ప్లాస్టిక్‌ను ఇలా కూడా వాడొచ్చు.. | Plastic Bricks Are Strong as Normal Bricks | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ ఇటుక.. పర్యావరణ హితమిక

Published Tue, Nov 19 2019 10:11 AM | Last Updated on Tue, Nov 19 2019 10:11 AM

Plastic Bricks Are Strong as Normal Bricks - Sakshi

సాక్షి, అమరావతి : మానవాళి మనుగడకే పెను సవాల్‌ విసురుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్మూలన పెద్ద సమస్యగా పరిణమించిన తరుణంలో వాటితో ఇటుకలు తయారు చేసి, నిర్మాణాల్లో ఉపయోగించ వచ్చనే విషయం పర్యావరణ పరిరక్షణ పరంగా ఊరట కలిగిస్తోంది. మట్టి, బూడిద (ఫ్లైయాష్‌).. సిమెంట్, ఇసుక మిశ్రమంతో తయారైన ఇటుకలతో నిర్మించే కట్టడాల కంటే ప్లాస్టిక్‌ వ్యర్థాలతో తయారయ్యే ఇటుకలే పది కాలాలపాటు చెక్కు చెదరకుండా బలంగా ఉంటాయంటున్నారు ఇంజనీరింగ్‌ నిపుణులు, పరిశోధకులు. ప్లాస్టిక్‌ ఇటుకలతో నిర్మించే కట్టడాలకు నీటిని పీల్చుకునే స్వభావం చాలా తక్కువగా ఉంటుందని.. ఉష్ణోగ్రత, శబ్దాలను నియంత్రిస్తాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. ఈ ఇటుకల ఉత్పత్తి వ్యయం కూడా తక్కువే. ఈ దృష్ట్యా కొంత కాలంగా పలు దేశాల్లో ప్లాస్టిక్‌తోనూ ఇటుకలు తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్‌ వస్తువులు భూమిలో కలిసిపోవడానికి కనీసం 500 ఏళ్లు పడుతుంది. ప్రపంచంలో ప్లాస్టిక్‌ వినియోగం నానాటికీ పెరిగిపోతుండటం, ఆ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గాలి, ఉపరితల, భూగర్భ జలాలు, భూమి, ఆకాశం కలుషితం అవుతున్నాయి. దీని వల్ల ఏటా కోట్లాది పక్షులు, జంతువులు, చేపలు మృత్యువాత పడుతున్నాయి.

ఉభయతారకంగా వ్యర్థాల నిర్మూలన
ప్రపంచంలో ప్లాస్టిక్‌ వినియోగంలో యూరోపియన్‌ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో చైనా, అమెరికా, భారతదేశం ఉన్నాయి. ఏడాదికి సగటున ఒక యూరోపియన్‌ పౌరుడు 36 కేజీల ప్లాస్టిక్‌ వ్యర్థాలను బయట పడేస్తున్నాడు. తలసరి ప్లాస్టిక్‌ వ్యర్థాల పరిమాణం చైనాలో 28 కేజీలు, అమెరికాలో 24 కేజీలు, మన దేశంలో 11 కేజీల వరకు ఉంటుందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) అంచనా వేసింది. ఈ లెక్కన ఏడాదికి 26 వేల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు దేశంలో పోగుపడుతున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో గాలి, నీరు, భూ కాలుష్యానికి దారితీస్తోంది. వీటి నిర్మూలనకు తొలుత అర్జెంటీనా విస్తృత పరిశోధనలు చేసింది. ఇటుకల తయారీలో ప్లాస్టిక్‌ను వినియోగించి.. మట్టి, ఫ్లైయాష్, సిమెంట్‌ ఇటుకల కంటే ఐదు శాతం పటిష్టంగా ఉంటాయని తేల్చింది. నీటిని పీల్చుకునే స్వభావం చాలా తక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఉష్ణోగ్రత, శబ్ద తరంగాలను నిరోధించే స్వభావం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ దృష్ట్యా ప్లాస్టిక్‌ ఇటుకలతో నిర్మించిన కట్టడాల మన్నిక అధికంగా ఉంటుంది. వీటి ఉత్పత్తి వ్యయం కూడా తక్కువ. దీంతో అర్జెంటీనాలో తొలిసారిగా భారీగా ప్లాస్టిక్‌ ఇటుకల తయారీ, వినియోగం మొదలైంది. ఆ తర్వాత యూరోపియన్‌.. అమెరికా, చైనా తదితర దేశాల్లోనూ ప్లాస్టిక్‌ ఇటుకల వినియోగం పెరిగింది.

ఇటుకల తయారీ ఇలా..  

  • ప్లాస్టిక్‌ వ్యర్థాలైన బాటిళ్లు, కవర్లను ఒక పెద్ద బాయిలర్‌లో వేసి 105 నుంచి 110 డిగ్రీల వరకు వేడి చేసి, ద్రవరూపంలోకి మారుస్తారు.
  • ఈ ద్రావకాన్ని గది ఉష్ణోగ్రత వద్ద అంటే 27 డిగ్రీలకు వచ్చేలా చల్చార్చుతారు.
  • ఒక శాతం ప్లాస్టిక్‌ ద్రావకానికి మూడు, నాలుగు లేదా ఐదు శాతం మట్టి లేదా ఫ్లైయాష్‌ (బూడిద) లేదా సిమెంట్‌ను చేర్చి మిశ్రమంగా మారుస్తారు.
  • ఇటుక కావాల్సిన పరిమాణంలో రూపొందించిన దిమ్మల్లో ఆ మిశ్రమాన్ని పోసి ఇటుకలు తయారు చేస్తారు.
  • వారం రోజులపాటు ఈ ఇటుకలపై నీటిని చల్లాక (క్యూరింగ్‌) నిర్మాణాల్లో వినియోగిస్తారు.

దేశంలో కొచ్చిలో శ్రీకారం
కేరళలోని కొచ్చిలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్మూలనకు ఇంజనీరింగ్‌ విద్యార్థులు నడుంబిగించారు. 500 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను సమీకరించి.. 2,500 టన్నుల పరిమాణంలో ఇటుకలను తయారు చేసి, భవన నిర్మాణాల్లో వినియోగించేలా ప్రజలను చైతన్యవంతం చేశారు. ఒక టన్ను ప్లాస్టిక్‌ వ్యర్థాలను అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే 800 కేజీల ప్లాస్టిక్‌ ద్రావకం వస్తుంది. ఒక శాతం ప్లాస్టిక్‌ ద్రావకానికి మూడు శాతం మట్టిని కలిపి తయారు చేసిన ఇటుక కంటే.. ఒక శాతం ప్లాస్టిక్‌ ద్రావకానికి నాలుగు శాతం మట్టిని కలిపి తయారు చేసిన ఇటుకలు బలంగా ఉంటాయని తేలింది. దేశంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్లాస్టిక్‌ వ్యర్థాలు భారీ ఎత్తున పేరుకుపోయి, పర్యావరణానికి పెను సవాల్‌ విసురుతున్న తరుణంలో ప్లాస్టిక్‌ ఇటుకల తయారీ, వినియోగంపై ప్రజల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది.

ప్లాస్టిక్‌ ఇటుకల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించాలి
ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఇటుకల తయారీ పర్యావరణహితమైనది. భారీగా పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను సరైనరీతిలో రీసైక్లింగ్‌ చేసి, ప్రత్యామ్నాయ అవసరాలకు సద్వినియోగం చేసుకోవచ్చు. ఇతర ఇటుకలతో పోలిస్తే వీటి తయారీ వ్యయం, బరువు తక్కువ. నాణ్యత ఎక్కువ. మట్టి, ఫ్లైయాష్‌ ఇటుకల కంటే ప్లాస్టిక్‌ వ్యర్థాలతో తయారయ్యే ఇటుకలు నిర్మాణ రంగంలో మరింత అనువుగా ఉంటాయి. వీటిని భిన్న ఆకృతుల్లో తయారు చేసి అలంకృతంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ప్లాస్టిక్‌ ఇటుకల తయారీతో పాటు నిర్మాణ రంగంలో వీటి వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
– ఎస్‌పీ అంచూరి, ఆర్కిటెక్ట్, స్ట్రక్చరల్‌ ఇంజనీర్, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement