రిమ్స్ లో పేరుకుపోయిన చెత్త | bio waste management fails | Sakshi
Sakshi News home page

రిమ్స్ లో పేరుకుపోయిన చెత్త

Published Fri, Aug 30 2013 2:59 AM | Last Updated on Fri, Sep 1 2017 10:14 PM

bio waste management fails

 ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో రోగుల కోసం ఉపయోగించిన బయోవేస్ట్ చెత్త(సెలైన్ బాటిళ్లు, సిరంజీలు, ఆపరేషన్‌కు ఉపయోగించే  వస్తువులు)కు సంబంధించిన జీవవ్యర్థ పదార్థాలు పేరుకుపోతున్నాయి. చెత్తను తరలించే సొసైటీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కంపుకొడుతున్నాయి. చెత్తను సేకరించి దూరప్రాంతాలకు తరలించేందుకు బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సొసైటీ పనిచేయాల్సి ఉంది. 2011 మేలో జీవవ్యర్థ పదార్థాలను తరలించేందుకు ఈ సొసైటీ రిమ్స్‌లో టెండర్ దక్కించుకుంది. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో అప్పటి కలెక్టర్ ఈ టెండర్‌ను ప్రకటించారు. అయితే రెండేళ్లు గడుస్తున్నా సొసైటీ సేవలు నామమాత్రంగా ఉన్నాయి. సదరు కాంట్రాక్టర్ సమావేశాలకే తప్ప రిమ్స్‌లో కనిపించరనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రిమ్స్‌లో జీవవ్యర్థ పదార్థాలు పేరుకుపోయి రోగాలు ప్రబలే అవకాశం ఉంది. ఒక దశలో మిగతా చెత్తను తీసుకెళ్లాల్సిన మున్సిపల్ సిబ్బంది కూడా ఇటు వైపు రావడమే మానేశారు.
 
 నిధులు కాంట్రాక్టర్ పాలు
 ప్రతీరోజు ఆస్పత్రిలోని ఒక్క పడకకు రూ.5 చొప్పున బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సొసైటీ వసూలు చేస్తోంది. రిమ్స్‌లో దాదాపు 400 పడకలు ఉన్నాయి. అంటే రోజు రూ.2 వేలు కాగా, నెలకు రూ.60 వేలు ప్రభుత్వం చెల్లిస్తోంది. 2011 మేలో కాంట్రాక్టు దక్కించుకున్న సొసైటీ ఇప్పటివరకు దాదాపు 27 నెలలుగా చెత్తను తరలించడం లేదు. అంటే నెలకు రూ.60 వేల చొప్పున రూ.16 లక్షలకుపైగా డబ్బులు కాంట్రాక్టర్ జేబుల్లోకి వెళ్లాయి. ఉదయమే సొసైటీ సిబ్బంది ఆస్పత్రికి వచ్చి జీవవ్యర్థ పదార్థాలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇదేమి పట్టనట్టుగా సొసైటీ కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నాడు. రిమ్స్‌లోని పోస్టుమర్టం గది వద్ద, ఆస్పత్రి వెనుక రోడ్డుపై డంపింగ్ యార్డులో జీవవ్యర్థ పదార్థాలు కనిపిస్తున్నాయి. ఆస్పత్రిలోని ప్రతివార్డులో రోగులకు ఇచ్చిన ఇంజక్షన్‌లు, ఆపరేషన్ థియేటర్‌లో ఉపయోగించిన సర్జరీ వస్తువులు జాగ్రత్తగా ఒక బ్యాగులో ఉంచి బయో మెడికల్ సొసైటీ వారు దీనిని డిస్పోస్ చేయాలి. ఈ సొసైటీ వాహనం ద్వారా ఈ జీవవ్యర్థ పదార్థాలు నిజామాబాద్‌లో ఉన్న వారి యూనిట్ కేంద్రానికి తరలించాలి. కానీ, ఇక్కడ సిబ్బంది నిరక్ష్యం కారణంగా, పర్యవేక్షకుల లోపంతో సెలైన్‌లు, ఇంజక్షన్‌లు డంపింగ్ యార్డులో పడేసిన దానిని ఎవ్వరు పట్టించుకోవడం లేదు.
 
 రూ.లక్షలు నష్టపోతున్న రిమ్స్
 రిమ్స్‌లో వాడిన సెలైన్ డబ్బాలు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు ప్రతి నెల టెండర్లు నిర్వహించాల్సి ఉంటుంది. రోజు ఉపయోగించే వాటిని ఒక గదిలో భద్రపరిచి నెలరోజుల తర్వాత కిలోల చొప్పున టెండర్లు నిర్వహించాలి. వైద్య విధాన పరిషత్ సమయంలో టెండర్లు నిర్వహించేవారు. ప్రస్తుతం వీటికి గ్రహణం పట్టింది. ఆస్పత్రిలో వాడుతున్న సెలైన్‌లు, ప్లాస్టిక్ వస్తువులు నిల్వ ఉంచకుండా ఇష్టారీతిన డంపింగ్ యార్డుల్లో పడేయడంతో రిమ్స్ రూ.లక్షలు నష్టపోతోంది.
 దాదాపు రోజు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న రోగులకు సుమారు 1000కిపై సెలైన్‌లు ఉపయోగిస్తారు. ఈ లెక్కన చూస్తే నెలకు 30 వేల వరకు ఖాళీ సెలైన్ బాటిళ్లు జమచేయాలి. వీటికి టెండర్లు నిర్వహించి వచ్చిన ఆదాయంతో ఆస్పత్రి అభివృద్ధి కోసం ఖర్చు చేయాలి. కానీ, రిమ్స్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా టెండర్లు నిర్వహించ లేదు. దీంతో రోజు ఉపయోగిస్తున్న సెలైన్ బాటిళ్లు డంపింగ్ యార్డులో దర్శనమిస్తున్నాయి. సొసైటీ వారు కూడా వీటిని అలాగే వదిలి వేయడంతో రూ.లక్షలు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
 
 రోగాలు ప్రబలే ప్రమాదం
 రిమ్స్‌లో జీవవ్యర్థ పదార్థాలు ఆస్పత్రి వెనుక పడేయడంతో రోగాలు ప్రబలే అవకాశం ఉంది. డంపింగ్ యార్డులో జీవవ్యర్థ పదార్థాలు పడేయంతో పశువులు, పందులు సంచరిస్తున్నాయి. రోగులుకు ఉపయోగించిన సర్జరీ వస్తువులు, రోగులు పడేసిన చెత్త రెండిటిని రోడ్డుపైనే పడేస్తున్నారు. దీంతో రోడ్డు మార్గం ద్వారా వెళ్లే వారికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వర్షకాలంలో సిరంజీలు, ఇతర హానీ చేసే వస్తువులు బురదలో కూరకుపోతున్నాయి. ఇవి కాళ్లకు కుచ్చుకునే ప్రమాదం ఉంది. పందులు సంచరిస్తుండడంతో వాటి వల్ల రోగాలు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. పశువులు రిమ్స్‌లోని డంపింగ్ యార్డులోని వ్యర్థ పదార్థాలు తినడం ద్వారా ప్రాణాలు పోయే అవకాశం ఉంది. దీనికి తోడు దోమలు వృద్ధి చెందడంతో వ్యాధులు వ్యాపించే అవకాశం లేకపోలేదు. వ్యాధి నయం చేసుకోవడం కోసం ఆస్పత్రికి వస్తే ఆస్పత్రిలో ఉన్న అపరిశుభ్రతతో ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని రోగులు భయపడుతున్నారు. అధికారులు స్పందించి ఆస్పత్రిలో పేరుకుపోతున్న చెత్తను తొలగించాలని రోగులు కోరుతున్నారు.
 
 నోటీసులు పంపాం..- డాక్టర్ శశిధర్, రిమ్స్ డెరైక్టర్
 రిమ్స్‌లో రోజు జీవవ్యర్థ పదార్థాలు తీసుకెళ్లడం లేదని మా దృష్టికి వచ్చింది. సదరు కాంట్రాక్టర్‌కు నోటీసులు అందజేశాము. రోజు ఉపయోగించిన సిరంజీలు ఒక బ్యాగులో ఉంచి సొసైటీ వాహనంలో తీసుకెళ్లాల్సి ఉంటుంది. గతంలో బ్యాగుల కొరత ఉందని చెప్పిన కాంట్రాక్టర్ అప్పటి నుంచి వ్యర్థ పదార్థాలు తరలించడం లేదని తెలిసింది. దీనిపై కాంట్రాక్టర్‌ను పిలిపించి హెచ్చరించాం. అయిన మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోంది. త్వరలో ఉన్నత అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement