నాలుగు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్‌ను గత సీజన్ నుంచి దురదృష్టం వెంటాడుంది. 2022 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆ జట్టు.. నాటి నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతీది బెడిసి కొడుతూనే ఉంది. కెప్టెన్ మార్పు దగ్గరి నుంచి ఆ జట్టు తీసుకున్న పలు కీలక నిర్ణయాలు మిస్ ఫైర్ అయ్యాయి.
దీనికి తోడు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటం, ఫామ్‌లో ఉండిన డెవాన్ కాన్వే లాంటి ఆటగాడు వ్యక్తిగత కారణాల చేత పలు కీలక మ్యాచ్‌లకు దూరం కావడం, ఫలితంగా సీజన్‌ను చివరి నుంచి రెండో స్థానంతో ముగించడం.. ఇలా గత సీజన్‌లో ఆ జట్టుకు ఏదీ కలిసిరాలేదు. తాజాగా ఆ ఫ్రాంచైజీ తీసుకున్న మరో నిర్ణయం, జట్టు కెప్టెన్ ధోని సహా యాజమాన్యాన్ని తీవ్ర పశ్చాత్తాపానికి గురి చేస్తుంది. ఓ ఆటగాడిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యామన్న ఓ విషయం ధోని అండ్ కో ను తీవ్ర మనోవేదనకు గురి చేస్తుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు జరిగిన ఆటగాళ్ల రిలీజ్ ప్రక్రియలో సీఎస్‌కే జట్టు మొత్తం 8 మంది ఆటగాళ్లను వదులుకుంది. అందులో ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్స్‌లో మార్మోగిపోతున్న నారాయణ్ జగదీశన్ పేరు ఉండటమే సీఎస్‌కే మనోవేదనకు, పశ్చాత్తాపానికి ప్రధాన కారణం.
ఎందుకంటే.. ప్రస్తుతం జరుగుతున్న భారత దేశవాలీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ-2022 సీజన్‌లో జగదీశన్ శతకాల మోత మోగిస్తున్నాడు. ఇప్పటికే వరుసగా 5 శతకాలు బాది పూనకం వచ్చిన ఆటగాడిలా ఊగిపోతున్నాడు. ఇవాళ (నవంబర్ 21) అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే అతను ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
ఏకంగా డబుల్ సెంచరీ సాధించి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 141 బంతులను ఎదుర్కొన్న జగదీశన్.. 25 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో రికార్డు స్థాయిలో 277 పరుగులు చేశాడు. జగదీశన్ పరుగుల ప్రవాహంలో పలు ప్రపంచ రికార్డులు కొట్టుకుపోయాయి. ప్రపంచ లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడికి సాధ్యం కాని రీతిలో వరుసగా 5 శతకాలు బాది (114 నాటౌట్, 107, 168, 128, 277) చరిత్ర సృష్టించాడు.
ఈ చిచ్చరపిడుగు జగదీశన్‌నే సీఎస్‌కే జట్టు కొద్ది రోజుల ముందు.. ఈ ఆటగాడు మాకొద్దు బాబోయ్ అని వదులుకుంది. బహుశా ఈ అవమానమే అతనిలో కసి రగిల్చి క్రికెట్ ప్రపంచం మొత్తం చర్చించుకునేలా చేసి ఉండవచ్చు. సీఎస్‌కే జట్టు 2022 సీజన్‌కు ముందు జగదీశన్‌ను బేస్ ప్రైజ్ 20 లక్షలకు సొంతం చేసుకుంది.
స్థానిక ఆటగాడు (తమిళనాడు) కావడం, దేశవాలీ టోర్నీల్లో రాణిస్తుండటంతో చెన్నై ఫ్రాంచైజీ అతన్ని ఈ సీజన్‌ను ముందు జరిగిన మెగా వేలంలో సొంతం చేసుకుంది. వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అయిన జగదీశన్.. 2018లోనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ (సీఎస్‌కే) ఇచ్చినప్పటికీ.. అతను అరంగేట్రం చేసింది మాత్రం 2020 సీజన్‌లో. జగదీశన్ తన ఐపీఎల్ కెరీర్‌లో కేవలం 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 110.61 స్ట్రయిక్ రేట్‌తో 73 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోర్ 39 నాటౌట్‌గా ఉంది.
ఇదిలా ఉంటే, జగదీశన్ తన తాజా ఫామ్‌తో మొత్తం ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ తనవైపు చూసేలా చేసుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో అతని గణాంకాలు చూసి సీఎస్‌కే సహా అన్ని జట్టు అతని కోసం క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి. గత సీజన్‌లో కేవలం 20 లక్షలకు అమ్ముడుపోయిన అతను వచ్చే నెలలో జరిగే మినీవేలంలో కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment