విలేకరుల సమావేశంలో పరామర్ష్ పోస్టర్‌ను విడుదల చేస్తున్న యాజమాన్యం
సాక్షి, పశ్చిమగోదావరి(నరసాపురం) : రాష్ట్రంలోనే గుర్తింపు కలిగిన నరసాపురం వైఎన్ కళాశాల స్థాయి పెరిగింది. మెంటారు కళాశాలగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దీనిని గుర్తించింది. యూజీసీ దేశంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి రూపొందించిన పరామర్ష్ పథకానికి వైఎన్ కళాశాలను ఎంపిక చేసింది. దేశంలో మొత్తం 167 కళాశాలలను ఈ పథకానికి యూజీసీ ఎంపిక చేసింది. రాష్ట్రంలో 10 కళాశాలలు, తెలంగాణలో 4 కళాశాలలు ఈ కార్యక్రమానికి ఎంపికయ్యాయి. రాష్ట్రంలోని 10 కళాశాలల్లో జిల్లాకు సంబంధించి ఒకటి వైఎన్ కశాశాల కాగా, రెండోవది ఏలూరు సెయింట్ థెరిస్సా కళాశాల. కొన్ని జిల్లాల్లో కళాశాలలకు, యూనివర్సటీలకు ఈ అవకాశం దక్కకపోవడం గమనార్హం. కళాశాలలోని మౌలిక వసతులు, బోధనా పద్ధతులు, ప్రొఫెసర్ల సామర్థ్యం, గత చరిత్ర తది తర అంశాలను పరిగణలోకి తీసుకుని వైఎన్ కళాశాలను ఎంపిక చేశారు. ఇప్పటికే వైఎన్ కళాశాల నాక్ ఏ గ్రేడ్‌ను మూడుసార్లు సాధించింది.
డీమ్డ్ యూనివర్సిటీకి మార్గం సుగమం
వైఎన్ కళాశాలను డీమ్డ్ యూనివర్సిటీగా అభివృద్ధి చేయాలనే ప్రయత్నం సాగుతోంది. మెంటారు కళాశాలగా గుర్తింపు దక్కడం ద్వారా దీనికి మార్గం సుగమం అయ్యిందని కళాశాల ఇన్‌చార్జ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ పోలిశెట్టి రఘురామ్, ప్రిన్సిపాల్ కె.వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ ఎస్‌ఎం మహేశ్వరి, ఐ క్యూఏసీ కో–ఆర్డినేటర్లు డాక్టర్ కె.నాగేశ్వరరా వు, డాక్టర్ గంధం రామకృష్ణ ఆదివారం కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. తాజా గుర్తింపుతో రూ.30 లక్షలు గ్రాంట్ వస్తుందన్నారు. తమ కళాశాల ఉభయగోదావరి జిల్లాల్లోని ఐదు కళాశాలలను ఎంపిక చేసుకుని వాటికి నేక్ గుర్తింపు వచ్చేలా కృషిచేయాలన్నారు. దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణ వ్యవహరిస్తారని చెప్పారు. తాము భీమవరం వబిలిశెట్టి సత్యనారాయణ, కృష్ణమూర్తి కళాశాల, తాళ్లపూడి కలిదిండి సుబ్బారావు మెమోరియల్ డిగ్రీ కళాశాల, తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు దీప్తి కళాశాల, అమలాపురం వెంకటేశ్వర డిగ్రీ కళాశాల, లక్కవరం అల్లూరి వరలక్ష్మి కళాశాలను ఎంచుకున్నామని చెప్పారు. డాక్టర్ చినిమిల్లి శ్రీనివాస్, ట్రెజరర్ పొన్నపల్లి శ్రీరామారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment