ప్లాస్టిక్‌ ముప్పు ఇంతింత కాదయా! | Environment: Needs To Focus On Reduce Plastic Waste | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ ముప్పు ఇంతింత కాదయా!

Published Sat, May 27 2023 1:05 AM | Last Updated on Sat, May 27 2023 1:05 AM

Environment: Needs To Focus On Reduce Plastic Waste - Sakshi

ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్‌ 5) ద్వారా పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ యేడు ప్లాస్టిక్‌ మీద దృష్టి పెట్టాలని నిర్ణయం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2023... ప్లాస్టిక్‌ కాలుష్యంపై ప్రజలు చేపట్టే చర్యలు ముఖ్యమైనవని గుర్తు చేస్తున్నది. ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు తీసుకునే చర్యలు ప్రజల ఆకాంక్షల మేరకే ఉంటాయని నొక్కి చెబుతున్నది. ప్రజా చైతన్యంతో ఒక ‘వృత్తాకార ఆర్థిక వ్యవస్థ’కు నాంది పలికే సమయం ఆసన్నమైంది. ప్లాస్టిక్‌ కాలుష్యంతో ఏర్పడే ప్రతికూల ప్రభావాల నుండి భూమిని, మానవ సమాజాన్ని, సహజ ప్రకృతి వ్యవస్థలను రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.

నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ప్లాస్టిక్‌ కాలుష్యం ఒకటి. ఇప్పటికే బిలియన్ల టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి అయింది. జీవవైవిధ్యంతో పాటు మానవ ఆరోగ్యం మీద కూడా ప్లాస్టిక్‌ దుష్ప్రభావం చూపుతుంది. ౖఆహారంలో, నీటిలో మెక్రో ప్లాస్టిక్‌ చేరి నేరుగా మనుష్యుల ఆరోగ్యంపై త్వరగా ప్రభావం చూపే దశకు చేరుకున్నాం. ప్లాస్టిక్‌ వస్తువు లను కాల్చడంవల్ల విష వాయువులు వెలువడి ఆహారం, నీరు కలు షితం అవుతున్నాయి. అయినా ప్లాస్టిక్‌ ఉత్పత్తి పెరుగుతున్నది. సంవత్సరానికి 40 కోట్ల టన్నులకు చేరుకుందని అంచనా. ఈ ఉత్పత్తిని అరికట్టడానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టకుంటే 2040లోపే ఇది రెట్టింపు అవుతుందని అంచనా.

ప్లాస్టిక్‌ కాలుష్య సమస్య భౌగోళికంగా ఏదో ఒక దేశానికి పరిమిత మైనది కాదు. నదులు, మహాసముద్రాల ద్వారా, గాలి ద్వారా, వివిధ సరఫరా గొలుసు వ్యవస్థల ద్వారా, ఎగుమతులు, దిగుమతుల ద్వారా ఈ కాలుష్యం ఎల్లలు దాటుతున్నది. ముఖ్యంగా మైక్రో, నానోప్లాస్టి క్‌ల విషయంలో ఇది కచ్చితం! మొత్తం సముద్ర వ్యర్థాలలో ప్లాస్టిక్‌ 85 శాతం ఉందని అంచనా. ఈ వ్యర్థాలు సముద్ర జలచరాలకు ప్రాణ సంకటంగా మారాయి. జీవాల మనుగడ, సుస్థిర పునరుత్పత్తి సమస్యగా మారింది. సముద్రంలో చేరడం కాకుండా, 46 శాతం ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూమి మీద గుట్టలుగా మిగులుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్‌ వ్యర్థాల్లో 17 శాతం కాల్చేస్తున్నారు. కేవలం 15 శాతం పునర్వినియోగం అవుతోంది. ఈ రెండు ప్రక్రియల ద్వారానూ గాలి కాలుష్యం అవుతున్నది. ప్లాస్టిక్‌ ఉపయోగం క్రమంగా తగ్గించుకోవడమే సుస్థిర మార్గం. దీర్ఘకాలిక పరిష్కారం అంటే ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ పదార్థాలను వాడటం. 

మైక్రో ప్లాస్టిక్‌ ఇంకా తీవ్ర సమస్య
ప్లాస్టిక్‌ వ్యర్థాలు భూమిలో కలిసిపోవడానికి వందల ఏండ్లు పడుతుందని మనందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా గమనించిన విషయం ఆందోళన కలిగిస్తున్నది. ఈ వ్యర్థాలు ఎండకు, వానకు, గాలికి, సముద్రంలో ఉప్పు నీటికి పగిలిపోతూ, చిన్న సూక్ష్మ పరి మాణంలోకి మారి, కంటికి కనపడని కణాలుగా, ఫైబర్‌గా మారు తున్నాయి.  ఈ మైక్రో ప్లాస్టిక్‌... కణాలుగా, ఫైబర్‌ (నూలు)గా తాగే నీటిలో, జలచరాల శరీరాలలో చేరి, తరువాత క్రమంగా మనుష్యు లలో చేరుతున్నది. ప్లాస్టిక్‌ ఉత్పత్తిలో మైక్రో ప్లాస్టిక్‌ ఉత్పత్తి కూడా ఉన్నది. పెళ్లిళ్లలో ఒకరి మీద ఒకరు పోసుకునే చమ్కీలు, పుట్టిన రోజు కేకు కట్‌ చేసేటప్పుడు వాడుతున్న ప్లాస్టిక్‌ గోలీలు మైక్రో ప్లాస్టిక్‌ ఉత్పత్తులే. ఒకసారి వాడి పారేసే (సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌తో పాటు, అసలు అవసరం లేని (జీరో యూజ్‌) ప్లాస్టిక్‌ కూడా ఉత్పత్తి అవు తున్నది. అరటి పండు తొక్క తీసేసి ప్లాస్టిక్‌ కవర్‌ ప్యాక్‌ చేయడం, కొబ్బరి బోండాం ప్లాస్టిక్‌ కవర్లో పెట్టి అమ్మడం, పళ్లను ‘ఫోమ్‌’తో చేసిన తొడుగుల మీద పెట్టడం వంటివి అనవసర ప్లాస్టిక్‌ వినియోగంలోకి వస్తాయి.

ప్యాకేజింగ్‌ పరిశ్రమ పూర్తిగా ప్లాస్టిక్‌ మీద ఆధారపడి, అనవసర వినియోగాన్ని ప్రజల మీద రుద్దుతున్నది. ఇటువంటి అనవ సర ప్లాస్టిక్‌ వినియోగం మీద ప్రభుత్వ నియంత్రణ అవసరం. మన జీవన శైలి వల్ల కూడా ప్లాస్టిక్‌ వినియోగం పెరుగుతున్నది.  ప్లాస్టిక్‌ బాధ పోవాలంటే ఉత్పత్తి తగ్గడంతో పాటు దాని వినియోగం తగ్గాలి. అన్నింటికీ ప్లాస్టిక్‌ వాడే బదులు అవసరమైన వాటికే వాడితే వ్యర్థాలు తగ్గుతాయి. ప్రతి మనిషీ తన ప్లాస్టిక్‌ వినియోగం మీద దృష్టి పెట్టి, ప్రణాళిక ప్రకారం చేస్తే, వినియోగం తగ్గించవచ్చు. ప్రతి ఇంటిలో స్వల్ప మార్పులతో, భారీ త్యాగాలు చేయకుండా ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించవచ్చు. అపార్ట్‌మెంట్‌ సంస్కృతి వల్ల కూడా ప్లాస్టిక్‌ వినియోగం ఎక్కువ అవుతున్నది. ప్రతి బహుళ అంతస్థుల నివాస సముదాయాలలో, గేటెడ్‌ కమ్యునిటీలలో ప్లాస్టిక్‌ ఆడిట్‌ చేసుకుని, పునర్వినియోగ పద్ధతులు అవలంబిస్తే ప్లాస్టిక్‌ డిమాండ్‌ తగ్గుతుంది. ప్రభుత్వం కూడా ప్రజా రవాణా వ్యవస్థను విస్తృత పరిస్తే ప్రైవేటు కార్ల వినియోగం తగ్గుతుంది. కార్లు తగ్గాయంటే, ఆ మేరకు విని యోగం ఉండదు. మనం ప్లాస్టిక్‌ వాడకున్నా ప్లాస్టిక్‌ భూతం స్పష్టమైన ప్రభావం చూపుతుంది. కర్బన ఉద్గారాల వల్ల భూతాపం పెరుగు తున్నట్లు, ప్లాస్టిక్‌ ఎవరో ఎక్కడో వాడినా దాని దుష్ప్రభావం వారితో పాటు మనం కూడా ఎదుర్కోవచ్చు.

ఎవరి బాధ్యత ఎంత?
2022 ఫిబ్రవరిలో ఐక్యరాజ్యసమితి ‘పర్యావరణ అసెంబ్లీ’ ప్లాస్టిక్‌ కాలుష్యంపై అంతర్జాతీయ, చట్టబద్ధమైన ఒడంబడిక అభివృద్ధి చేయ డానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ నెగోషియేషన్‌’ కమిటీ (ఐఎన్‌సీ) ద్వారా, ఈ ఒప్పందం 2024 చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. మొత్తం ప్లాస్టిక్‌ జీవిత చక్రంపై దృష్టి సారించి, సుస్థిరమైన ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఒక సమగ్ర విధానాన్ని ఈ ఒప్పందం ద్వారా సాధించవచ్చని ఆశిస్తు న్నారు. వనరుల సామర్థ్యం పెంచడం ద్వారా ప్లాస్టిక్‌ వ్యర్థాల సమ స్యను పరిమాణ పరంగా తగ్గిస్తూ చక్రాకార ఆర్థిక వ్యవస్థ వంటి పరిష్కరాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు.

2022 డిసెంబర్లో ‘ఐఎన్‌సీ–1’ మొదటి సమావేశాల్లో చర్చలు జరిగాయి. ఒకసారి వాడి పడేసే (సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ను నిషేధించడం, ఉత్పత్తి మీద ఆంక్షలు విధించడం, మెరుగైన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలకు సంబంధించిన విధానాల కూర్పు పైన దృష్టి సారించారు. వివిధ వ్యక్తులు, వర్గాలకు సంబంధించి ఎవరికి ఎంత బాధ్యత ఉంటుంది అనే ప్రశ్నలపై కూడా దృష్టి పెట్టారు. ఉత్పత్తిదారుల మీద కూడా బాధ్యత ఉంది. అదనంగా వ్యర్థాల నిర్వహణలో సాధించాల్సిన మార్పులో సామాజిక న్యాయ కోణం కూడా చర్చించారు. వ్యర్థాల నిర్వహణ మీద ఆధారపడిన జీవనోపాధులకు నష్టం వాటిల్లకుండా చేపట్టవలసిన చర్యలు ఆలోచిస్తున్నారు. ఇక్కడ కొంత సున్నితత్వం అవసరం అని భావిస్తున్నారు. పారదర్శక పర్యవేక్షణ యంత్రాంగాల అవసరం, పర్యావరణానికి హాని కలిగించని ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ వంటివి ఈ ఒప్పందంలోని కీలక అంశాలు కానున్నాయి. ప్రపంచ ప్లాస్టిక్‌ ఒప్పందం, కాలుష్యం తగ్గించే చర్యల అమలుకు తీసుకునే నిర్ణ యాలు, చేపట్టే ప్రక్రియలలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యం. ప్రజలు పాల్గొనే విధంగా ఒప్పంద ప్రక్రియలను రూపొందించడం అవసరం.

ఈ ఒప్పందం తయారీలో, అన్ని దేశాలు ఆమోదించే దశలలో ఎదు రయ్యే సవాళ్లు, తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రజలలో అవగాహన పెరగాలని ఈ ఒప్పందం మీద ఆశ పెట్టుకున్నవాళ్ళు భావిస్తున్నారు. ప్లాస్టిక్‌ మీద ఈ ఒప్పందాన్ని ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి ప్రక్రియలతో అనుసంధానించేలా ముడిపెడితే బాగుంటుంది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి శిలాజ ఇంధనాలను తగ్గిస్తూ, ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం పెంచే క్రమంలో ప్లాస్టిక్‌ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. ప్లాస్టిక్‌ ఉత్పత్తి ముడి చమురు శుద్ధి నుంచి వస్తుంది కనుక. ముడి చమురు విని యోగం తగ్గితే ప్లాస్టిక్‌ వినియోగం తగ్గవచ్చు. ప్రత్యామ్నాయ ఇంధ నాలతో పాటు ప్లాస్టిక్‌కు కూడా  ప్రత్యామ్నాయం తేవాలి. అయితే ఇదంత సులువు కాదు. కాగా, మనుషులు ధరించే దుస్తులలో పత్తి, పట్టు, ఉన్ని వంటి సహజమైనవి ప్రోత్సహిస్తే, వేల టన్నుల పాలిస్టర్‌ వస్త్ర వ్యర్థాలు తగ్గుతాయి. ఎక్కడ వీలైతే అక్కడ ప్లాస్టిక్‌ ప్రత్యామ్నాయ వస్తువులకు ప్రభుత్వం పెట్టుబడులు పెంచి, తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. భారతదేశంలో చేనేత రంగానికి ఊతం ఇస్తే ప్లాస్టిక్‌ తగ్గించవచ్చు. కాలుష్యం తగ్గుతుంది, ఉపాధి పెరుగుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థ లాభపడుతుంది. 


దొంతి నరసింహా రెడ్డి ,వ్యాసకర్త విధాన విశ్లేషకులు ‘ 90102 05742
(ప్లాస్టిక్‌ కాలుష్య నియంత్రణ కోసం ఐరాస ‘ఐఎన్‌సీ’ రెండో సమావేశాలు మే 29 నుంచి జూన్‌ 2 వరకు ఫ్రాన్స్‌లో జరగనున్నాయి.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement