయించిన ‘‘సెట్ పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజీ’’ దగ్గరే ఉంచడానికి, అవసరమైతే అధికంగా తీసుకున్న క్యాలరీలను కరిగించి ఉష్ణం రూపంలో శరీరంలో నుంచి బయటకు పంపించేస్తాయి.

ఈ ప్రక్రియ శరీరంలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు మీ బేసల్ మెటబాలిక్ రేట్ 1300 క్యాలరీలు అనుకోండి. మీది శారీరక శ్రమ లేని జీవనశైలి అనుకోండి. దీనికి తగ్గట్టుగా మీరు రోజుకు 2300 క్యాలరీలు తీసుకుంటున్నారనుకోండి. అంటే మీరు వ్యాయామం చేయకపోగా, ప్రతిరోజూ అవసరమైన దాని కంటే 1000 క్యాలరీలు అధికంగా తీసుకుంటున్నారన్నమాట. ఇలా అధికంగా తీసుకున్న ఈ క్యాలరీలను శరీరం కరిగించకపోతే, రోజుకు 111 గ్రాముల బరువు, నెలకు 3.3 కిలోలు, ఏడాదికి 40 కిలోల కొవ్వు శరీరంలో పేరుకుంటుంది. కానీ మీరు అంత బరువు పెరగడం లేదు. శక్తి సమతుల్యతను కాపాడే హార్మోన్లు, ఈ అధికంగా తీసుకున్న క్యాలరీలను ఉష్ణం రూపంలోకి మార్చి సమతుల్యతను కాపాడుతుంటాయి. శక్తి సమతుల్యతను ఇంత పకడ్బందీగా కాపాడుతున్నప్పటికీ మనం బరువు ఎందుకు పెరుగుతాం? ఎందుకంటే మనం ఎంత తీసుకున్నామనే విషయం కంటే ఏమి తీసుకున్నాం అన్న అంశమే చాలా ముఖ్యం. అనారోగ్యకరమైన ఆహారపదార్థాలు ‘కొవ్వు సెట్ పాయింట్’ను పెంచుతాయి. అంటే బర్గర్లు, పిజ్జాలు, నూనెతో నిండిన ఆహారపదార్థాలు తినకముందుకంటే తిన్న తర్వాత ‘ఫ్యాట్ సెట్ పాయింట్’ పెరుగుతుంది. అంటే వీటిని తినకముందు కంటే తిన్న తర్వాత, పెరిగిన ‘ఫ్యాట్ సెట్ పాయింట్’ దగ్గర కొవ్వును ఉంచడానికి సరిపడా టోటల్ ఎనర్జీ ఎక్స్‌పెండిచర్‌ను ఈ హార్మోన్లు తగ్గిస్తాయి.

ఉదాహరణకు మీకు రోజుకు 2300 క్యాలరీలు అవసరం. అందులో 1300 క్యాలరీలు జీవక్రియలకు (బేసల్ మెటబాలిక్ రేట్‌కు) పోగా మిగిలిన 1000 క్యాలరీలను ఉష్ణం రూపంలోకి ఈ హార్మోన్లు మారుస్తున్నాయనుకుందాం. ఇప్పుడు అదనంగా 200 క్యాలరీలను ఇచ్చే ఆయిల్ ఫుడ్‌ను మీరు తిన్నారు. దీని కారణంగా ‘ఫ్యాట్ సెట్ పాయింట్’ కొంచెం పెరిగింది. అంటే మొత్తం 2500 కాలరీలను ఇచ్చే ఆహారం తీసుకున్నారు. ఇప్పుడు హార్మోన్లు పెరిగిన ‘ఫ్యాట్ సెట్ పాయింట్’ను దృష్టిలో ఉంచుకుని, ఆ మేరకు ఎక్కువ కొవ్వును నిల్వ చేసుకోడానికి సిద్ధమవుతాయి. ఇప్పుడు మీరు వ్యాయామం చేసి 200 క్యాలరీలను ఖర్చుపెట్టారనుకుందాం. అప్పుడు మీ శరీరం మొత్తం 2500 ఖర్చు పెట్టాలి. (1300 క్యాలరీలు జీవక్రియల కోసం; 1000 క్యాలరీలు ఉష్ణం రూపంలో; ఇక మిగతా 200 క్యాలరీలు వ్యాయామం రూపంలో). కానీ సెట్‌పాయింట్ పెరిగి, శరీరం ఎక్కువ కొవ్వును నిల్వ చేసుకోడానికి సిద్ధపడటం వల్ల హార్లోన్లు, జీవక్రియల్లో మార్పులు తెచ్చి, జీవక్రియల కోసం, ఉష్ణం రూపంలో ఖర్చు పెట్టే శక్తిని తగ్గించేస్తాయి. పెరిగిన ఫ్యాట్ సెట్ పాయింట్ మేరకు ఎంతైతే కొవ్వును అదనంగా నిల్వ ఉంచాలో, ఆ మేరకు శరీరం తక్కువ క్యాలరీలను ఖర్చుపెడుతుంది. అంటే 2500 క్యాలరీలకు బదులు అంతకంటే తక్కువ క్యాలరీలను శరీరం ఖర్చుపెడుతుంది.

అంటే అనారోగ్యకరమైన ఆహారం తిని, ఆ మేరకు వ్యాయామం చేసినప్పటికీ మనం బరువు పెరుగుతామన్నమాట. అదే అనారోగ్యకరమైన ఆహారాన్ని మరింత ఎక్కువ మోతాదు లో తింటూపోతే.. ఫ్యాట్ సెట్ పాయింట్ ఇంకా ఎక్కువ పెరగడం వల్ల, బరువు ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. అదే ఆరోగ్యకరమైన ఆహారం కొంచెం ఎక్కువ తీసుకున్నప్పటికీ, ఫ్యాట్ సెట్ పాయింట్‌లో మార్పు లేకపోవడం వల్ల, హార్లోన్లు అదనంగా వచ్చిన క్యాలరీలను ఉష్ణం రూపంలోకి మార్చి బయటకు పంపించేయడం వల్ల బరువు పెరగరు. అందుకే మనం బరువు పెరుగుతామా లేదా అన్నది మనం ఎంత తింటాం అన్న అంశం మీద గాక... ఎలాంటి ఆహారం తింటాం (అనారోగ్యకరమైనదా లేక ఆరోగ్యకరమైనదా) అనే అంశంపై ఆధారపడి ఉంటుందన్నమాట.
 
లావు ఇప్పుడు ప్రపంచ సమస్య...


పరిమితికి మించి బరువుగా ఉండటాన్ని స్థూలకాయం లేదా ఊబకాయం అంటుంటాం. ఈ స్థూలకాయంతో వస్తున్న సమస్యలు కేవలం భారతీయులకు మాత్రమే పరిమితం కాదు. డబ్లూహెచ్‌ఓ 2014 నాటి లెక్కల ్రపకారం ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారిలో 39 శాతం మంది పరిమితికి మించిన బరువున్నారు. ఇది ఇప్పటికే ముంచుకువచ్చిన, మున్ముందు రాబోతున్న పెనుముప్పునకు ఒక సూచన.
 
జనం ఎందుకిలా లావెక్కుతున్నారు...


ఒకనాడు మనం తప్పనిసరిగా శారీరక శ్రమ చేసే పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు మనం స్థూలకాయ సమస్యను తెచ్చి పెట్టుకునే వాతావరణంలో జీవిస్తున్నాం. మనం జీవితాన్ని సుఖమయం చేసుకోవడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తున్నాం. నూటికి 90 పాళ్లు మనం తెచ్చిపెట్టుకున్న పరిస్థితులతోనే లావెక్కుతున్నాం. మిగతా 10 పాళ్లు మన నియంత్రణలో లేని విషయాలు. కాబట్టి మన చేతిలో ఉన్న పరిస్థితులను మార్చుకుంటే లావెక్కకుండా ఉండవచ్చు.  ఆరోగ్యప్రమాదాలను నివారించుకోవచ్చు.
 
అనేక వ్యాధులకు దారితీసే ఒక వ్యాధే స్థూలకాయం

మనం అనుకుంటున్నట్లుగా లావు అన్నది కేవలం అందానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. అది ఆరోగ్యానికి సంబంధించిన అంశం. బీఎమ్‌ఐ ద్వారా నిర్ధారణ చేసుకున్న తర్వాత, బీఎమ్‌ఐ 30 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే స్థూలకాయ వ్యాధి బారిన పడినట్టే లెక్క. లావెక్కువగా ఉండటం వల్ల వచ్చే దుష్పరిణామాలపైన కూడా మన ప్రజల్లో అంతగా అవగాహన లేదు. స్థూలకాయం ప్రమాదకరం. స్థూలకాయంతో 65 రకాలకు పైబడి వ్యాధులు వస్తాయి. డయాబెటిస్ (షుగర్), రక్తపోటు (హైబీపీ), రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, గుండెపోటు, కీళ్లనొప్పులు, నిద్రలో ఊపిరి సరిగా అందకుండా చేసే అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా (గురక), డిప్రెషన్, హెర్నియా వంటి అనేక వ్యాధులకు స్థూలకాయం ఒక కారణం. లావుగా ఉన్న మహిళలలో ప్రసవం కష్టమవుతుంది. అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువ. స్థూలకాయం కొన్ని రకాల క్యాన్సర్లకు కూడా దారి తీయవచ్చు. మిగతావారితో పోలిస్తే  స్థూలకాయుల్లో ఆయుఃప్రమాణం 5 ఏళ్ల నుంచి 20 ఏళ్లు తగ్గిపోయే అవకాశం ఉంది. పైగా స్థూలకాయం వల్ల వచ్చే కొన్ని వ్యాధుల వల్ల 50 శాతం నుంచి 100 శాతం వరకు లైఫ్ రిస్క్ ఉంటుంది. అందుకే స్థూలకాయాన్ని నివారించుకోవాల్సిందే. ఇన్ని రకాల వ్యాధులకు కారణమవుతున్నందు వల్లనే అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వారు దీన్ని 2013లో ఒక వ్యాధిగా గుర్తించారు.
 
 కొందరు తక్కువ తింటున్నా లావుగా ఎందుకుంటారు?


మనం రోజూ చేసే పనులకూ, మన శరీరం నిర్వహించే జీవక్రియలకు అవసరమైన శక్తి కోసం మనం ఆహారం తీసుకోవాలి. అది పేగుల్లో జీర్ణమై, రక్తంలోకి ఇంకుతుంది. ఒక మనిషికి రోజుకు సగటున 2,300 క్యాలరీల శక్తి అవసరం. ఒకవేళ మనం అవసరానికి మించి క్యాలరీలను ఇచ్చేలా ఆహారాన్ని తీసుకుంటే, శరీరం తన అవసరాలకు ఉపయోగించుకున్నది పోగా మిగతాదాన్ని కొవ్వు రూపంలోకి మార్చుకుని నిల్వ చేసుకుంటుంది. అయితే మనం ఎంత బరువుండాలి, మన శరీరంలో ఎంత కొవ్వుండాలని అన్నది మనం స్వతహాగా మనసుతో నియంత్రించలేం. అది కొన్ని వేల జన్యువులు, కొన్ని వందల హార్మోన్ల నియంత్రణలో ఉంటుంది. ఈ హార్మోన్లలో ముఖ్యమైనవి జీర్ణవ్యవస్థలో తయారయ్యే   గ్రెలిన్  జీఎల్‌పీ-1 (గ్లూకగాన్ లైక్ పెప్టైడ్-1)  గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్  పెప్టైడ్ వైవై
  కొలికిస్టోకైనిన్  అమైలిన్  కొవ్వు కణాలలో తయారయ్యే లెప్టిన్  అడిపోనెక్టిన్...  మొదలైనవి. ఈ జన్యువులు, హార్మోన్లను జీర్ణవ్యవస్థ, కాలేయం, ఎముకలు, కండరాల నుంచి వచ్చే సంకేతాలూ ప్రభావితం చేస్తాయి. ఈ సంకేతాలు... మనం తీసుకునే ఆహారం, మనం చేసే శారీరక శ్రమను బట్టి మారుతూ ఉంటాయి.
 
చక్కెర తగ్గించండి... చక్కని ఆరోగ్యం పొందండి...


మనం చక్కెరను కూడా కాస్త ఎక్కువే వాడతాం. కాఫీలు, టీలు, కూల్‌డ్రింకులు, ఎనర్జీడ్రింకులు, బిస్కెట్లు, క్యాండీలు, కుకీలు, కృత్రిమజ్యూసులు, ఐస్‌క్రీములు, కేకులు, స్వీట్లు మొదలైన ఆహారపదార్థాల్లో చక్కెరపాళ్లు అధికం. మనకు రోజూ అవసరమైన క్యాలరీలలో చక్కెర పాళ్లు ఐదు శాతానికి మించకూడదని  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సిఫార్సు చేస్తోంది. అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు హార్మోన్లపైన ప్రభావం చూపించి ‘కొవ్వు సెట్ పాయింట్’ను పెంచుతాయని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం. అనారోగ్యకరమైన ఆహారాలన్నీ రుచిగా ఉంటాయి. వీటికి అలవాటు పడితే మానడం కష్టం. ఒకసారి మత్తుకు బానిస అయితే మానడం ఎలా కష్టమో, రుచికి బానిస అయినవారు వీటిని వదలడం అంతే కష్టం.
 
ఆరోగ్యకరమైన ఆహారమంటే...

ఆరోగ్యకరమైన ఆహారాలంటే... శుద్ధి చేయకుండా/పొట్టుతీయకుండా (రిఫైన్ చేయనివి) ఉండే ఆహార ధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్). అందుకే తెల్ల వరి అన్నానికి బదులు పొట్టు తీయని బ్రౌన్ రైస్ వాడండి. వైట్ బ్రడ్‌కు బదులు బ్రౌన్ బ్రెడ్ వాడండి. హోల్ మల్టీ గ్రెయిన్ ఆటాతో (పిండితో) చేసిన చపాతీలు తినండి. మీగడపాల బదులు, వెన్న తీసిన పాలు (స్కిమ్మ్‌డ్ మిల్క్) లేదా వెన్న తక్కువగా ఉండే పాలు (లోఫ్యాట్ మిల్క్) వాడండి. మాంసాహారులు మటన్‌కు బదులు చేపలు, ఇతర సముద్ర ఆహారాలను తీసుకోండి. చికెన్‌ను చర్మం తొలగించి తినడం మంచిది. గుడ్డులో తెల్లసొనను తినండి. పచ్చసొనను వాడటం అంత మేలు కాదు. మొలకెత్తే విత్తనాలు, నట్స్ వంటి శాకాహార ప్రోటీన్లను తినడం ఆరోగ్యకరం. కూల్‌డ్రింక్స్ బదులు పండ్లరసాలను తీసుకోండి.

 చిరుతిండ్లకు బదులు పండ్లు, తక్కువ మోతాదులో పల్లీలు, జీడిపప్పు, బాదం, పిస్తా వంటి నట్స్ తినడం మంచిది. బాగా తియ్యగా ఉండే మామిడి పండ్లను పరిమితంగా తినడం మేలు. నూనె తగ్గించాలి. చీజ్, నెయ్యి, వనస్పతి వంటి శాచ్యురేటెడ్ ఫ్యాట్స్‌కు బదులు, సన్‌ఫ్లవర్ ఆయిల్, శాఫ్‌ఫ్లవర్ ఆయిల్ వంటి పాలీ అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్, వేరుశనగనూనె వంటి మోనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ ఉపయోగించండి. ప్రతిరోజూ కూరగాయలు, పండ్లు తినండి.

వ్యాయామం: శారీరక శ్రమ లేకపోతే కొవ్వు సెట్ పాయింట్ పెరుగుతుంది. కాబట్టి బరువు పెరగకుండా చూసుకోడానికి రోజుకు కనీసం 30 నిమిషాల చొప్పున, వారంలో కనీసం 150 నిమిషాల పాటైనా వ్యాయామం చేయాలి. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లకు బదులు మెట్లు వాడండి. తక్కువ దూరాలకు వాహనాలను వాడవద్దు. టెన్నిస్, బ్యాడ్మింటన్, కబడ్డీ వంటి ఆటలు ఆడండి. ఎక్కువ సేపు కూర్చుని ఉండటాన్ని తగ్గించుకోండి. టీవీ ముందు ట్రెడ్‌మిల్ లేదా క్రాస్ ట్రెయినర్లను ఉంచుకుని వ్యాయామం చేయండి. రోజులో ఒకేసారి రోజుకు 30 నిమిషాలు నడవడం కుదరదా? అయితే కనీసం 10 నిమిషాల చొప్పున రోజుకు మూడుసార్లు నడవండి. బట్టలు ఉతకడం, ఇల్లు తుడవడం, చెట్లకు నీళ్లుపోవడం వంటి పనులు చేయండి. జిమ్ముకు లేదా స్విమ్మింగుకు వెళ్లండి. అది కుదరకపోతే ఇంట్లోనైనా వ్యాయామం చేయండి.
 
పిల్లల్లో స్థూలకాయ నివారణ


చిన్నతనంలో లావుగా ఉంటే పెద్దయ్యాకకూడా అధికబరువుతో బాధపడే అవకాశాలు ఎక్కువ. స్థూలకాయ సమస్య నివారణ చిన్నతనంలోనే మొదలు కావాలి. తల్లిదండ్రుల ఆహారపు అలవాట్లు, జీవనశైలి పిల్లలను ప్రభావితం చేస్తాయి. మీరు అనుసరించకుండా పిల్లలను పాటించమంటే వాళ్లు పాటించరు. కాబట్టి పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం నేర్పాలంటే ముందు వాటిని మీరు అనుసరించాలి. అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను పిల్లలకు అలవాటు చేయకండి. వారిని రోజూ ఆటలకు పంపించండి.
 
ఇతర ఆరోగ్య చిట్కాలు


ఏమైనా తినేముందు ఇప్పుడు అవి తినవలసిన అవసరం ఉందా అని ఒకసారి ఆలోచించండి. తినేముందు ఒకటి లేదా రెండు గ్లాసులు మంచినీళ్లు తాగండి. తినే తిండిని ఆనందించండి. కాకపోతే తక్కువ తినండి. కడుపు నిండటానికి కొంచెం ముందే మనకు తృప్తి కలుగుతుంది. తృప్తి కలిగిన వెంటనే తినడం ఆపండి. కడుపు పూర్తిగా నిండేదాకా తినొద్దు. నెమ్మదిగా తినండి, బాగా నమిలి మింగండి. చిన్న ప్లేటు, చిన్నగ్లాసు వాడండి. మార్కెట్లో ఆహారపదార్థాలు కొనేటప్పుడు, వాటిపైన ఉండే లేబుల్సును గమనించండి. లేబుల్సు మీద ఆ ప్యాకెట్లో క్యాలరీలు, ఆహార సమాచారం ఉంటుంది. వీలైనంతవరకు ఇంట్లో చేసిన ఆహారాన్ని తినండి. హోటల్ ఫుడ్స్‌లో ఆయిల్, ట్రాన్స్ ఫ్యాటు వాడకం అధికంగా ఉంటుంది. స్నేహితులకు, చుట్టాలకు స్వీట్లను బహూక రించడం మానండి, పండ్లు లేదా నట్స్ బహూకరించండి.
 
సెట్‌పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజ్ అంటే...

హార్మోన్లు, జన్యువులు మనలో ఎంత కొవ్వు ఉండాలో నిర్ణయించిన కొలతను ‘సెట్ పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజీ’ అంటారు. ఈ సెట్ పాయింట్‌ను మన మనసుతో నియంత్రించలేం లేదా మార్చలేం. అయితే మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు హార్మోన్లను, జన్యువులను ప్రభావితం చేసి సెట్ పాయింట్‌ను మార్చగలవు. ఉదాహరణకు 70 కిలోల బరువు ఉండాల్సిన వ్యక్తిలో 50 కేజీల కొవ్వు పేరుకుపోవడం వల్ల, ఆ వ్యక్తి బరువు 120 కేజీలకు పెరిగిందనుకుందాం. అంటే ఆ వ్యక్తి కొవ్వు సెట్‌పాయింట్ 50 కిలోలు అన్నమాట. గ్రెలిన్ అనే హార్మోన్ జీర్ణాశయం పైభాగంలో తయారవుతుంది. ఇది హైపోథలామస్‌లోని అపటైట్ సెంటర్ (ఆకలి కేంద్రం)పైన పని చేసి ఆకలిని పెంచుతుంది.  మన పొట్ట ఖాళీగా ఉంటే గ్రెలిన్ హార్మోన్ ఎక్కువగా స్రవిస్తుంది. దాంతో మనకు ఆకలి పెరుగుతుంది. మనం కడుపునిండా తినగానే ఈ హార్మోన్ స్రవించడం తగ్గుతుంది. దాంతో ఆకలి కూడా తగ్గుతుంది.

అలాగే చిన్నపేగు చివరి భాగంలో జీఎల్‌పీ-1 (గ్లూకగాన్ లైక్ పెప్టైడ్-1), పెప్టైడ్ వైవై హార్మోన్లు తయారవుతాయి. చిన్నపేగు మొదటిభాగమైన డియోడినంలో కొలికిస్టోకైనిన్, క్లోమంలోని బీటా కణాలలో అమైలిన్ తయారవుతాయి. ఈ హార్మోన్లు హైపోథలామస్‌లోని సెటైటీ సెంటర్‌పై పనిచేసి ఆకలిని తగ్గిస్తాయి. చిన్నపేగు చివరి భాగానికి అరగని ఆహారం వస్తే జీఎల్‌పీ-1, పెప్టైడ్ వైవై తయారై ఆకలి తగ్గుతుంది.  పొట్ట ఖాళీగా ఉంటే జీఎల్‌పీ-1, పెప్టైడ్ వైవై తగ్గడం వల్ల ఆకలి పెరుగుతుందన్నమాట. అంటే మనం ఎంత ఆహారం తీసుకుంటాం, మన శరీరంలో ఎంత కొవ్వు నిల్వ చేసుకుంటాం అన్న అంశాలు మన జీర్ణవ్యవస్థలోని ఈ తరహా హార్మోన్ల నియంత్రణలో ఉంటాయన్నమాట.

మనలో కొంతమంది తక్కువగా తింటున్నప్పటికీ లావుగా ఉంటారు. మరికొందరు ఎక్కువగా తింటున్నప్పటికీ సన్నగా ఉంటారు. దీనికి కారణం లావుగా ఉన్నవారిలో కొవ్వు సెట్‌పాయింట్ ఎక్కువగానూ, సన్నగా ఉన్నవారిలో కొవ్వు సెట్‌పాయింట్ తక్కువగానూ ఉండటమే.
 కొన్ని అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు (ఉదాహరణకు కూల్‌డ్రింకులు తాగడం, ఐస్‌క్రీమ్‌లు, స్వీట్లు, కేకులు, బర్గర్లు, పిజ్జాలు, బిస్కెట్లు తినడం)... మనలో స్రవించే హార్మోన్లను ప్రభావితం చేసి, కొవ్వు సెట్‌పాయింట్‌ను పెంచుతాయి. ఒకసారి కొవ్వు సెట్‌పాయింట్ పెరిగితే అది అంత తేలిగ్గా తగ్గదు. మన శరీర ఉష్ణోగ్రతగా సెట్ అయిన 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్‌ను మన ప్రమేయంతో మార్చలేనట్టే... ఈ సెట్‌పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజీ (కొవ్వు సెట్ పాయింట్)ను కూడా మనం మనసులో అనుకుని మార్చలేం. కొంతమందిలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం... వంటి అంశాలు సెట్‌పాయింట్‌ను నియంత్రించే హార్మోన్లను తేలిగ్గా ప్రభావితం చేస్తాయి. అందుకే ఇలాంటివాళ్లు త్వరగా బరువు పెరుగుతారు. కానీ ఇంకొంత మందిలో జన్యుపరమైన తేడాల వల్ల ఈ హార్మోన్లు అంత తేలికగా ప్రభావితం కావు. అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేయనప్పటికీ వీళ్లు అంత తేలిగ్గా బరువు పెరగరు. అది వాళ్ల అదృష్టం. వీరిలో బ్రౌన్ అడిపోజ్ టిష్యూ అనే కణజాలం ఎక్కువగా ఉంటుంది. ఈ తరహా కొవ్వు కణజాలం... అవసరానికి మించి తీసుకున్న క్యాలరీలను ఉష్ణం రూపంలోకి మార్చి బయటకు పంపిస్తుంది. ఈ తరహా వ్యక్తులు అంత తేలిగ్గా బరువు పెరగకపోవడానికి ఇదీ ఒక కారణం.
 
డాక్టర్ వి. అమర్
మెటబాలిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్,
సిటిజన్స్ హాస్పిటల్,
శేరిలింగంపల్లి, హైదరాబాద్
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement