సరిపల్లి పద్మశ్రీ కాలనీ సమీపంలో పడి ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు
సాక్షి, నరసాపురంరూరల్: వారపు సంతల నుంచి బస్టాండ్‌ల వరకు ఎవరి వద్ద చూసినా ప్లాస్టిక్ కవర్లే దర్శనమిస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్ల నిషేధం ఉన్నా వాటి అమలు మాత్రం కాగితాలకే పరిమితమవుతుంది. పర్యావరణానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్న ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నా ప్రజల్లో మాత్రం అవగాహన కరువైంది. అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్లాస్టిక్ వినయోగం వల్ల కలిగే దుష్ప్రయోజనాలు గురించి అవగాహన కల్పిస్తే వాటి వాడకాన్ని తగ్గించవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాగితాలు అయితే కొద్ది రోజులకు వస్త్రాలయితే కొద్ది నెలల్లోనే మట్టిలో కలిసిపోతాయి. ప్లాస్టిక్ కవర్లు మాత్రం ఏళ్లు గడిచినా కరగవు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేయకపోవడంతో వాటి వాడకం రోజురోజుకూ పెరిగిపోతుందని పలువురు స్పష్టం చేస్తున్నారు. 2012లోనే ప్లాస్టిక్ వాడకం నిషేధించినట్లు ప్రకటను వచ్చినప్పటికీ ప్రస్తుతం అవి (ప్లాస్టిక్ వ్యర్థాలు) ఆక్రమించే స్థలం సాధారణ చెత్త కంటే అధికంగా ఉంటుంది.
దుకాణాలకు వెళ్లి ప్లాస్టిక్ కవర్లలో సరుకులు తీసుకుని అనంతరం వాటిని ఎక్కడ బడితే అక్కడ పారవేస్తున్నారు. ముఖ్యంగా మురికి నీటి కాలువల్లో ఎటు చూసినా ప్లాస్టిక్ కవర్లే ఉండడంతో అవీ కాస్తా నిండిపోతున్నాయి. ప్లాస్టిక్ వాడకాలను తగిచడానికి ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకువచ్చినా ఫలితం లేకపోయింది. ప్లాస్టిక్ కవర్లకు బదులు పేపర్ బ్యాగులు వాడుకలోకి తీసుకురావాలని ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే ముప్పుపై ప్రజలకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.
అవగాహన కల్పించడంలో విఫలం
ప్లాస్టిక్ కవర్లు నియంత్రించడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమవుతున్నారు. ఒక్కోసారి గ్రామాల్లో సైతం ఇంటింటికీ ప్రచారం నిర్వహించడంతోపాటు పలువురు కళాశాల విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్ క్యాంపిన్లు జరిపిన సందర్భంలో ర్యాలీలు నిర్వహించడం, పంచాయతీ వారు టాంటాం వేయడం, అన్నీ జరిగాయి. అయితే నిషేధం అమలు ఎక్కడా మచ్చుకైనా కనిపించడం లేదు.
- ముద్దాల ప్రశాంతి, లక్ష్మణేశ్వరం
అవగాహన కల్పించాలి
ప్లాస్టిక్ కవర్లు పర్యావరణానికి ఎంతో ముప్పు అని మేధావులు, అధికారులు పదే పదే చెబుతున్నారు. అయితే తరచూ వ్యాపారస్తులు, వినియోగదారులు ప్లాస్టిక్ కవర్లనే వినియోగించడం పరిపాటిగా మారింది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం, సమతుల్యత లోపించడం వంటి వాటికి కవర్ల వినియోగం ప్రధాన కారణమని చెపుతున్నప్పటికీ ఎవరూ వినే పరిస్థితి లేకపోవడం దారుణం. పర్యావరణానికి ముప్పు కలిగించే కవర్ల నిషేదంపై శ్రద్ధ చూపాలి.
– కడలి ఆదినారాయణ, నరసాపురం
Comments
Please login to add a commentAdd a comment