వ్యర్థాలను కిలోల లెక్కన మూటగట్టి పడేస్తారా? | Management of biofuels in Andhra Pradesh is worst | Sakshi
Sakshi News home page

వ్యర్థాలను కిలోల లెక్కన మూటగట్టి పడేస్తారా?

Published Mon, Oct 8 2018 2:56 AM | Last Updated on Mon, Oct 8 2018 2:56 AM

Management of biofuels in Andhra Pradesh is worst - Sakshi

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పేరుకుపోయిన మెడికల్‌ వ్యర్థాలు.

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బయోవ్యర్థాల నిర్వహణ అత్యంత దారుణంగా ఉందని, వ్యర్థాలను వేర్వేరుగా చేసి ఒక క్రమపద్ధతిలో నిర్వీర్యం చేయాల్సిన ప్రభుత్వ ఆస్పత్రులు.. నిబంధనలు పాటించకుండా అన్ని వ్యర్థాలను కిలోల లెక్కన మూటగట్టి పడేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ (ఏజీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు, బయోవ్యర్థాల నిర్వహణపై ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ (ఆడిట్‌) విభాగం సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అత్యంత అధ్వానంగా ఉన్నట్టు తేలింది. బయోవ్యర్థాల నిర్వహణలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కూడా పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నట్టు వెల్లడైంది.

ఆస్పత్రుల్లో అధ్వాన పరిస్థితులు
ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ సర్వే నివేదిక ప్రకారం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణ రూల్స్‌–2016ను ఏమాత్రం అమలు చేయడం లేదు. సూదులు, సిరంజ్‌లు, రోగుల వ్యర్థాలు, ప్లాస్టిక్‌ వేస్ట్, ఆహార వ్యర్థాలు ఇలా దేనికది వేరు చేసి నిర్వీర్యం చేయాలి.

కానీ ఆస్పత్రులు.. అన్నింటినీ ఒకే మూట గట్టి కిలోల లెక్కన పంపిస్తున్నాయి. బయోవ్యర్థాలను తీసుకెళ్లే వారితో ఆస్పత్రి సూపరింటెండెంట్‌లు చేసుకున్న ఒప్పందాలు ఎక్కడా అమలు కావడం లేదు. కొన్ని ఆస్పత్రుల్లో సరైన పారిశుధ్య నిర్వహణ కూడా లేదు. దీనిపై పీసీబీ నోటీసులు ఇచ్చిందని చెబుతున్నా వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు.

ద్రవ వ్యర్థాలనూ పట్టించుకోవడం లేదు
వివిధ ఆస్పత్రుల్లో ద్రవ వ్యర్థాలు (లిక్విడ్‌ వేస్ట్‌)ను కూడా సరిగా నిర్వీర్యం చేయడం లేదు. లేబొరేటరీలు, రోగుల రక్తం, మూత్రం వంటివాటి వ్యర్థాల నిర్వహణ సరిగా లేదు. వీటి నుంచి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉన్నా పట్టించుకోలేదు. ఇలాంటి ద్రవ వ్యర్థాలను ఒక పద్ధతిలో నిర్వీర్యం చేయాల్సి ఉండగా, వీటన్నిటినీ మున్సిపాలిటీ డ్రైనేజీలోకి వదులుతున్నారు. వాస్తవానికి సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ల్లో వీటిని శుద్ధి చేసిన తర్వాత ఆ ద్రవ వ్యర్థాలను వదిలాలి.

కానీ ఏ ఒక్క ఆస్పత్రిలోనూ సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు లేవు. అంతేకాదు బయోమెడికల్‌ వ్యర్థాలకు సంబంధించి ఏ ఆస్పత్రిలోనూ రికార్డులు లేవు. వ్యర్థాల నిల్వ, వాటి రవాణా తదితరాలకు సంబంధించి ఏ ఒక్క ఆధారమూ లేదు. వచ్చినవి వచ్చినట్టు మూటగట్టి బయటకు పంపిస్తున్నట్టు సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో ఆస్పత్రుల్లో ఉన్న అధ్వాన పరిస్థితులు, పీసీబీ వ్యవహారం, ఇంత జరుగుతున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ప్రజారోగ్యంతో చెలగాటమాడటమేనని స్పష్టం చేసింది.


శిక్షణా తరగతుల పేరిట నిధుల దుర్వినియోగం
ఆస్పత్రుల్లో వ్యర్థాల నిర్వహణపై శిక్షణా తరగతులు పేరుతో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) విజయవాడకు చెందిన ఓ సంస్థకు బాధ్యతలు అప్పగించింది. అయితే ఆ సంస్థ తూతూమంత్రంగానే శిక్షణా తరగతులు నిర్వహించింది. ఎలాంటి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించలేదు. పీసీబీ అధికారులు, వ్యర్థాల నిర్వహణ సంస్థ కుమ్మక్కై ఇప్పటికే పలుమార్లు శిక్షణా తరగతుల పేరిట కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగం చేసినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement