కోవిడ్‌ నోడల్‌ కేంద్రం: ఫరారైన పాజిటివ్‌ వ్యక్తులు | 4 Men Ran Away From Gandhi Hospital Covid Nodal Center In Hyderabad | Sakshi
Sakshi News home page

ఆచూకి తెలిపిన వారికి బహుమతి..

Published Sat, Aug 29 2020 8:03 AM | Last Updated on Sat, Aug 29 2020 8:19 AM

4 Men Ran Away From Gandhi Hospital Covid Nodal Center In Hyderabad - Sakshi

ఖైదీలు పరారైంది ఈ కిటికీ నుంచే..  

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ప్రిజనర్స్‌ వార్డు నుంచి పరారైన నలుగురు కరోనా పాజిటివ్‌ ఖైదీల కోసం పదహారు ప్రత్యేక పోలీస్‌ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రిజనర్స్‌ వార్డు సెంట్రీ కానిస్టేబుల్‌ అమిత్‌ ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 224 ప్రకారం కస్టడీలో ఉన్న ఖైదీలు తప్పించుకున్న కేసు నమోదు చేశారు. సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, ఎస్కార్ట్, చిలకలగూడ పోలీస్‌తోపాటు ఆయా లోకల్‌ ఠాణాలకు చెందిన మొత్తం 16 బృందాలు ఖైదీల ఆచూకీ కోసం నగరం నలుమూలల జల్లెడ పడుతున్నాయి. కరోనా వైరస్‌ బారిన పడిన నలుగురు ఖైదీలు అబ్దుల్‌ అర్బాజ్, మహ్మద్‌ జావీద్, సోమసుందర్, నర్సయ్యలను జైలు అధికారులు చికిత్స కోసం గాంధీ ఆస్పత్రి ప్రిజనర్స్‌ వార్డులో అడ్మిట్‌ చేయగా, బాత్‌రూం కిటికీ గ్రిల్స్‌ తొలగించి పరారైన సంగతి విదితమే. బాత్‌రూం కిటికీ గ్రిల్స్‌కు బెడ్‌షీట్‌ కట్టి నలుగురు ఒకేసారి లాగడంతో గ్రిల్స్‌ ఊడిపోవడంతో, అదే బెడ్‌షీట్లను తాడుగా మార్చి రెండవ అంతస్థు నుంచి దూకి పారిపోయినట్లు పోలీసులు అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఆస్పత్రి ప్రాంగణంలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఖైదీల పరారీపై పోలీసులకు స్పష్టమైన అవగాహన కుదరకపోవడం గమనార్హం.  

గతేడాది సీన్‌ రిపీట్‌...  
ఆస్పత్రి ప్రిజనర్‌ వార్డు నుంచి ఓ ఖైదీ గతంలో ఇదేవిధంగా తప్పించుకోవడంతో సీన్‌ రిపీట్‌ అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మీగూడకు చెందిన పసుపు విక్కీ (25) చర్లపల్లి జైలులో రిమాండ్‌ఖైదీగా శిక్ష అనుభవిస్తూ అస్వస్థతకు గురికావడంతో 2019 మార్చి 10వ తేదీన గాంధీఆస్పత్రి ప్రిజనర్స్‌ వార్డులో అడ్మిట్‌ చేశారు. చిన్నరంపంతో బాత్‌రూం కిటికీ ఊచలు తొలగించి నీళ్లు పట్టే ప్లాస్టిక్‌ పైప్‌ సహాయంతో కిందికి దూకి, ఆస్పత్రి వెనుక పద్మారావు నగర్‌ వైపుగల చిన్నపాటి గేటు దూకి పరారయ్యాడు. ఇప్పడు కూడా నలుగురు ఖైదీలు అదేవిధంగా పరారీ కావడం గమనార్హం.  జైళ్లశాఖకు చెందిన పోలీసులే ఈ ప్రిజనర్స్‌ వార్డుకు సంబంధించిన భధ్రతను పర్యవేక్షిస్తారు.  

ఖైదీలను పట్టిస్తే బహుమతి 
సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రి ప్రిజనర్స్‌వార్డు నుంచి తప్పించుకున్న నలుగురు ఖైదీల వివరాలను ఫోటోలతో సహా పోలీసులు మీడియాకు వెల్లడించారు. పరారైన ఖైదీలను పట్టించిన, ఆచూకీ, సమాచారం అందించినా తగిన బహుమతి ఇస్తామని, ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. సనత్‌నగర్, బోరబండ, సఫ్థార్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ అబ్ధుల్‌ అర్భాజ్‌ (21) యుటీ నంబర్‌ 7024, బండ్లగూడ, చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్‌ జావీద్‌ (35), యుటీ నంబర్‌ 6624, బోరబండ రాజీవ్‌గాంధీనగర్‌ సైట్‌–3కి చెందిన మంగళి సోమసుందర్‌ (20) కన్వెక్ట్‌ నంబర్‌ 3932, మెదక్‌ జిల్లా కొండపూర్‌ మండలం వేములగుట్ట గ్రామానికి చెందిన పర్వతం నర్సయ్య (41), కన్వెక్ట్‌ నంబర్‌ 3365లు ఈనెల 27వ తేది వేకువజామున గాంధీఆస్పత్రి నుంచి పరారయ్యారని   స్పష్టం చేశారు. మెయిన్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూం ఫోన్‌ నంబర్లు 040–27852333, 9490616690, నార్త్‌జోన్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూం 040–27853599, 9490598982, గోపాలపురం ఏసీపీ 9490616439. చిలకలగూడ సీఐ ఫోన్‌ నంబర్‌ 9490616440లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement