విజయ్‌ హజారే ట్రోఫీలో ధోని శిష్యుడి విధ్వంసం | N Jagadeesan Smashes Six Consecutive Fours Off Aman Singh Shekhawat Over During Rajasthan Vs Tamil Nadu Vijay Hazare Trophy Pre Quarterfinal Match | Sakshi
Sakshi News home page

విజయ్‌ హజారే ట్రోఫీలో ధోని శిష్యుడి విధ్వంసం

Published Thu, Jan 9 2025 3:38 PM | Last Updated on Thu, Jan 9 2025 3:43 PM

N Jagadeesan Smashes Six Consecutive Fours Off Aman Singh Shekhawat Over During Rajasthan Vs Tamil Nadu Vijay Hazare Trophy Pre Quarterfinal Match

విజయ్‌ హజారే ట్రోఫీ 2024-25లో దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోని శిష్యుడు, మాజీ సీఎస్‌కే ప్లేయర్‌ ఎన్‌ జగదీశన్‌ (తమిళనాడు) అదరగొట్టాడు. రాజస్థాన్‌తో ఇవాళ (జనవరి 9) జరిగిన రెండో ప్రిలిమినరీ క్వార్టర్‌ ఫైనల్లో జగదీశన్‌ ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు బౌండరీలు బాదాడు. రాజస్థాన్‌ పేసర్‌ అమన్‌ సింగ్‌ షెకావత్‌ బౌలింగ్‌లో జగదీశన్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. 

ఛేదనలో ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన షెకావత్‌.. తొలి బంతిని వైడ్‌గా వేశాడు. ఈ బంతిని వికెట్‌ కీపర్‌ పట్టుకోలేకపోవడంతో బౌండరీకి వెళ్లింది. దీంతో రెండో ఓవర్‌లో బంతి పడకుండానే తమిళనాడు ఖాతాలో ఐదు పరుగులు చేరాయి. అనంతరం షెకావత్‌ వేసిన ఆరు బంతులను ఆరు బౌండరీలుగా మలిచాడు జగదీశన్‌. ఫలితంగా రెండో ఓవర్‌లో తమిళనాడుకు 29 పరుగులు వచ్చాయి. జగదీశన్‌ షెకావత్‌కు సినిమా చూపించిన వీడియో (ఆరు బౌండరీలు) సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

తమిళనాడు వికెట్‌కీపర్‌ కమ్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ అయిన జగదీశన్‌ 2018 నుంచి 2022 వరకు ధోని అండర్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ (277) చేసిన రికార్డు జగదీశన్‌ పేరిటే ఉంది. జగదీశన్‌ను 2023 ఐపీఎల్‌ వేలంలో కేకేఆర్‌ 90 లక్షలకు సొంతం చేసుకుంది. 2024, 2025 ఎడిషన్లలో జగదీశన్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఐపీఎల్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన జగదీశన్‌ 110.20 స్ట్రయిక్‌రేట్‌తో 162 పరుగులు మాత్రమే చేశాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 47.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవరి​ ఐదు వికెట్లు తీసి రాజస్థాన్‌ను దెబ్బకొట్టాడు. సందీప్‌ వారియర్‌ (8.3-1-38-2), సాయి కిషోర్‌ (10-0-49-2), త్రిలోక్‌ నాగ్‌ (6-1-31-1) రాణించారు. రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ అభిజీత్‌ తోమర్‌ (125 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 111 పరుగులు) సెంచరీతో, కెప్టెన్‌ మహిపాల్‌ లోమ్రార్‌ (49 బంతుల్లో 60;3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీతో కదం తొక్కారు. తోమర్‌, లోమ్రార్‌తో పాటు కార్తీక్‌ శర్మ (35), సమర్పిత్‌ జోషి (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు 30 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. తుషార్‌ రహేజా (11), భూపతి కుమార్‌ (0), ఎన్‌ జగదీశన్‌ (65; 10 ఫోర్లు), బాబా ఇంద్రజిత్‌ (37) ఔట్‌ కాగా.. విజయ్‌ శంకర్‌ (18), మొహమ్మద్‌ అలీ (23) క్రీజ్‌లో ఉన్నారు. రాజస్థాన్‌ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌, అనికేత్‌ చౌదరీ, అమన్‌ సింగ్‌ షెకావత్‌, అజయ్‌ సింగ్‌కు తలో వికెట్‌ దక్కింది. ఈ మ్యాచ్‌లో తమిళనాడు నెగ్గాలంటే మరో 104 పరుగులు చేయాలి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement