తారాగై ఆరాధన సముద్రంలో ఈదడానికే పుట్టినట్లుంది. సముద్రంతో మమకారం పెంచుకుంటూ పెరుగుతోంది. సముద్ర జీవులను కాపాడడానికే పని చేస్తోంది. సముద్రంలో చెత్త వేయవద్దని చెప్తోంది. చేపపిల్లలా నీటిలో మునిగి వ్యర్థాల అంతుచూస్తోంది.
తారాగై ఆరాధన స్కూబా డైవింగ్ ఎక్విప్‌మెంట్ ధరించి పడవలో నుంచి సముద్రపు నీటిలోకి దూకిందంటే మరో క్షణంలో కంటికి కనిపించదు. పడవలో నుంచి ముందుకు ఉరికిన దేహం నీటిని తాకడమే ఆలస్యం... బుడుంగున మునక వేస్తుంది. చేపపిల్లలాగ నీటి అడుగుకు చేరుతుంది. పాన్‌పరాగ్ సాషేలు, పాలిథిన్ కవర్లు... అవీ ఇవీ అనే తేడా లేకుండా సముద్రంలో ఉండకూడని వ్యర్థాలన్నింటినీ ఏరి వేస్తుంది. నిజానికి సముద్రానికే ఆ లక్షణం ఉంటుంది. ప్రాణం లేని వస్తువును సముద్రం తన గర్భంలో దాచుకోదు.
తనలో రూపుదిద్దుకున్న ప్రాణులకు ఇబ్బంది కలిగించే ఏ వస్తువునూ నిలవనీయదు. వీలయినంత త్వరగా బయటకు తోసేస్తుంది. అలలతోపాటు నిమిషాల్లో తీరానికి కొట్టుకు వచ్చేస్తుందా వస్తువు. కానీ పలుచటి ప్లాస్టిక్ కవర్లు, చిన్న చిన్న వక్కపొడి కవర్ల వంటివి సముద్రంలో నీటి అడుగున ఇసుకలో కూరుకుపోతుంటాయి. అలాంటి వ్యర్థాలు ఎక్కువైపోతున్నాయి. వాటిని తనంతట తానుగా ప్రక్షాళన చేసుకోవడం సముద్రానికి చేతకావడం లేదు. అలలకు శక్తి చాలడం లేదు.
అందుకే... ఆ పని సముద్రం మీద ప్రేమ ఉన్న మనుషుల బాధ్యత అయింది. అంతటి బృహత్తర బాధ్యతను తలకెత్తుకున్న సాహసి మన తారాగై ఆరాధన. ఈ పాప వయసు ఎనిమిదేళ్లు. ఇప్పటి వరకు ఆమె సముద్ర తీరంలోనూ, సముద్రంలోనూ కూరుకుని పోయి ఉన్న 600 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరిపారేసింది. సముద్రపు అలలతో ఆడుకునే వయసులో ఇంత పెద్ద పర్యావరణహితమైన బాధ్యతను తలకెత్తుకుంది. ఏ పని చేస్తున్నా తన వెంట తండ్రి ఉంటాడని, అందుకే ధైర్యంగా చేసేస్తున్నానని చెప్తోంది ఆరాధన.
నీటిలోనే పెరిగింది
తమిళనాడు రాష్ట్రం, కరప్పగమ్‌లో పుట్టిన ఆరాధనకు సముద్రంతో అనుబంధం ఐదేళ్ల వయసులోనే ఏర్పడింది. ఆరాధన తండ్రి అరవింద్ తరుణ్‌శ్రీ స్కూబా డైవింగ్ ఎక్సపర్ట్ మాత్రమే కాదు, ఇన్‌స్ట్రక్టర్ కూడా. చెన్నై, పాండిచ్చేరిల్లో శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నాడు అరవింద్. తన కూతురిని చిన్న వయసులోనే ఏదైనా సాధించేలా తీర్చిదిద్దాలని అనుకున్నాడు. నవజాత శిశువుకు ఈత నేర్పించడం చాలా సులువు కూడా.
ఆరాధనకు మూడు రోజుల పాపాయిగా ఉన్నప్పుడే నీటిలో తేలడం అలవాటు చేశాడు. తొమ్మిది నెలలకు నీటి తొట్టిలో వదిలితే ఎవరి సహాయమూ లేకుండా సొంతంగా ఈదేది. రెండేళ్లు నిండినప్పటి నుంచి ప్రొఫెషనల్ స్విమ్మర్‌గా తయారైంది. ఐదేళ్ల వయసు నుంచి స్కూబా డైవింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఏడేళ్లు వచ్చేటప్పటికి స్విమ్మింగ్, స్కూబా డైవింగ్‌లో ఆరితేరింది.
తండ్రి నేర్పిన విద్య
అరవింద్ ఇరవై ఏళ్లుగా ఇదే రంగంలో ఉండడం, సముద్ర జలాలకు జరుగుతున్న హానిని కూడా దగ్గరగా చూడడంతో మెరైన్ పొల్యూషన్‌ని అరికట్టాలనే నిర్ణయానికి వచ్చారాయన. ఆరాధనకు స్కూబా డైవింగ్ నేర్పించడంతోపాటు సముద్ర జలాల పరిరక్షణ పట్ల కూడా అవగాహన కల్పించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆరాధన సముద్ర జలాలను ప్రక్షాళన చేయడంతోపాటు సముద్రజలాలు కలుషితమైతే సముద్రంలో నివసించే జీవులకు ఎదురయ్యే ప్రాణహాని గురించి చెబుతోంది.
అంతరించిపోతున్న సముద్ర జీవుల పరిరక్షణ గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇస్తోంది. ఇందుకోసం స్కూళ్లకు వెళ్లి తన వయసు పిల్లలకు తనకంటే పెద్ద పిల్లలకు మెరైన్ కన్జర్వేషన్ గురించి అవగాహన కల్పిస్తోంది. ఇటీవల ఆరాధన ‘సేవ్ ద ఓషన్’ కార్యక్రమంలో భాగంగా ఏకబిగిన పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఈది వరల్డ్ రికార్డు సాధించింది.
‘‘మా నాన్న గడచిన పదిహేడేళ్లుగా పదివేల కిలోల వ్యర్థాలను వెలికి తీశాడు. నేను ఆరువందల కిలోలు తీశాను. ఇలా సాగర ప్రక్షాళన చేయడమే కాదు, ఇకపై ఎవరూ ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలో పారవేయకుండా చైతన్యవంతం చేస్తున్నాం. మా తరం పెద్దయ్యేటప్పటికి సముద్ర పరిరక్షణ కోసం ఇలాంటి పని చేయాల్సిన అవసరం ఉండకూడదు’’ అంటోంది తారాగై ఆరాధన.
చదవండి: సముద్రం నుంచి సముద్రానికి
Comments
Please login to add a commentAdd a comment