ప్లీజ్‌ వెయిట్‌ | Special story to Obesity | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌ వెయిట్‌

Published Thu, Aug 16 2018 12:15 AM | Last Updated on Thu, Aug 16 2018 12:15 AM

 Special story to Obesity - Sakshi

కొందరు ‘భోజనం మానేయ్‌’ అంటారు. ఇంకొందరు ‘ఇది కాదు, అది తిను’ అంటారు. మరికొందరు ‘నేను చెప్పిందే రైటు’ అంటారు.ఇంకెవరో ‘ఊహు.. వాళ్లందరూ రాంగ్‌’ అంటారు. వెయిట్‌ కంట్రోల్‌లో ఉంచుకోడానికీ..వెయిట్‌ తగ్గడానికీ 3 ‘డబ్ల్యూ’లను అర్థం చేసుకోవడం అవసరం. వై.. వెన్‌.. వాట్‌.అందుకే తొందర పడొద్దు. ఇన్ని సమాచారాలతో కన్ఫ్యూజ్‌ అవ్వొద్దు.మీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. మీరు తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి.  ప్లీజ్‌ వెయిట్‌!


ఆహారం ఎందుకు తీసుకోవాలంటే?
అది యంత్రమైనా, వస్తువైనా, మరేదైనా... దాని నిర్వహణ బాగుంటేనే అది బాగుంటుంది, దీర్ఘకాలం పని చేస్తుంది. దేహమూ అంతే. ఓ యంత్రంలాగే పని చేస్తుంది కాబట్టి దాన్ని కూడా దేహయంత్రం అని అంటుంటారు. ఒక వాహనానికి  ఇంధనం లాగే... శక్తిని పుట్టించే ఒక టర్బైన్‌కు కూడా శక్తి అవసరమైనట్లే... మనకూ శక్తి కావాలి. ఆ శక్తి కోసమే మనం భోజనం తీసుకుంటుంటాం. కేవలం శక్తి కోసమేనా అంటే... అవును మౌలికంగా అంతే. అయితే దానితో పాటు మన కణాలూ, కండరాలు రోజువారీ పనుల్లో దెబ్బతింటూ ఉంటాయి. ఆ కణాలూ, కండరాల రిపేర్లకు ప్రోటీన్లు కావాలి. దాంతోపాటు కండరాల నిర్మాణం, కండరాల రిపేర్లతో పాటు, రక్తం, చర్మం, ఎముకల వంటి కణజాలం రిపేర్ల కోసం కూడా ప్రోటీన్‌ కావాల్సిందే. ఇక తక్షణ శక్తి సమకూర్చడానికి పిండిపదార్థాలు కావాలి. దాంతోపాటు దీర్ఘకాలం నిల్వ ఉంచుకోడానికి, కొన్ని కీలక శరీర అవయవాల రక్షణకు కొవ్వులూ కావాలి. 

ఆహారం అందనప్పటి అవసరాల కోసం కూడా... 
కొన్ని సందర్భాల్లో శరీరానికి అవసరమైన ఆహారం అందకపోవచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా శరీరం కొవ్వుల రూపంలో కొంత ఆహారాన్ని నిల్వ ఉంచుకుంటుంది. అలాగే శీతల ప్రాంతాల్లో శక్తి కోసం వాడే పిండిపదార్థాల కంటే కొవ్వుల నుంచి ఎక్కువ శక్తి, వేడిమి పొందడం అవసరమవుతుంది. ఒక గ్రాము కొవ్వు ద్వారా 9 క్యాలరీల శక్తి పుడుతుంది. అదే ఒక గ్రాము పిండిపదార్థం నుంచి కేవలం 4 క్యాలరీల శక్తి మాత్రమే వస్తుంది. ప్రోటీన్‌ నుంచి కూడా అంతే శక్తి ఆవిర్భవిస్తుంది. కేవలం ఇందుకోసం మాత్రమే కాదు... కొన్ని విటమిన్లు మనలోకి ఇంకిపోవడం కోసం కూడా కొవ్వులు అవసరమే. ఇలా మనకు ప్రోటీన్లూ, పిండిపదార్థాలు, కొవ్వులూ కావాలి. కాబట్టి వీటిని ప్రధాన పోషకాలు అంటాం. ఇవి మాత్రమే గాక అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు, లవణాలు వంటివి కూడా ఒంటికి కావాలి. తక్కువ మోతాదులో అవసరమైన వీటిని మైక్రో న్యూట్రియెంట్స్‌ అంటాం. ఇవన్నీ కలిసి కేవలం ఇంధనంగా శక్తిగా మాత్రమే గాక మనం శ్వాసించడానికీ, ఆహారాన్ని జీర్ణం చేయడానికి, మనలోని నిర్దిష్ట ఉష్ణోగ్రత నిర్వాహణ కావడానికి ఉపయోగపడతాయి. అంతేకాదు... మన రోగనిరోధక శక్తి పదిలంగా ఉండటానికి... ఇలా అనేక రకాల ప్రయోజనాల కోసం ఆహారం కావాలి. అయితే ఆ ఆహారాన్ని ఎందుకు తీసుకోవాలో (వై), ఎప్పుడెప్పుడు తీసుకోవాలో (వెన్‌), అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందో (వాట్‌) అన్న విషయాలను ఈ ప్రత్యేక కథనంలో 
తెలుసుకుందాం. 

ఆహారానికి... బరువుకు లింకు ఉందా?
తప్పక ఉంది. ఆహారానికి, బరువు పెరగడానికి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. కొవ్వులు, పిండిపదార్థాలు ఎక్కువ మోతాదులో తినేవారి బరువు వెంటనే పెరుగుతుంది. వాటిని పరిమితంగా తీసుకుంటూ, అన్ని పోషకాలు పుష్కలంగా, సమగ్రంగా ఉండే ఆకుకూరలు వంటివి తీసుకునే వారి బరువు (మంచి పరిమాణంలో ఆహారం తీసుకుంటున్నా) ఎప్పుడూ అదుపులోనే ఉంటుంది. తీసుకునే ఆహారానికి, పెరిగే బరువుకు మధ్య ఉన్న సంబంధాన్ని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. అలాగని ఇవన్నీ ప్రతివారికీ ఒకేలా వర్తించాలని నియమమేమీ లేదు. వారి వారి వ్యక్తిగత జన్యుచిత్రపటం, వంశపారంపర్యత, కుటుంబ చరిత్రను అనుసరించి కొంత విభిన్నంగా ఉండవచ్చు. అందుకే ఇక్కడ పేర్కొన్న అంశాలు అందరికీ స్థూలంగా వర్తించేవి మాత్రమే. అంతే తప్ప నిర్దిష్టంగా వర్తించేవి కావని గుర్తించాలి. 
ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి లేదా... బరువు పెరగకుండా ఉండటానికి ఆహారపరంగా చేయాల్సినవి... కావాల్సినవి ఇవి. 

అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవడం ఎందుకంటే
ఒక పూట భోజనంలో తక్షణ శక్తిని ఇచ్చే పిండిపదార్థాలు, శక్తిని నిల్వ చేసుకునేందుకు అవసరమైన కొవ్వులు, కణాల రిపేర్లకు అవసరమైన ప్రోటీన్లు; పోషకాలను సమకూర్చే ఆకుకూరలు, కూరగాయలు; విటమిన్లను ఇచ్చే తాజాపండ్లు, లవణాలను ఇచ్చే ఇతర ఆహార పదార్థాలు... ఇవన్నీ ఏదీ ఎక్కువా, ఏదీ తక్కువా కాకుండా సమపాళ్లలో ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. దాన్నే సమతులాహారం అంటారు. 

ఇలా తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? 
ఇది మన రోగనిరోధక వ్యవస్థను బలంగా చేసి, మనల్ని అనారోగ్యం పాలు కాకుండా చేసి సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. సమతుల ఆహారం తీసుకోవడమే బరువును అదుపులో ఉంచుతుంది. అదే కొవ్వులు ఎక్కువగానో, పిండిపదార్థాలను అధికంగానో తీసుకుంటే మళ్లీ అది బరువు 
పెరగడానికి దారితీస్తుంది.

పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవడం ఎందుకంటే:
బరువు పెరగకుండా ఉన్నవారిపై ఒక అధ్యయనం నిర్వహించినప్పుడు వారిలో 78 శాతం రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకునే వారు ఉన్నారు. కేవలం 4 శాతం మాత్రమే అలా తీసుకోని వారున్నారు. ఇక మరో అధ్యయనాన్ని బట్టి చూస్తే బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోని వారిలో బరువు పెరిగే అవకాశాలు 4.5 రెట్లు ఎక్కువ అని నిశ్చయంగా తేలింది. 

బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకుంటే ఏం జరుగుతుంది? 
దీనికి ఒక కారణమూ ఉంది. పొద్దున్నే సంతృప్తికరంగా బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకునే వారు ఇక రోజంతా తక్కువ క్యాలరీలు తీసుకుంటారు. ఈ అంశమే బరువును పెరగనివ్వదు. పొద్దున్నే సంతృప్తికరమైన బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోకపోతే, కాలే కడుపు వారిని ఖాళీగా ఉండనివ్వకుండా అదో ఇదో నమిలేలా చేస్తుంది. దాంతో వారు ఉదయం తీసుకునేదానికంటే చాలా ఎక్కువ క్యాలరీను అడపాదడపా నములుతూ బరువును పెంచుకుంటారని ఆ అధ్యయనం తేల్చింది. అలాగే ఉదయం సంతృప్తికరంగా భారీగా బ్రేక్‌ఫాస్ట్‌ చేసేవారు, మధ్యాహ్నం అంతకంటే తక్కువగా ఎలాగూ తింటారు. ఇక రాత్రి చాలా పరిమితంగానూ తినడం వల్ల వారు బరువు పెరగకుండా ఉంటారు. 

ఎప్పుడెప్పుడు తినాలంటే... 
మనం తినే ఆహారాన్ని చాలా చిన్న మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి. మనం రోజుల్లో భోజనం చేసే ఆహారాన్ని ఏ రెండు పూటలకో పరిమితం చేయకుండా... తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి. అంటే ఉదయం ఉపాహారం (బ్రేక్‌ఫాస్ట్‌), మధ్యాహ్నం భోజనం (లంచ్‌), సాయంత్రపు పలహారం (ఈవినింగ్‌ స్నాక్స్‌), రాత్రి భోజనం (సప్పర్‌/డిన్నర్‌) గా విభజించుకొని కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి. 

ఇలా తింటే ఏం జరుగుతుందంటే
అలా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై భారం పడదు. ఇలా తినడం వల్ల బరువు పెరగకపోవడానికి మరో కారణం కూడా ఉంది. మనకు భోజనం లభ్యత తక్కువగా ఉన్నప్పుడు మన మెదడు దొరికిన ఆహారాన్ని నిల్వ ఉంచాలంటూ మన జీవక్రియల వ్యవస్థను ఆదేశిస్తుంది. దాంతో తక్కువ సార్లు ఎక్కువ మోతాదుల్లో భోజనం తినే సందర్భాల్లో  ఆకలితో మాడే సమయం ఎక్కువగా ఉన్నందున ఆ సమయంలోని జీవక్రియల అవసరాల కోసం ఆహారాన్ని నిల్వ చేయాల్సిందిగా అందే ఆదేశాల మేరకు కొవ్వు పేరుకుంటుంటుంది. దాంతో బరువు పెరిగేందుకు అవకాశం ఉంది. అదే తక్కువ మోతాదుల్లో అయినా ఎక్కువసార్లు భోజనం లభ్యత జరుగుతున్నందున భోజనాన్ని నిల్వ చేసే అవసరం లేదని మెదడు నిర్ణయిస్తుంది. దాంతో కొవ్వు పేరుకోదు. పైగా తక్కువ మోతాదుల్లోనే తింటున్నందున అవసరమైన మేరకే క్యాలరీలు అందుతాయి. అంతేతప్ప కొవ్వుల పేరుకునేందుకు అవసరమైనంత ఆహార లభ్యత ఉండదు. దాంతో బరువు పెరిగేందుకు అవకాశమే ఉండదు. ఈ విషయంలోనూ ఒక అధ్యయనం జరిగింది. దాదాపు 4,000 కంటే ఎక్కువ మందిపై నిర్వహించిన ఒక అధ్యయనంలో పుష్కలంగా భోజనం అందేవారిని ఒక గ్రూపుగానూ, అడపాదడపా మాత్రమే భోజనం ఇస్తూ ఎప్పుడూ స్నాక్స్‌పై ఉండేవారుగానూ మరో గ్రూపుగానూ... ఇలా రెండు గ్రూపులుగా విభజించారు.

ఈ అధ్యయనాన్ని మూడేళ్ల పాటు కొనసాగించి చూడగా క్రమం తప్పకుండా తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు భోజనం చేసేవారి బరువు దాదాపుగా స్థిరంగా ఉండగా నిత్యం స్నాక్స్‌ మీద ఉండేవారి బరువు ఎక్కువగా పెరిగింది. అంతేకాదు ఇక్కడ మరో అంశాన్ని కూడా అధ్యయనవేత్తలు గమనించారు. నిత్యం స్నాక్స్‌ తినేవారు తమ ఆకలి (రియల్‌ ఫిజియలాజికల్‌ హంగర్‌) కోసం  కంటే... ఏదైనా ఒత్తిడి ఉన్నప్పుడు దాన్ని అదిగమించడం కోసం (ఎమోషనల్‌ హంగర్‌) ఎక్కువగా తింటున్నారని దాంతో బరువు పెరుగుతున్నారని ఆ అధ్యయనంలో తేలింది. ఇలా ఆకలిగా లేనప్పుడు కూడా స్నాక్స్‌ తినడం వల్ల ఏమవుతుందో తెలుసా? అవసరమైన దానికంటే ఒక రోజున 100 క్యాలరీలు ఎక్కువగా తింటూ అలా ఏడాది పాటు అదే అలవాటును కొనసాగిస్తే ఏడాది తర్వాత 6 కిలోల బరువు పెరుగుతారు. అంటే ఏదైనా ఆఫీసులో ఇలాంటి అలవాటును కేవలం ఐదేళ్ల పాటు కొనసాగించినా బరువు స్థిరంగా ఉండాల్సిన చోట దాదాపు 30 కిలోలు అదనంగా పెరుగుతారు. ఇలా స్నాకింగ్‌ మీదే ఉండేవారిని ఈ అలవాటు తప్పక ఇబ్బందుల్లోకి, ఆరోగ్య సమస్యల్లోకి నెడుతుందనేందుకు ఈ అధ్యయనమే ఒక ఉదాహరణ. అంటే దీన్ని బట్టి మీకు తెలుస్తున్నదేమిటి? తక్కువ క్యాలరీలతో ఉండే ఆకుకూరలు, కాయగూరలతో కూడిన భోజనాన్ని ఎక్కువసార్లు తినాలి. స్నాక్స్‌ అన్నవి ఎప్పుడో ఒకసారి అరుదుగా సరదాగా నమలడానికే తప్ప రోజూ తినడానికి కాదు. అసలు ఇలా తక్కువ క్యాలరీలతో ఎప్పుడూ మంచి భోజనం చేస్తుండటం వల్ల చిరుతిండ్లూ, స్నాక్స్, ఎక్కువ క్యాలరీలు ఉండే జంక్‌ఫుడ్‌ తినాలన్న ధ్యాస కూడా ఉండదు. ఇదే బరువును స్థిరంగా, నియంత్రణలో ఉంచే అంశం. 

రకరకాల ఆహారాలను ఎందుకు  తీసుకోవాలంటే:
మనలో ఆలూ తినేవారు ఎప్పుడూ బంగాళదుంపలనే ఇష్టపడుతుంటారు. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకునేవారు ఎప్పుడూ అది ఉంటేనే తినగలుగుతారు.

అప్పుడేం జరుగుతుందంటే... :
ఎక్కువ వెరైటీలు అన్నది కేవలం ఆరోగ్యకరమైన ఆకుకూరలకు మాత్రమే పరిమితం కావాలి. మిఠాయిలకు, స్నాక్స్‌కూ, చాకొలెట్‌ క్యాండీలకు, చక్కెర ఎక్కువగా ఉండే కార్బోహైడ్రేట్లకు వర్తిస్తే బరువు పెరిగే ముప్పు తప్పదు. భోజనంలో ఎప్పుడూ దుంపలు తినడానికి బదులు రకరకాల కూరగాయలు, ఆకుకూరలు తింటే ఆయా రకాల కూరల్లో ఉండే అన్ని పోషకాలూ శరీరానికి సమకూరతాయి. దాంతో అటు ప్రధాన పోషకాలైన మ్యాక్రోన్యూట్రియెంట్స్‌... ఇటు సూక్ష్మపోషకాలైన మైక్రోన్యూట్రియెంట్స్, విటమిన్లు, ఖనిజాలు, లవణాలు... ఇలా అన్ని రకాల పోషకాలు సమకూరి ఆరోగ్యంగా ఉంటారు. మార్చిమార్చి తింటుండటం వల్ల ఒక్కోసారి రుచిగా ఉన్నవీ, ఒక్కోసారి రుచిగా లేనివి అన్ని రకాలూ అందుతూ సగటును ఎంతగా అందాలో అన్ని పోషకాలే ఒంటికి అందుతుంటాయి. అయితే ఇదే సూత్రం మిఠాయిలకూ, స్నాక్స్‌కూ వర్తింపజేస్తే మాత్రం... మిఠాయిల్లో అనేక వెరైటీలు, క్యాండీలు, చాకొలెట్స్, జంక్‌ఫుడ్, బేకరీ ఐటమ్స్, చక్కెర ఎక్కువగా ఉండే కార్బోహైడ్రేట్లు, రిఫైన్‌డ్‌ పిండిపదార్థాలతో కూడిన శ్నాక్‌ వెరైటీలన్నీ చాలా రుచిగా ఉండటం వల్ల అవసరమైన దాని కంటే ఎక్కువ క్యాలరీలు ఒంటికి అందుతూనే ఉంటాయి. అందుకే ఈ వెరైటీలు అనేది కేవలం ఆరోగ్యకరమైన ఆకుకూరలు, కాయగూరలు, తృణధాన్యాలకు మాత్రమే. కానీ స్వీట్స్, క్యాండీల విషయంలో మాత్రం వెరైటీలు అరుదుగానే అందాలి. బరువు పెరగకుండా ఉండటానికి వెరైటీలు అనే మంచి సూత్రాన్ని విచక్షణతో వాడాలి. ఇలా ఆహారాన్ని ఎందుకు తినాలో ... ఎప్పుడెప్పుడు ఎన్ని పూటలుగా తినాలో .. అప్పుడు ఏమవుతుందో  అనే ఈ మూడు డబ్ల్యూల గురించి తెలుసుకుంటే... వెయిట్‌ అనే మరో డబ్ల్యూ కూడా మన అదుపులో ఉంటుంది. అధికం కాకుండా ఉంటుంది.ప్రపంచవ్యాప్తంగా బరువు తగ్గడానికి అందుబాటులో ఉన్న రకరకాల పాపులర్‌ డైట్‌ ప్లాన్స్‌ని రాబోయే వారాల్లో మీకు పరిచయం చేస్తాం..!

వ్యాయామం ముందు బ్రేక్‌ఫాస్ట్‌ మంచిదే
వ్యాయామానికి ముందు బ్రేక్‌ఫాస్ట్‌ చేయడం మంచిదా, కాదా? మనలో చాలామందికి వచ్చే అనుమానం ఇది. ఇప్పటివరకూ ఏమీ తినకుండానే వ్యాయామం చేయడం అలవాటు కూడా. అయితే బాత్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధన ఒకటి భిన్నమైన విషయాన్ని చెబుతోంది. బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన తరువాత కొంత సమయానికి వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని పిండిపదార్థాలు మెరుగ్గా జీర్ణమవుతాయని వీరు అంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన రెండు గంటలకు వ్యాయామం చేసిన వాళ్లను.. బ్రేక్‌ఫాస్ట్‌ తరువాత మూడు గంటలపాటు విశ్రాంతి తీసుకున్న వారిని పోల్చి చూసినప్పుడు మొదటి వర్గంలో వ్యాయామం చేసేటప్పుడు పిండిపదార్థాలు బాగా ఖర్చయినట్లు తెలిసింది. ఆ తరువాత కూడా ఆహారం బాగా జీర్ణమైనట్లు, వీరు రక్తంలోని చక్కెర మోతాదులు, కండరాల్లోని గ్లైకోజెన్‌ పరిమాణాలను బట్టి నిర్ణయించారు. అప్పుడే తీసుకున్న ఆహారంలోని పిండిపదార్థాలతోపాటు కండరాల్లో గ్లైకోజెన్‌ రూపంలో నిల్వ ఉన్నవి కూడా ఖర్చు కావడం   గమనించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జేవియర్‌ గోంజాలెజ్‌ తెలిపారు. పరిశోధన వివరాలు అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఫిజియాలజీ: ఎండోక్రై నాలజీ అండ్‌ మెటబాలిజమ్‌ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.నీళ్లు తాగడం భోజనానికి అరగంట ముందు దాదాపు     అరలీటరు నీళ్లు తాగాలి. ఇలా తాగడం వల్ల

ఏం జరుగుతుందంటే... 
జీవక్రియల వేగాన్ని పెంచడంతో పాటు, తీసుకునే ఆహారపు పరిమాణాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. దీని వల్ల క్యాలరీలను దహనం జరుగుతుంది, అదనపు క్యాలరీలను తీసుకోకుండా నివారణ జరుగుతుంది. అంటే భోజనానికి ముందు తీసుకున్న నీరు బరువు పెరగకుండా స్థిరంగా ఉండడానికి దోహదపడుతుంది. అందుకే బరువు తగ్గడానికి నీళ్లనూ 
విచక్షణతో స్మార్ట్‌గా ఉపయోగించుకోవచ్చు.

ఇదీ వాస్తవం... 
నిజానికి ఒళ్లంతా కొవ్వు పేరుకుపోవడం ద్వారా వచ్చే స్థూలకాయం కంటే పొట్టచుట్టూ కొవ్వు పేరుకునిపోవడం అత్యంత ప్రమాదకరం. పొట్టచుట్టూ కొవ్వు పేరుకుని పోవడాన్ని సెంట్రల్‌ ఒబేసిటీ అంటారు. మన పొట్ట చుట్టూ అనేక పొరలు ఉంటాయి. సెంట్రల్‌ ఒబేసిటీలో చర్మం కిందనే కాకుండా, కండరాల లోపలివైపు, జీర్ణాశయం, పేగుల చుట్టు కూడా కొవ్వు పేరుకొనిపోతుంది. డయాబెటిస్, హైబీపీ, రక్తలో కొవ్వు శాతం పెరగడం (హైపర్‌లిపిడిమియా) వంటి సమస్యలు వచ్చే అవకాశం... సాధారణ స్థూలకాయం కంటే సెంట్రల్‌ ఒబేసిటీలో చాలా ఎక్కువ. ఇక పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం అన్నది నేరుగా గుండెకు ముప్పు తెచ్చే అంశం. అందుకే కాస్త ఎక్కువగాఒళ్లు రావడం కంటే... కాస్త తక్కువగా పొట్టరావడమే ఎక్కువ ప్రమాదకరం.

ఉప్పు తక్కువగా ఉండే ఆహారం
ఆహారంలో ఉప్పు చాలా పరిమితంగా ఉండాలి. ఉప్పు తక్కువగా తినడం వల్ల ఏం జరుగుతుందంటే...ఉప్పు ఆహారానికి రుచిని పెంచుతుంది. రుచిగా ఉన్న ఆహారం ఆకలిని పెంచుతుంది. దాంతో ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీనే సందర్భాల్లో మన జిహ్వ, మన మెదడు అంత తేలిగ్గా సంతృప్త భావనకు (సేసియేషన్‌కు) లోను కాదు. దాంతో అపరిమితంగా తింటూ ఉంటారు. ఇది తీసుకునే క్యాలరీలను పెంచుతుంది. ఆ అదనపు క్యాలరీలన్నీ కొవ్వు రూపంలో ఒంట్లో పేరుకుపోతాయి. దాంతో బరువు అపరిమితంగా పెరుగుతూ పోతుంది. అందుకే ఉప్పు తక్కువగా ఉన్న ఆహారంతో భోజనం చేసేవారు పరిమితంగా తింటారు. పైగా ఆరోగ్యకరంగా ఉంటారు. ఇదే సూత్రం ఆహారాల్లో వాడే రకరకాల ఫ్లేవర్లకు, కలర్లకు వర్తిస్తుంది. ఫ్లేవర్లతోనూ రుచి పెరిగి ఎక్కువగా తినేస్తాం. అలాగే కంటికి ఇంపుగా ఆకర్షణీయంగా కనిపించే ఆహారాల విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఆ ఫ్లేవర్లూ, కలర్లూ స్వాభావికం కాకుండా, కృత్రిమ రసాయనాలై ఉంటే ఆరోగ్యానికి అదో ముప్పు. పైగా అలాంటి కృత్రిమ ఫ్లేవర్లూ, కలర్లూ చాలావరకు క్యాన్సర్‌ కారకాలై ఉంటాయి. అందుకే అటు బరువు పెంచే విషయంలోనూ, ఇటు క్యాన్సర్‌ కలిగించేందుకు దోహదపడేవీ అయిన ఆ కృత్రిమ రంగులనూ, ఫ్లేవర్లనూ ఆహారంలో వాడకపోవడమే అన్ని రకాలా మేలు. 
- డాక్టర్‌ సుధీంద్ర ఊటూరి
లైఫ్‌స్టైల్‌ స్పెషలిస్ట్,  కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement