ప్లాస్టిక్‌పై యుద్ధం | Collector Narayana Reddy Implement Plastic Awareness Program In Mulugu | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌పై యుద్ధం

Published Sat, Nov 2 2019 2:30 AM | Last Updated on Sat, Nov 2 2019 2:30 AM

Collector Narayana Reddy Implement Plastic Awareness Program In Mulugu - Sakshi

కిలో ప్లాస్టిక్‌కి బదులుగా  బియ్యం అందిస్తున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి (ఫైల్‌)

సాక్షి, ములుగు: ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే రాజ్యమేలు తోంది. పల్లె లేదు.. పట్నం లేదు.. ఇల్లు లేదు.. వాకిలి లేదు.. ఎక్కడ చూసినా ఈ మహమ్మారే కనిపిస్తోంది. చివరకు పచ్చని అడవులు, ఆహ్లాదపరిచే పర్యాటక ప్రాంతాలు, భక్తి తన్మయత్వాన్ని పంచే ఆలయాలకు నెలవైన ములుగు ఏజెన్సీ జిల్లాలో సైతం ప్లాస్టిక్‌ భూతం బెంబేలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఈ మహమ్మారిని అరికట్టాలని నిర్ణయించారు. అయితే, ప్లాస్టిక్‌ వస్తువు లను ఇవ్వాలని అడిగితే ప్రజలు ముందుకురారని భావించిన ఆయన.. ఇందుకు ఓ ఉపాయం కని పెట్టారు. కేజీ ప్లాస్టిక్‌ అందించేవారికి కేజీ ఫైన్‌ రైస్‌ ఇస్తామని ప్రకటించారు. దీంతో భారీగా స్పందన వచ్చింది. జిల్లాలో గతనెల 16 నుంచి 26 వరకు చేపట్టిన కార్యక్రమం ద్వారా తొమ్మిది మండలాల్లోని 174 గ్రామపంచాయతీల పరిధిలో ఏకంగా 48,849 కేజీల ప్లాస్టిక్‌ సేకరణ జరగడం విశేషం. పైగా వరుస వర్షాలతో పనిలేక ఇబ్బందులు పడిన వారికి దీనివల్ల ఉపాధి కూడా కలిగినట్లయింది. ఇప్పటి వరకు సేకరించిన ఈ ప్లాస్టిక్‌ను డిస్పోజ్‌ చేయడానికి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్లాస్టిక్‌ కవర్లను సిమెంట్‌ ఫ్టాక్టరీలకు తరలిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో మేడారం జాతర వరకు దీనిని కొనసాగించాలని నిర్ణయించారు.

జాకారం నుంచి మొదలు... 
30 రోజుల ప్రణాళిక పనుల్లో భాగంగా ములుగు కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎస్పీ సంగ్రాంసింగ్‌ పాటిల్‌ ములుగు మండలంలోని జాకారం గ్రామాన్ని పరిశీలించారు. ఆదివారం సెలవు దినం కావడంతో చిన్నారులు అక్కడ తిరుగుతూ కనిపించారు. దీంతో ఎస్పీ సంగ్రాంసింగ్‌ వారికి సరదాగా ప్లాస్టిక్‌ సేకరణ టాస్క్‌ ఇచ్చారు. దీంతో వారు మూడు బృందాలుగా విడిపోయి గంట సమయంలోనే ఏకంగా 996 ప్లాస్టిక్‌ బాటిళ్లను సేకరించారు. వాటిని చూసిన నారాయణరెడ్డి.. ఒక్క గ్రామంలోనే ఇన్ని బాటిళ్లు ఉంటే జిల్లాలో ఎన్ని ఉంటాయో అని భావించి ప్లాస్టిక్‌పై సమరభేరి పూరించాలని నిర్ణయం తీసుకుని, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

బియ్యం కొనుగోలుకు విరాళాలు...
ప్లాస్టిక్‌ కవర్లకు ప్రత్యామ్నాయంగా జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు, అంగన్‌వాడీ సిబ్బంది తరపున ప్రతీ గ్రామం నుంచి పాత, కొత్త బట్ట సంచులను సేకరించారు. స్థానిక టైలర్ల సహాయంతో సుమారు 40వేల బట్ట సంచులను సేకరించి ప్రజలకు పంపిణీ చేశారు. ఇక ప్లాస్టిక్‌ గ్లాసులకు బదులుగా వెదురు బొంగులతో తయారు చేయించిన కప్పుల వాడకంపై జిల్లా సంక్షేమ శాఖ అవగాహన కల్పించింది. ప్లాస్టిక్‌కి అడ్డుకట్టగా మంగపేట మండల కేంద్రానికి చెందిన చికెన్‌ వ్యాపారి ఇంటి నుంచి టిఫిన్‌ బాక్సులు తీసుకొస్తే కేజీకి రూ.10 తక్కువ తీసుకుంటానని ప్రకటించాడు. ఇక ఫైన్‌ రైస్‌ కొనుగోలుకు స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, వ్యాపారులు తమ వంతుగా విరాళాలు అందించారు. ఇలా అన్ని రంగాల ప్రజల చేయూతతో ఇతర జిల్లాలకు ఆదర్శంగా ములుగులో ప్లాస్టిక్‌ నిషేధం పకడ్బందీగా అమలవుతోంది. ఇది నిరంతర కార్యక్రమంగా కొనసాగుతుందని కలెక్టర్‌ ప్రకటించారు.

ప్లాస్టిక్‌ వాడితే రూ.5వేల జరిమానా...
జిల్లా యంత్రాంగం ఆదేశాలను పట్టించుకోకుండా ఎవరైనా సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ వినియోగిస్తే రూ.5వేల జరిమానా విధిస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు. ములుగు జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలకు వచ్చే వారు బయటి ప్రాంతాల నుంచి ప్లాస్టిక్‌ వస్తువులు, గ్లాసులు, ప్లేట్లు తీసుకురాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ములుగు మండలం గట్టమ్మ ఆలయంతో పాటు జిల్లా సరిహద్దుల్లో నాలుగు చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. చెక్‌ పోస్టుల వద్ద వాహనాలు తనిఖీ చేసి వారి దగ్గర ఉన్న ప్లాస్టిక్‌ని తీసుకొని ప్రత్యామ్నాయంగా బట్ట సంచులు, ప్లాస్టిక్‌ రహిత గ్లాసులు, పేపర్‌ ప్లేట్లు అందిస్తారు. ఇందుకయ్యే ఖర్చును భక్తులు, పర్యాటకుల నుంచి వసూలు చేస్తారు. 

మేడారంపై ప్రత్యేక దృష్టి 
కోటిమందికి పైగా హాజరయ్యే మేడారం మహాజాతర వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది. ఈ నేపథ్యంలో జాతరలో ప్లాస్టిక్‌ని పకడ్బందీగా నిషేధించేందుకు జిల్లా యంత్రాంగం సమయత్తమవుతోంది. జాతర జరిగే  సమయంలో వెయ్యి మంది వలంటీర్లను ప్రత్యేకంగా నియమిస్తారు. వీరంతా భక్తులను పరిశీలించి ప్లాస్టిక్‌ వాడకుండా చర్యలు తీసుకుంటారు. 

ప్లాస్టిక్‌ నియంత్రణ కొనసాగుతుంది
జిల్లాలో చేపట్టిన ప్లాస్టిక్‌ నిషేధ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహాయం అందించారు. ప్లాస్టిక్‌ నియంత్రణ నిత్యం కొనసాగుతుంది. గ్రామాల్లో ప్లాస్టిక్‌ సేకరణ దాదాపుగా పూర్తిచేశాం. అలాగే ప్లాస్టిక్‌ వస్తువులు విక్రయించకుండా నోటీసులిచ్చాం. జిల్లాలోని దేవాలయాలు, పర్యాటక ప్రాంతాల్లోనూ అమలు చేస్తున్నాం. బయటి నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులు ప్లాస్టిక్‌ వస్తువులను తీసుకు రాకుండా ములుగు మండలం గట్టమ్మ ఆలయం వద్దే కాకుండా నలుమూలల చెక్‌పోస్టులు ఏర్పాటుచేస్తాం. ముఖ్యంగా మేడారం మహా జారతను ప్లాస్టిక్‌ ప్రీ జాతరగా నిర్వహించడానికి సిద్ధమవుతున్నాం.
– చింతకుంట నారాయణరెడ్డి, కలెక్టర్, ములుగు జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement