సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారా, లేదా ? నిషేధిస్తే ఏ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు ? ఎందుకు ? అసలు ప్లాస్టిక్‌లు ఎన్ని రకాలు, వాటిని ఎలా తయారు చేస్తారు ? అన్న విషయాల్లో ప్రజల్లో గందరగోళం నెలకొని ఉంది. దేశంలో ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్‌ను జాతిపతి మహాత్మా గాంధీ 150 జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నిషేధించానుకున్నారు. అధికారుల సూచనల మేరకు ఆయన తన నిర్ణయాన్ని తుది దశలో వాయిదా వేసుకున్నారు. అయితే ప్రజల్లో చైతన్యం తీసుకరావడానికి ఒక్కసారి మాత్రమే ఉపయోగించి పారేసే ప్లాస్టిక్‌ను వినియోగంచరాదంటూ ప్రచారం చేస్తున్నారు.
2020 సంవత్సరలో నిషేధ ఉత్తర్వులు వెలువడుతాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు సూచన›ప్రాయంగా చెబుతున్నారు. మరి రెండేళ్లు జాప్యం కూడా కావచ్చు. దేశ ఆర్థిక పరిస్థితి అంతగా బాగా లేదని, ఈ సమయంలో ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తే దేశంలోని అనేక చిన్న పరిశ్రమలు దెబ్బతింటాయని, ప్లాస్టిక్ బ్యాగ్స్, కప్పులు, ప్లేట్లు, స్ట్రాలు, వాటర్ బాటిళ్లు, పెప్ సోడాలను ఉపయోగించే చిన్న చిన్న హోటళ్లపైనా భారం పడుతుందని, తద్వారా నిరుద్యోగ సమస్య పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించడంతో మోదీ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది.
దేశంలో ఏటా 30 కోట్ల టన్నుల ఉత్పత్తి
దేశంలో ఏటా దాదాపు 30 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో 50 శాతం మాత్రమే రీసైక్లింగ్‌కు పనికొచ్చేది. అంటే 50 శాతం ప్లాస్టిక్‌ను ఒక్కసారి ఉపయోగించి పడేయాల్సిందే. ప్రçపంచ వ్యాప్తంగా రీసైక్లింగ్‌కు పనికొచ్చే 50 శాతం ప్లాస్టిక్‌లో కేవలం 10–13 శాతం మాత్రమే రీసైక్లింగ్ జరుగుతోంది. అందుకనే ప్రతి దేశంలో వధా ప్లాస్టిక్ గుట్టలుగా పేరుకుపోతోంది. అవి తిన్న జీవ జాతులు చనిపోతున్నాయి.
ప్లాస్టిక్ ఎప్పుడూ ‘జీవ శైథిల్యం’ చెందదు. కాకపోతే చిన్న చిన్న ముక్కలుగా మారి కాల్వల్లో, నదుల్లో, సముద్రాల్లో కలవడమే కాకాండా భూగర్భ జలాల్లో కూడా కలుస్తోంది. చేపల కడుపుల్లోనే కాకుండా రక్తంలో కూడా ప్లాస్టిక్ ఆనవాళ్లు కనిపించాయని ఆ మధ్య వైద్యులు చెప్పగా, మానవుల రక్తంలో కూడా ప్లాస్టిక్ కణాలు చేరాయని ఇటీవల లండన్ వైద్యులు ధ్రువీకరించారు. ప్లాస్టిక్ కణాలు శరీరంలోని వివిధ అంతర్గత అవయవాలకు చేరుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ప్లాస్టిక్ కణాల వల్ల మనుషుల్లో ‘ఎండోక్రైన్’ వ్యవస్థ దెబ్బతిని క్యాన్సర్లు, సంతాన వైఫల్యాలు కలగడమే కాకుండా పుట్టుకతో వచ్చే అవలక్షణాలు, చెముడు సంక్రమించే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ అంటే ఏమిటీ ?
వివిధ రకాల వస్తువులు, ఆహార పదార్థాల ప్యాకేజీకి ఉపయోగించే దళసరి ప్లాస్టిక్‌తోపాటు ప్లాస్టిక్ బ్యాగ్‌లు, కప్పులు, ప్లేట్లు, స్ట్రాలు, కాఫీ కలుపుకునే పుల్లలు, వాటర్ బాటిళ్లు, పెప్ సోడా బాటిళ్లు అన్ని కూడా ఒకసారి ఉపయోగించి రీసైకిలింగ్‌కు పనికిరాని ప్ల్రాస్టిక్ వస్తువులే (కొన్ని రకాల ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు రీసైక్లింగ్‌కు పనికొస్తాయి). శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ ప్లాస్టిక్‌ను కరిగిస్తే.. ద్రవరూపానికి మారదు. ఇవన్నీ కూడా పెట్రోలియం ద్వారా తయారవుతాయి కనుక ‘జీవ శైథిల్యం’ చెందవు. అంటే బ్యాక్టీరియా, క్రిమికీటాదులు తినేయడం వల్ల అంతరించిపోవడం.
ప్లాస్టిక్ మూడు రకాలు
పెట్రోలియంతో తయారయ్యే ప్లాస్టిక్. వీటిలో పొలిథిలిన్, పోలిప్రాపిలిన్, పోలిస్టర్, పొలిస్టరిన్, నైలాన్, ఆక్రిలిక్ రకాలు ఉన్నాయి. ఇవేవీ ‘బయో డీగ్రేడబుల్’ కావు. మొక్కలతో తయారయ్యేవి రెండోరకపు ప్లాస్టిక్. చెరకు గడలు, మొక్కజొన్న గింజలు, బంగాళ దుంపలు, మరొకొన్ని రకాల మొక్కలతో తయారు చేస్తారు. మూడో రకం బయోప్లాస్టిక్. ప్రధానంగా బ్యాక్టీరీయా, కొన్ని రకాల క్రిములతో తయారు చేస్తారు. ఈ రెండు రకాల ప్లాస్టిక్ ‘బయో డీగ్రేడబుల్’. ఈ రోజుల్లో ఏ వస్తువైన కుళ్లి పోవడం, జీవ శైథిల్యం చెందడం అంత తొందరగా జరిగే ప్రక్రియ కాదు. అందుకు కొన్నేళ్లు పడుతుంది. అటవి సంపద తగ్గిపోవడం, జీవ వైవిధ్యం అంతరించి పోతుండడం కారణం. బయో డీగ్రేడబుల్‌కు కూడా పరిశ్రమలను స్థాపించడమే ప్రత్యామ్నాయ మార్గం.
పెట్రోలియంతో తయారయ్యే ప్లాస్టిక్‌ను ఉపయోగించి క్రూడాయిల్‌ను తయారు చేయవచ్చు. చేస్తున్నారు కూడా. ప్లాస్టిక్ గుట్టలను కరిగించినా వచ్చే ఇంధనం తక్కువే. పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ను అన్ని విధాల రీ స్లిక్లింగ్ చేయడంతోపాటు ఒకేసారి ఉపయోగించే పారేసే ప్లాస్టిక్‌నే కాకుండా పెట్రోలియంతో తయారయ్యే ప్రతి ప్లాస్టిక్‌ను క్రమంగా నిషేధించాల్సిందే. ఇందుకు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరం.
Comments
Please login to add a commentAdd a comment