
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో ప్లాస్టిక్ కవర్ల నిషేధం నిస్తేజంగా మారింది. దీని అమలు ఒకడుగు ముందుకు...రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. దాదాపు ఐదారేళ్ల క్రితమే నగరంలో ప్లాస్టిక్ కవర్ల వాడకంపై నిషేధం విధించాలనే ప్రయత్నాలు మొదలైనప్పటికీ... ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి కొరవడింది. కవర్ల నిషేధంపై ప్రజలను చైతన్యం చేసే దిశగా పూర్తిస్థాయిలో కృషి చేయకపోవడం, వీటికి ప్రత్యామ్నాయంగా జూట్, క్లాత్ బ్యాగుల తయారీపై శ్రద్ధ చూపకపోవడం ఇందుకు కారణమవుతోంది. ఫలితంగా ప్లాస్టిక్ కవర్ల దందాయథేచ్ఛగా కొనసాగుతోంది. తిరుపతి టెంపుల్ సిటీలో ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలవుతుండగా... మహానగరంలో కనీసం మోడల్‌గానైనా ఒక్క సర్కిల్/డివిజన్‌లోనైనా నిషేధించలేకపోయారు. అడపాదడపా ఆర్నెళ్లకో, ఏడాదికో ప్లాస్టిక్ కవర్ల నిషేధమంటూ ప్రకటించడం.. ఉత్పత్తిదారులు, విక్రేతలపై దాడులు నిర్వహించి పెనాల్టీలు విధించడంతో మమ అనిపిస్తున్న అధికారులు.. ఆపై అంతా మరిచిపోతున్నారు.
దీంతో తిరిగి ప్లాస్టిక్ కవర్ల వినియోగం పెరిగిపోతోంది. ఐదారేళ్ల క్రితం తొలిసారిగా 40 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ కవర్లపై నిషేధం విధించినప్పుడు ప్రజల్లో అవగాహన పెరిగే సమయానికే నిషేధానికి తూట్లు పొడిచారు. అదే అనుభవం ప్రతిసారీ పునరావృతమవుతోంది. గతేడాది సైతం ప్లాస్టిక్ నిషేధంపై విస్తృత ప్రచారాలతో ప్రజల్లో కొంతమేర అవగాహన రాగానే కార్యక్రమం మళ్లీ అటకెక్కింది. పండ్లు, కూరగాయల వ్యాపారులు మొదలు మాంసం విక్రేతలు, ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులకు సైతం అవగాహన కల్పించే కార్యక్రమాలు ఒక దశకు చేరుకోగానే చరమగీతం పాడారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తామని ప్రతిజ్ఞలు చేసి కొద్దికాలం పకడ్బందీగానే అమలు చేసినా.. ఆ తర్వాత విస్మరించారు. ఒక దశలో మైక్రాన్లతో సంబంధం లేకుండా ప్లాస్టిక్ కవర్లను సంపూర్ణంగా నిషేధించేందుకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ.. ఆ మేరకు స్టాండింగ్ కమిటీలో తీర్మానించి అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆ తర్వాత ఆ అంశాన్ని పట్టించుకోకపోవడంతో కార్యరూపం దాల్చలేదు.
నాలాల్లో 40శాతం...
జీహెచ్‌ఎంసీలో రోజుకు సగటున 5వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా, వాటిలో దాదాపు 400 మెట్రిక్ టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలే. అవి క్రమేపీ పెరుగుతూ ప్రస్తుతం 500 మెట్రిక్ టన్నులకు చేరినట్లు తెలుస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి పెను ముప్పుతో పాటు చెరువులు, నీటి వనరులు కలుషితమవుతున్నాయి. నగరంలో కురిసే భారీ వర్షాలకు నాలాలు, సివరేజీ లైన్లు ప్లాస్టిక్ వ్యర్థాలతో పేరుకుపోయి నీరు రోడ్లపైకి చేరి ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాకాలంలో నాలాలు పొంగి రోడ్లు చెరువులుగా మారడానికి ప్రధాన కారణం నాలాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలేనని వెల్లడైంది. నాలాల్లో 40శాతానికి పైగా ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నట్లు ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. తిరిగి వర్షాకాలం లోపు ఆ వ్యర్థాలను తొలగించడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేసి జరిమానాలు విధిస్తామన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. అధికారులు డిసెంబర్ 18 నుంచి ఏప్రిల్ 23వరకు 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ కవర్ల విక్రేతలు, ఉత్పత్తిదారులపై తనిఖీలు నిర్వహించి రూ.1,16,600 జరిమానాలు విధించారు. 81 కేసులు నమోదు చేశారు.
‘సంపూర్ణం’ సాధ్యమిలా...
జన జీవితంలో నిత్యావసరంగా మారిన ప్లాస్టిక్‌ను నిషేధించడం అంత తేలికేమీ కాదు. అందువల్లే 2022 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తామని గతేడాది పర్యావరణ దినోత్సవం సందర్భంగా అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ సమక్షంలో అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఆలోగా సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించడం, సంపూర్ణ నిషేధానికి ప్రణాళిక రూపొందించాల్సి ఉంది. దశల వారీగానే అమలు సాధ్యమవుతుందని ఆయా నగరాల్లోని ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమాలను పరిశీలిస్తే అవగతమవుతుంది.
♦ తొలుత 50 మైక్రాన్లలోపు విజయవంతమైతే ఆ తర్వాత సంపూర్ణ నిషేధం చేయవచ్చుననే అభిప్రాయాలున్నాయి.
♦ అన్ని స్థాయిల్లో ఆయా వర్గాల ప్రజలకు ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన కల్పించాలి.
♦ బస్తీల్లోని స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ఇంటింటికీ అవగాహన కల్పించడం, వారు ఉపాధి పొందేలా క్లాత్, జూట్ బ్యాగుల తయారీలో శిక్షణనిచ్చి వారి ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ కల్పించాలి. వాటిని వినియోగంలోకి తెస్తూ క్రమేపీ ప్లాస్టిక్ వాడడం మానేలా చేయాలి.
♦ విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా విషయం కుటుంబానికి చేరుతుంది.
♦ ఫంక్షన్‌హాళ్లు, కల్యాణ మండపాలు తదితర ప్రాంతాల్లో వాడే ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, కప్పుల స్థానంలో స్టీల్, పింగాణీ, గాజు రకం వాడేలా చర్యలు తీసుకోవాలి.
♦ సరుకులు, కూరగాయల కోసం జూట్, క్లాత్ బ్యాగులు వాడేలా, మాంసం కోసం టిఫిన్ బాక్సులు వినియోగించేలా చర్యలు చేపట్టాలి.
♦ ప్లాస్టిక్ కవర్ల తయారీ, రవాణా, అమ్మకం, పంపిణీ వంటివి పూర్తిగా ఆగిపోవాలి.
♦ హోల్‌సేలర్, రిటైలర్, ట్రేడర్, హాకర్, సేల్స్‌మెన్‌తో సహా ఎవరూ ప్లాస్టిక్ కవర్లు అమ్మడం గానీ చేస్తే జరిమానాలు విధించాలి. వరుసగా మూడుసార్లు చేస్తే దుకాణాన్ని సీజ్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment