సాక్షి, సిటీబ్యూరో: ఒకవైపు కరోనా మహమ్మారి మానవాళిని భయకంపితులను చేస్తుండగా.. మరోవైపు వైరస్ బాధితులు వాడి పడేసిన జీవ వ్యర్థాలు సైతం దడ పుట్టిస్తున్నాయి. రోజుకు ఏకంగా సుమారు టన్నుకు పైగానే ఈ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, ప్రాంతాల్లోని 12 ప్రభుత్వ ఆస్పత్రులు, 128 క్వారంటైన్ కేంద్రాలు, 7 నమూనా సేకరణ కేంద్రాలు, 10 ల్యాబ్‌ల నుంచి నిత్యం కోవిడ్ జీవ వ్యర్థాలను సేకరిస్తున్నారు. వీటిని రాష్ట్రంలోని 11 కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్‌మెంట్ సెంటర్లకు తరలించి పర్యావరణానికి హాని కలిగించని రీతిలో విచ్ఛిన్నం చేస్తున్నారు. ఈ వ్యర్థాలను సేకరించేందుకు సుమారు 55 ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయడం గమనార్హం. మార్చి 29 నుంచి ఏప్రిల్ 29 వరకు సుమారు 30 టన్నుల వ్యర్థాలను సేకరించి ఆయా కేంద్రాలకు తరలించినట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. ఇందులో అత్యధికంగా గాంధీ ఆస్పత్రి నుంచి 15 టన్నుల జీవ వ్యర్థాలను సేకరించినట్లు స్పష్టం చేశాయి.(కాల్చేస్తే ఖతం.. కుళ్లిపోతే విషం!)
కోవిడ్ వ్యర్థాలివే...
కోవిడ్ సోకిన రోగులకు ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో వాడిన మాస్క్‌లు, గ్లౌస్‌లు, దుస్తులు, మలమూత్రాలు, సిరంజీలు, కాటన్, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లు, మెడిసిన్స్ కవర్లు తదితరాలను కోవిడ్ వ్యర్థాలుగా పరిగణిస్తున్నారు. వ్యర్థాల పరిమాణం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వీటిని నిర్లక్ష్యంగా ఇతర జీవ వ్యర్థాలతో పాటే పడవేస్తే వ్యాధి విజృంభించే ప్రమాదం పొంచి ఉంది. దీంతో పీసీబీ వర్గాలు, శుద్ధి కేంద్రాల నిర్వాహకులు వీటిని ప్రత్యేక శ్రద్ధతో సేకరించి పలు జాగ్రత్తలు పాటించి శుద్ధి కేంద్రాలకు తరలిస్తుండడం విశేషం.
వ్యర్థాల శుద్ధి ఇలా..
కోవిడ్ సోకిన రోగులతో పాటు వారు వాడి పడేసిన వ్యర్థాలను సైతం అంతే జాగ్రత్తగా శుద్ధి చేస్తున్నారు. ప్రధానంగా జీవ వ్యర్థాలను శుద్ధి చేసే కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్‌మెంట్ కేంద్రాలు మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, నిజామాబాద్, వనపర్తి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, యాదాద్రి జిల్లాల్లో 11 వరకు ఉన్నాయి. 55 ప్రత్యేక వాహనాల ద్వారా ఈ కేంద్రాలకు నిత్యం కోవిడ్ వ్యర్థాలు చేరుతున్నాయి. వీటిని రెండు విడతలుగా ప్రత్యేక యంత్రాల్లో కాల్చి బూడిద చేస్తున్నారు. అనంతరం ఈ బూడిదను దుండిగల్‌లోని హజార్డస్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కేంద్రానికి తరలించి ప్రత్యేక బాక్సుల్లో నిల్వ చేసి పూడ్చివేస్తున్నారు.
శుద్ధి కేంద్రాల్లోని సిబ్బంది బెంబేలు..
కోవిడ్ వ్యర్థాలను శుద్ధి చేస్తున్న 11 కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్‌మెంట్ కేంద్రాల్లో సుమారు 200 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి విధి నిర్వహణలో ఉన్న తమకు సైతం బీమా
తదితర వసతులుకల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment