అరెస్ట్‌ చేశారు.. చార్జిషీట్‌ మరిచారు | West Godavari Police Action In Sri Gowthami Case Investigation Were Only Nominal | Sakshi
Sakshi News home page

అరెస్ట్‌ చేశారు.. చార్జిషీట్‌ మరిచారు

Published Wed, Jul 17 2019 8:12 AM | Last Updated on Wed, Jul 17 2019 8:13 AM

West Godavari Police Action In Sri Gowthami Case Investigation Were Only Nominal  - Sakshi

శ్రీగౌతమి హత్యకేసులో ప్రధాన నిందితులు

సాక్షి , ఏలూరు, నరసాపురం: జిల్లాలో సంచలనం కలిగించిన హత్య కేసు విచారణలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. కేసులో నిందితులను అరెస్టు చేసిన ఏడాది తర్వాత కూడా చార్జిషీట్‌ను దాఖలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిందితులపై రౌడీషీట్‌ తెరుస్తామని అప్పటి పోలీసు అధికారులు ప్రకటించారు. అయితే ఇప్పటివరకూ ఆ దిశగా చర్యలు లేవు.‘దంగేటి శ్రీగౌతమిది పక్కా హత్య. అది యాక్సిడెంట్‌ కాదు. ఈ కేసులో ఇప్పటివరకూ సజ్జా బుజ్జితో పాటు మరో ఆరుగురి పాత్రను గుర్తించాం. అయితే ఈ కేసు దర్యాప్తు ఇప్పటికి సగమే పూర్తయ్యింది. ఇంకా సగం దర్యాప్తు మిగిలి ఉంది.’ ఇది  శ్రీగౌతమి హత్యకేసు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టే ముందు అప్పటి పాలకొల్లు రూరల్‌ సీఐ కె.రజనీకుమార్‌ 2018 జూన్‌ 26న చెప్పిన మాట. అయితే అప్పటి నుంచి కేసు పురోగతి ఏమీలేదు. మరి సాక్షాత్తు పోలీసులే చెప్పిన మిగిలిన సగం దర్యాప్తు ఏమైందనేది ఎవరికీ సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయిం ది.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన శ్రీగౌతమి హత్య కేసు దర్యాప్తు తీరుపై మళ్లీ విమర్శలు వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో పోలీసు చర్యలు నామమాత్రంగాగే ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రమాదం మాటున పక్కా ప్లాన్‌తో శ్రీగౌతమిని టీడీపీ నేత, మాజీ సర్పంచ్‌ సజ్జా బుజ్జి హత్య చేయించినట్టుగా పోలీసులు తేల్చారు. కేసులో నరసాపురం జెడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్‌ ఏ–3 నిందితుడిగా ఉండటంతో ఈ హత్యకేసు అప్పట్లో  మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో ఈ ఘాతుకం వెనుక మరింత మంది పెద్దలు ఉన్నారనే ప్రచారం సాగింది. దర్యాప్తు సగమే అయ్యిందని పోలీసులు చెప్పడంతో మున్ముందు అసలు పెద్దలు తెరమీదకు వస్తారని అంతా అనుకున్నారు. ఈ కేసులో పూర్తిస్థాయి చార్జిషీట్‌ను పోలీసులు ఇప్పటివరకూ దాఖలు చేయలేదు. కేవలం ప్రిలిమినరీ చార్జి్జషీట్‌ను కోర్టుకు సమర్పించి ఊరుకున్నారు. 

పోలీసులు చేసిన కొత్త దర్యాప్తు  ఏమిటి? 
2017 జనవరి 18 రాత్రి శ్రీగౌతమి హత్య జరిగింది. కేసును 15 రోజుల్లోనే అప్పటి పోలీసు అధికారులు క్లోజ్‌చేశారు. ప్రమాదం నుంచి బయటపడ్డ శ్రీగౌతమి సోదరి పావని అది హత్య అని ఎంతమొత్తుకున్నా పోలీసులు పెడచెవిన పెట్టారు. మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు, విద్యార్థులు అందోళనలు చేసినా కూడా అది ముమ్మాటికీ రోడ్డు ప్రమాదమేనని పోలీసులు కుండబద్దలు కొట్టారు. అయితే కేసులో నిందితుడిగా ఉన్న సజ్జా బుజ్జి, ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గం నేత కావడం, స్థానికంగా అదే సామాజికవర్గానికి చెందిన కొందరు బడా వ్యక్తులు అండ ఉండటంతోనే పోలీసులు కేసును పట్టించుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. అయితే అప్పట్లో పోలీసులు అదేమీ పట్టించుకోలేదు. సోదరికి జరిగిన అన్యాయంపై పావని ఒంటరి పోరాటం చేసింది. సీబీసీఐడీని ఆశ్రయించడంతో కథ మలుపు తిరిగింది.

సీబీసీఐడీ దర్యాప్తు సాగించి ఇది పక్కా ప్లాన్‌తో చేసిన హత్య అని, ఇందులో ప్రధానంగా సజ్జా బుజ్జితో పాటు మరో ఆరుగురు ఉన్నారని తేల్చారు. ఈ వివరాలను పోలీసులకు అందించారు. దీంతో హడావుడిగా మళ్లీ పోలీసులు కేసును తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏ–1, ఏ–2లుగా ఉన్న టీడీపీ నేత సజ్జా బుజ్జి, బొల్లంపల్లి రమేష్‌తో పాటు ఏ–3గా ఉన్న నరసాపురం జెడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్, అతని సోదరుడు బాలం ఆండ్రూను జూన్‌ నెల 26న అరెస్ట్‌ చేశారు. మరోవారం తరువాత బొల్లంపల్లి రమేష్‌ కారు డ్రైవర్‌ కవురు లక్ష్మ ణ్‌ను, పతకాన్ని పక్కాగా అమలుచేసి శ్రీగౌతమి ప్రాణాలు తీసిన సందీప్, దుర్గాప్రసాద్‌ను అరెస్ట్‌ చేసి కోర్టుకు పంపారు. నిజానికి ఇక్కడి వరకూ దర్యాప్తు చేసింది సీబీసీఐడీనే. పోలీసులు కనుక్కున్న కొత్త విషయం ఏమీలేదు. ముందు ప్రమాదమని చెప్పి, తరువాత అది రోడ్డు ప్రమాదం కాదు హత్య అని చెప్పడం తప్ప.

ఇంకా నీరుగార్చే ప్రయత్నమేనా..
ప్రారంభంలో కేసు దర్యాప్తు పూర్తిగా పక్కదారి పట్టినట్టుగా సీబీసీఐడీ తేటతెల్లం చేసింది. అయినా కూడా ఈ కేసు ప్రారంభ దర్యాప్తులో ఉన్న పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిజానికి పోలీసుశాఖ అందిరిని సస్పెండ్‌ చేస్తుందని భావించారు. ఈకేసులో పావని పోరాటం చాలాకాలం కొనసాగించింది. నరసాపురం సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న సజ్జా బుజ్జితో పాటు మిగిలిన నిందితులకు నిబంధనలకు విరుద్ధంగా సకల సౌకర్యాలు అందుతున్నాయని పావని జైళ్లశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, వారు విచారణ చేయడం కూడా సంచలనం కలి గించింది. తాను స్కూటీపై వెళుతుండగా సజ్జా బుజ్జి కారుతో  ఢీకొట్టే ప్రయత్నం చేశాడని నెలరోజుల క్రితం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి, ఇటీవల బదిలీ అయిన జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ను కలిసి పావని విన్నవించింది. అయితే బుజ్జిపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని ఎస్పీ చెప్పారని, ఈ కేసులో కనీసం కలవడానికి కూడా నరసాపురం డీఎస్పీ అవకాశం కలిపించడం లేదని పావని ఆవేదన వ్యక్తం చేస్తోంది. కొంతమంది టీడీపీ అనుకూల పోలీసు ఉన్నతాధికారులు బుజ్జి వెనుక ఉండి తనకు అన్యాయం చేస్తున్నారని పావని ఆరోపిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

మృతురాలు దంగేటి శ్రీగౌతమి, దంగేటి పావని, శ్రీగౌతమి సోదరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement