నా వయసు 45. ఇటీవల పొట్ట పెరుగుతోంది. ఇలా పెరగడం సహజమే కదా అనుకుంటున్నాను. అయితే పొట్ట పెరగడం చాలా సమస్యలకు దారితీస్తుందని ఒక మిత్రుడు చెబుతున్నాడు. నిజమేనా?
- వంశీకృష్ణ, వరంగల్
ఒళ్లంతా కొవ్వు పేరుకుపోవడం ద్వారా వచ్చే స్థూలకాయం కంటే, పొట్టచుట్టూ కొవ్వు పేరుకునిపోవడమే అత్యంత ప్రమాదకరం. పొట్టచుట్టూ కొవ్వు పేరుకుని పోవడాన్ని సెంట్రల్ ఒబేసిటీ అంటారు. సెంట్రల్ ఒబేసిటీలో చర్మం కిందనే కాకుండా, కండరాల లోపలివైపు, జీర్ణాశయం, పేగుల చుట్టూ కూడా కొవ్వు పేరుకొనిపోతుంది. షుగర్, హైబీపీ, రక్తంలో కొవ్వు శాతం పెరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం... సాధారణ స్థూలకాయం కంటే సెంట్రల్ ఒబేసిటీలో చాలా ఎక్కువ. కాబట్టి పొట్ట పెరుగుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
నేను ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని. నాకు 42 ఏళ్లు. బరువు 104 కిలోలు. ఎత్తు ఐదడుగుల పది అంగుళాలు. నాకు మూడేళ్ల క్రితం షుగర్ వచ్చింది. నాకు ఎలాంటి చికిత్స అవసరం?
- శ్రీధర్, హైదరాబాద్
మీ సమస్యలకు అనువైన చికిత్స బేరియాట్రిక్ సర్జరీ మాత్రమే. ఇది శాస్త్రీయంగా రుజువైన సురక్షిత ప్రక్రియ. మీ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్‌ఐ) 33 కేజీ/మీ2. భారతీయుల్లో బీఎమ్‌ఐ 30 కేజీ/మీ2 లేదా అంతకంటే ఎక్కువ ఉండి షుగర్ లాంటి స్థూలకాయ సంబంధిత జబ్బులు ఉన్నా; బీఎమ్‌ఐ 35 కేజీ/మీ2 లేదా అంతకంటే ఎక్కువగా ఉండి ఎలాంటి జబ్బులూ లేకపోయినా బేరియాట్రిక్ సర్జరీకి అర్హులవుతారు.
మన శరీరంలో ఎంత కొవ్వు నిల్వ ఉండాలన్న అంశం కొన్ని వేల జన్యువులు, కొన్ని వందల హార్మోన్ల నియంత్రణలో ఉంటుంది. ఈ విలువను ‘సెట్ పాయింట్ ఫర్ ఫ్యాట్ స్టోరేజీ’ అంటారు. లావుగా ఉన్నవారిలో ఈ కొవ్వు సెట్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత, కొవ్వును నియంత్రించే హార్మోన్లలో మార్పులు వచ్చి కొవ్వు సెట్‌పాయింట్ తగ్గి, మీ బరువూ తగ్గుతుంది.
డాక్టర్ వి.అమర్
బేరియాట్రిక్ సర్జన్,
సిటిజన్స్ హాస్పిటల్, హైదరాబాద్
ఒబేసిటీ కౌన్సెలింగ్
Published Thu, May 7 2015 11:39 PM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM
Advertisement
Advertisement