ప్రతికాత్మక చిత్రం
సమస్త జీవన రంగాలనూ ఇప్పటికే చుట్టుముట్టిన ప్లాస్టిక్ వ్యర్థాలు మున్ముందు మరింత ముప్పుగా పరిణమించబోతున్నాయని పర్యావరణ మంత్రిత్వ శాఖ నివేదిక చేస్తున్న హెచ్చరిక అందరి కళ్లూ తెరిపించాలి. ఈ బెడద నుంచి బయటపడాలన్న ప్రయత్నాలు నత్తనడకనే ఉండటం ఆందోళన కలి గిస్తోంది. దేశంలో ఏటా 33 లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పుట్టుకొస్తున్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) ఎన్నడో అంచనా వేసింది.
అయిదేళ్లలో ఇది రెట్టింపుకన్నా ఎక్కువైందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. సగటున ఏడాదికి 21.8 శాతం వ్యర్థాలు కొత్తగా వచ్చిపడుతున్నాయి. ఇందుకు ఆధునిక జీవనశైలిని, ప్రభుత్వాల నిర్లిప్త ధోరణిని ప్రధానంగా తప్పుబట్టాలి. ఏడాదిన్నరగా పట్టి కుదుపుతున్న కోవిడ్ మహమ్మారి కూడా ఈ వ్యర్థాల పెరుగుదలకు కారణమే. అయినా కదలికేది? ప్లాస్టిక్ వ్యర్థాల్లో 66 శాతం వాటా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బెంగాల్, తమిళనాడులదే. ఆ రాష్ట్రాలు అమలు చేసే చర్యలు, వాటి లోటుపాట్లు సమీక్షించి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తగిన సలహాలివ్వాలి. ఆ పని చురుకందుకోవాలి. ఇతర వ్యర్థాలతో పోలిస్తే దీన్ని వదుల్చుకోవడం అంత సులభం కాదు.
ప్లాస్టిక్ వాడకం సదుపాయంగా ఉంటుందని చాలామంది చూస్తారు తప్ప, వాడి పడేశాక ఆ వ్యర్థాలు ఏమవుతాయన్న స్పృహ ఉండదు. పునర్వినియోగ ప్రక్రియతో అవి కొత్త రూపు సంతరించుకోవడం అంతంత మాత్రమే. దాని వాటా కేవలం 9 శాతం మాత్రమే. మిగతాదంతా నేలపై, డ్రైనేజీల్లో, నదులు, సముద్ర జలాల్లో చేరుతుంది. అవగాహన కొరవడి 12 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను తగలబెడుతున్నారు. అది మరింత ముప్పుగా మారుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతోపాటు పశుపక్ష్యాదులకు సైతం ప్రాణాంతకంగా పరిణమిస్తాయని, వందల ఏళ్లపాటు పర్యావరణాన్ని దెబ్బతీస్తాయనే చైతన్యం జనంలో కొరవడుతోంది. ఒకసారికి మాత్రమే వినియోగపడే ప్లాస్టిక్‌ను క్రమేపీ నిషేధించాలని మన దేశం చాన్నాళ్లక్రితమే అనుకుంది. అందుకు సంబంధించిన నిబంధనలు సైతం 2016లో ఖరారయ్యాయి. మరో రెండేళ్లకు పూర్తి స్థాయి నిషేధం దిశగా చర్యలుండాలని కూడా సంకల్పించుకున్నారు. కానీ ఆచరణ అంత మెరుగ్గా లేదు. వచ్చే ఏడాది జూలైకల్లా ఒకసారి వాడే ప్లాస్టిక్‌ను నిషేధించాలనుకుంటున్నట్టు 3 నెలల క్రితం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్లాస్టిక్ అనగానే అందరికీ ప్లాస్టిక్ సీసాలు, డబ్బాలు వంటివి ఎక్కువగా గుర్తుకొస్తాయి. కానీ 320 మైక్రాన్‌ల నుంచి 50 మైక్రాన్‌లకన్నా తక్కువుండే ప్లాస్టిక్ సంచులవరకూ అన్నీ పర్యావరణాన్ని నాశనం చేసేవే. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా కేంద్ర రసాయనాలు, పెట్రో కెమికల్స్ విభాగం మార్గదర్శకాలను రూపొందించి రాష్ట్రాలకు పంపింది. కానీ వాటిని ఒక్కో రాష్ట్రం ఒక్కోవిధంగా అర్థం చేసుకుని నిబంధనలు తీసుకొచ్చాయి. ఏ రెండు రాష్ట్రాల మధ్యా సారూప్యత లేకుండా నిబంధనలుండటం వల్ల ఉత్పత్తిదారులు సులభంగా తప్పించుకుంటున్నారు. చర్యలు తీసుకునే విషయంలోనూ వివక్ష కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ప్రభుత్వాలు ఎంతసేపూ చిన్న, మధ్యతరహా ఉత్పత్తిదారులపై ప్రతాపం చూపుతాయి తప్ప ప్లాస్టిక్ సీసాలు, ఇతరత్రాు ఉత్పతతుŠుతలు చేసే భారీ సంస్థల జోలికిపోవు. ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్‌ను ప్రపంచంలో అధికంగా ఉత్పత్తి చేసే సంస్థలేమిటో ఆరాతీయగా అందులో 90 శాతం కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయని తేలింది. మనదేశానికి సంబంధించినంతవరకూ గెయిల్, ఇండియన్ ఆయిల్, హల్దియా పెట్రో కెమికల్స్, రిలయన్స్ తదితర సంస్థలు ఆ జాబితాలో ఉన్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల్లో ప్యాకేజింగ్ వాటా 60 శాతం ఉంటుందని లెక్కేస్తున్నారు. కానీ దాన్ని అరికట్టడంపై ఇంతవవరకూ సరైన అవగాహన లేదు. 2016లో రూపొందిన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ ఉత్పత్తిదారు, దిగుమతి చేసుకునే సంస్థ, దాన్ని వినియోగించే సంస్థ ఆ వ్యర్థాల నిర్వహణకు జవాబుదారీతనం వహించాలి.
ఇంతవరకూ అది అమల్లోకి రాలేదు. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ చెత్తలో కలిసిపోయి, నదీజలాల్లోకి చేరి పర్యావరణం కాలుష్యమయం అవుతోంది. వాటిని తిని మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను పునర్వినియోగానికి అనువుగా మార్చుకునే సాంకేతికత అందుబాటులోకొచ్చినా వినియోగించుకునేవారు స్వల్పం. ఆమధ్య భారతీయ వాణిజ్య, పారిశ్రామిక సంస్థల సమాఖ్య వెలువరించిన నివేదిక ప్రకారం దేశంలో కేవలం 7,500 రీసైక్లింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయి. వీటిలో అధికంగా చిన్నతరహా పరిశ్రమలే. మహమ్మారిలా విస్తరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను అదుపు చేయడం వీటివల్ల సాధ్యమేనా? మరింత మెరుగైన సాంకేతికత, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేయడంలో శాస్త్రీయ విధానాల అమలు, బడా సంస్థలు సైతం రీసైక్లింగ్ యూనిట్లు స్థాపించేలా చర్యలు తీసుకోవడం వంటివి చేస్తేగానీ లక్ష్యసాధన నెరవేరదు.
ప్రభుత్వాలు చురుగ్గా కదలకపోతే సమస్య అదుపు తప్పుతుంది. కొన్ని రాష్ట్రాలు ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి రహదార్లు నిర్మించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. వీటికి నిర్మాణ వ్యయం తగ్గడంతోపాటు, మన్నిక కూడా అధికమంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు విరుచుకుపడటానికి, ప్రాణాంతక వ్యాధులు విస్తరించడానికి పర్యావరణ విధ్వంసమే కారణమని పదేపదే రుజువవుతోంది గనుక ఈ సమస్యను ఇంకెంతమాత్రమూ ఉపేక్షించడానికి లేదు. గాలి, నీరు, నేల... ఇలా అన్నిటినీ సర్వనాశనం చేసే ప్లాస్టిక్ వినియోగంపై అందరినీ చైతన్యవంతం చేసే కార్యాచరణ తక్షణావసరం.
Comments
Please login to add a commentAdd a comment