కొండలా కొవ్వు ఉంది ఎంతకూ తగ్గనంది | More than 800 surgeries to reduce obesity in Hyderabad every year | Sakshi
Sakshi News home page

కొండలా కొవ్వు ఉంది ఎంతకూ తగ్గనంది

Published Thu, Aug 10 2017 2:28 AM | Last Updated on Sun, Sep 17 2017 5:21 PM

కొండలా కొవ్వు ఉంది ఎంతకూ తగ్గనంది

కొండలా కొవ్వు ఉంది ఎంతకూ తగ్గనంది

ఊబకాయం తగ్గించుకోవడానికి సర్జరీలను ఆశ్రయిస్తున్న సిటీజనం
- హైదరాబాద్‌లో ఏటా 800లకు పైగా సర్జరీలు 
ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువ 
నగర పిల్లల్లో 13%.. పెద్దల్లో 12% మందికి ఊబకాయం 
 
పిజ్జాలు, పాస్తాలు... అర్ధరాత్రి ‘కిక్కు’నిస్తున్న విందులు, వినోదాలు... ఆహారపు అలవాట్లు మారి... శారీరక వ్యాయామం తగ్గి... సిటీజనులకు  కొండలా కొవ్వు పేరుకుపోతోంది. క్షణం తీరికలేని జీవనశైలితో అధిక బరువు పెద్ద సమస్యగా మారింది. ఇందుకు పెద్దలే కాదు... పిల్లలూ మినహాయింపు కాదు! 13% మంది బడికి వెళ్లే పిల్లలు... 12% మంది పెద్దలు ఊబ కాయంతో తంటాలు పడుతున్నారు. ఫలి తంగా.. చిటికెలో కొవ్వు కరిగించుకొనేందుకు సర్జరీలను ఆశ్రయిస్తున్నారు. ఈ సర్జరీలకూ నగరమే ప్రధాన కేంద్రంగా మారడం విశేషం. 
 
సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా ఏటా ఆరు వేలకు పైగా కొవ్వు కరిగించే సర్జరీలు చేస్తుంటే.. వీటిల్లో అత్యధికంగా హైదరాబాద్‌లోనే 800కు పైగా జరుగు తున్నాయి. దేశంలోనే మరెక్కడా లేని వైద్య నిపుణులు, సూపర్‌ స్పెషా లిటీ ఆస్పత్రులు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండ టం.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై తదితర మెట్రో నగరాలతో పోలిస్తే వైద్య ఖర్చులు తక్కువగా ఉండటం వల్ల దేశీయులే కాకుండా విదేశీయులూ ఇక్కడికి వస్తున్నారు. ఢిల్లీలో నెలకు 50, ముంబైలో 40 కొవ్వు కరిగించే సర్జరీలు జరుగుతుంటే.. గ్రేటర్‌లో 70 జరుగుతున్నాయి.
 
రోజుకు 1400 కేలరీలు చాలు..
శరీరానికి అవసరమైన దానికంటే అధిక ఆహారం తీసుకోవడం, దాని ద్వారా లభించిన కేలరీలు ఖర్చు అయ్యే స్థాయిలో శారీరక శ్రమ చేయక పోవడం, పాశ్చాత్య దేశాల అలవాట్లను అందిపుచ్చుకోవడం... కారణమేదైనా సంపదతో పాటే సౌకర్యాలు, ఆహార లభ్యత పెరిగి ఊబకాయానికి దారితీస్తోంది. ప్రాసెస్డ్‌ ఫుడ్డు, పిజ్జాలు, బర్గర్‌లు ఒకసారి తింటే చాలు... రోజుకు సరిపడే కేలరీలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఖర్చుకాకపోతే లోపల నిల్వ ఉండి బరువు పెరుగుదలకు కారణం అవుతాయి.

రోజంతా కష్టించే రైతులు, భవన నిర్మాణ, ఇతర కార్మికులకు రోజుకు సగటున 2,300–2,500 కేలరీల శక్తి అవసరం. శారీరక శ్రమ అంతగా లేని వారికి 1,400 కేలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకుంటే సరిపోతుంది. కానీ టిఫిన్లు, భోజనంతో పాటు ఫాస్ట్‌ఫుడ్స్‌ కూడా తీసుకోవడం వల్ల అదనపు కేలరీలు పేరుకుపోతున్నాయి. ఏటా అదనంగా 90 వేల కేలరీలు తీసుకుంటే 5 కేజీల చొప్పున, నాలుగైదేళ్లలో 20 కేజీలకు పైగా బరువు పెరుగుతారు. పరోక్షంగా ఇది మధుమేహం, గుండె పోటు, మోకాలి నొప్పులు, హైపర్‌టెన్షన్, మహిళల్లో సంతానలేమి, రొమ్ము కేన్సర్‌కు కారణం అవుతుంది. 
 
లైపోసక్షన్‌తో సత్వర ఫలితాలు
ఇంజక్షన్‌ సహాయంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించే పద్ధతిని లైపోసక్షన్‌ సర్జరీ అంటారు. ఫలితం చాలా త్వరగా ఉంటుంది. సినీ తారలు ఎక్కువగా దీన్ని ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల చికిత్స తర్వాత.. కొవ్వును తీసేసిన ఖాళీ ప్రదేశంలోకి నీరు చేరి ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంది. ఇక జీర్ణకోశం సైజును తగ్గించి క్రమంగా బరువును తగ్గించే ప్రక్రియను బేరియాట్రిక్‌ సర్జరీ అంటారు. ఇది 2007లో హైదరాబాద్‌లో తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. రోజువారీ వ్యాయామం, ఆహార నియంత్రణతో నెమ్మదిగా బరువును తగ్గిస్తారు. తొమ్మిది మాసాల్లో 60–70 శాతం కొవ్వు దానంతట అదే శరీరంలో కరిగిపోతుంది. సాధ్యమైనంత వరకు బరువు పెరగకుండా చూసుకోవాలి. రోజూ అరగంటైనా వ్యాయామం చేయాలి. పరిమితికి మించి ఆహారం తీసుకోకూడదు. ఈ సర్జరీలు తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే.
– డాక్టర్‌ జి.సురేష్‌చంద్రహరి, బేరియాట్రిక్‌ సర్జన్, సిటిజన్స్‌ హాస్పిటల్‌ 
 
1 నెలలో 30 కేజీలు తగ్గా
నేను 128 కేజీల బరువుండేవాడిని. అధిక బరువు వల్ల కనీసం నాలుగు అడుగుల దూరం కూడా నడవలేక పోయాను. కూర్చోలేక... నిలుచోలేక బాధపడ్డాను. శ్వాస కూడా కష్టమైంది. బేరియాట్రిక్‌ సర్జరీ తర్వాత 30 రోజుల్లోనే 30 కేజీలు తగ్గాను. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవు.
– సందీప్, బోయినపల్లి 
 
27 రోజుల్లో 25 కేజీలు... 
సర్జరీకి ముందు నా బరువు 177 కేజీలు. ప్రస్తుతం 152 కేజీలకు తగ్గింది. 27 రోజుల్లో 25 కేజీలు తగ్గాను. ఇప్పుడు చాలా రిలాక్స్‌గా ఉంది. 
– ఆదిల్, చందానగర్‌
 
అధిక బరువు ఇలా నిర్ధారిస్తారు... 
బాడీమాస్‌ ఇండెక్స్‌ (బరువు కిలోలు/ఎత్తు మీటర్లలో) 
► 18–23 వరకు ఉండటం ఉత్తమం 
► 20 లోపు ఉంటే తక్కువ బరువు ఉన్నట్లు
►  20–25 మధ్య ఉంటే సరైన బరువు ఉన్నట్లు లెక్క
► 25–30 మధ్య ఉంటే అధిక బరువు 
30–40 మధ్య ఉంటే ఊబకాయం 
40 కన్నా ఎక్కువ ఉంటే ‘మార్పిడ్‌ ఒబేసీ’ అంటారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement