ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఫుట్‌పాత్‌ టైల్స్, టాయిలెట్లు | Footpath And Toilet Construction With Plastic Waste in Hyderabad | Sakshi
Sakshi News home page

విభిన్నం.. వినూత్నం!

Published Thu, Sep 5 2019 12:12 PM | Last Updated on Thu, Sep 5 2019 12:12 PM

Footpath And Toilet Construction With Plastic Waste in Hyderabad - Sakshi

శిల్పారామం ఎదుట...

గచ్చిబౌలి: ప్లాస్టిక్‌ భూతం మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చెత్తలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ భూసారంతో పాటు భూగర్భ జలాలు కలుషితం చేస్తూ మానవాళిని ఆందోళనకు గురి చేస్తోంది. అలాంటి ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్‌ చేసి టైల్స్‌ను తయారు చేశారు. ఆ టైల్స్‌తో ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ వెస్ట్‌ జోనల్‌ అధికారులు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌తో తయారు చేసిన వాల్, రూఫ్‌ షీట్స్‌తో టాయిలెట్ల నిర్మాణం చేపట్టడం విశేషం. మియాపూర్‌ మెట్రో వద్ద ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌తో తయారు చేసిన షీట్స్‌తో ఫైర్‌ ప్రూఫ్‌  గదిని నిర్మించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రీసైక్లింగ్‌తో ప్లాస్టిక్‌ వ్యర్థానికి ఓ అర్థం చెబుతున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు.

అయ్యప్ప సొసైటీలో ఫుట్‌పాత్‌ల నిర్మాణం..
ఆర్డర్‌ చేసి ఇండోర్‌ నుంచి ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ టైల్స్‌ను  తెప్పిస్తున్నారు. శేరిలింగంపల్లి సర్కిల్‌– 20లోని డాగ్‌ పార్క్, శిల్పారామం ముందు, చందానగర్‌ సర్కిల్‌ 21లోని అయ్యప్ప సొసైటీ 100 అడుగుల రోడ్డులో ఫుట్‌పాత్‌ల నిర్మాణం పైలట్‌ ప్రాజెక్ట్‌గా చేపడుతున్నారు. జీహెచ్‌ఎంసీ, బ్యాంబూ హౌస్‌ ఇండియా సంయుక్తంగా ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేస్తున్నాయి. 6 నెలలకోసారి ఈ టైల్స్‌ను మార్చాల్సిన అవసరం లేకపోవడంతో ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది. 600 పాలీబ్యాగ్స్‌ను రీసైక్లింగ్‌ చేస్తే 300 గ్రాముల బరువైన ఒక టైల్‌ను తయారు చేయవచ్చు. దృఢంగా ఉండే ఈ టైల్స్‌ డ్యామేజ్‌ కావు. అంతేకాకుండా వర్షపు నీటిని భూమిలోకి ఇంకేందుకు వీలుంటుంది. భూగర్భ జలాలు పెంపొందేందుకు అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ టైల్స్‌ను బెస్ట్‌ ప్రాక్టీస్‌గా గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా మినిస్ట్రీ ఆఫ్‌ అర్బన్‌ అఫైర్స్‌ గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఇలాంటి టైల్స్‌ను వాడాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఎకో ఫ్రెండ్లీ టైల్స్‌ వాడకంతో ప్లాస్టిక్‌ వ్యర్థాలను డంప్‌ యార్డ్‌కు చేరకుండా చేయవచ్చు.

మినిస్ట్రీ ఆఫ్‌ అర్బన్‌ ఎఫైర్స్‌ గుర్తించింది.. 
ప్లాస్టిక్‌ రిసైక్టింగ్‌ టైల్స్‌తో ఫుట్‌పాత్‌లు వేయడాన్ని గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా అర్బన్‌ అఫైర్స్‌ గుర్తించింది. ఇలాగే దేశవ్యాప్తంగా అమలు చేయాలని మార్గదర్శకాలు పంపించింది. రీసైక్లింగ్‌తో డంప్‌ యార్డ్‌లకు ప్లాస్టిక్‌ తగ్గే అవకాశం ఉంది. మన దగ్గర ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ చేసి 3000 చెత్త డబ్బాలు ఉత్పత్తి చేసి జోనల్‌ పరిధిలో పెట్టాం. ఇప్పుడు 21 చెరువుల వద్ద రిసైక్లింగ్‌ షీట్స్‌తో టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నాం. ప్లాస్టిక్‌  రిసైక్లింగ్‌  వాల్, రూఫ్‌ టాప్‌ షీట్లతో ఫైర్‌ ప్రూఫ్, సేఫ్టీ గదిని మియాపూర్‌ మెట్రో వద్ద ప్రయోగాత్మకంగా నిర్మించాం.     – హరిచందన దాసరి, వెస్ట్‌ జోనల్‌ కమిషనర్‌  

ఫైర్‌ ప్రూఫ్‌ గది నిర్మాణం..
మియాపూర్‌ మెట్రో స్టేషన్‌లో ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌తో చేసి షీట్స్‌తో వాచ్‌మెన్‌ ఉండేందుకు ఫైర్‌ప్రూఫ్‌ గదిని నిర్మించారు. రూ.1.50 లక్షల వ్యయంతో ఈ హౌస్‌ను ఏర్పాటు చేశారు. ఐరన్‌ రాడ్‌లతో నిర్మాణం చేపడితే ఖర్చు రెట్టింపు కానుంది. టెట్రాప్యాక్స్, బాటిల్‌ క్యాప్స్, పాలీబ్యాగ్స్‌ను రీసైక్లింగ్‌ చేసిన వాల్, రూఫ్‌ షీట్స్‌తో గదిని నిర్మించారు. ఈ మెటీరియల్‌ వాడి హీట్‌ ప్రూఫ్, వాటర్‌ ప్రూఫ్, ఫైర్‌ ప్రూఫ్‌ డ్యామేజ్‌ ఫ్రీ హౌస్‌లను తయారు చేయవచ్చు.

చెరువుల వద్ద టాయిలెట్ల నిర్మాణం..
ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌తో చేసిన షీట్స్‌తో చెరువుల వద్ద టాయిలెట్ల నిర్మాణం చేపడుతున్నారు. జీహెచ్‌ఎంసీ వెస్ట్‌ జోనల్‌ పరిధిలోని 21 చెరువుల వద్ద ప్లాస్టిక్‌ టాయిలెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే చందానగర్‌లోని గంగారం చెరువుతో పాటు రామసముద్రం, గుర్నాథం చెరువు, మల్కం చెరువు సమీపాల్లో టాయిలెట్ల నిర్మాణం చేపడుతున్నారు. వినాయక నిమజ్జనం నాటికి 21 చెరువుల వద్ద టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇప్పటికే వెస్ట్‌ జోనల్‌ పరిధిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలతో తయారైన బిన్స్‌ను వాడుకలోకి తెచ్చారు. డంపింగ్‌ యార్డ్‌తో వేరు చేసిన ప్లాస్టిక్‌ను సేకరించి సనత్‌నగర్‌లోనే రీసైక్లింగ్‌ చేసి వాల్‌షీట్స్, చెత్త బిన్స్‌ను తయారు చేస్తున్నారు.    ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌తో చేసిన టైల్స్‌తో వేసిన ఫుట్‌పాత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement