సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గుతోంది. దీంతో కోవిడ్‌కు కేటాయించిన పడకల్లో అత్యధికం ఖాళీగా ఉంటున్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం... ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 79.73 శాతం పడకలు ఖాళీగా ఉన్నాయి. 62 ప్రభుత్వాసుపత్రుల్లో 8,794 పడకలుండగా, వీటిలో 7,241 ఖాళీగా ఉన్నాయి. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో 82.35 శాతం ఖాళీ. అలాగే 227 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 9,694 పడకలు కరోనాకు కేటాయించగా, 7,476 ఖాళీగా ఉన్నాయి. అంటే 77.11 శాతం ఖాళీ. ఇక ప్రభుత్వంలో ఐసోలేషన్ పడకలు 83.53 శాతం, ప్రైవేట్‌లో 83.95 శాతం ఖాళీగా ఉన్నాయి. దీంతో అనేక ఆసుపత్రులు కరోనా ఐసోలేషన్ పడకలను ఎత్తేస్తున్నాయి. సాధారణ చికిత్సలవైపు వాటిని మళ్లిస్తున్నాయి.
ఇళ్లల్లో చికిత్స పొందుతున్నవారు 82.89%
ఒకప్పుడు కరోనా పాజిటివ్ రాగానే ఉరుకులు పరుగుల మీద ఆసుపత్రులకు వచ్చేవారు. ఇప్పుడు కోవిడ్‌పై ప్రజల్లో అవగాహన ఏర్పడింది. లక్షణాలుంటే ఆసుపత్రులకు వచ్చి నిర్దారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. సాధారణ లక్షణాలుంటే ఇళ్లు లేదా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలోని కోవిడ్ కేర్ ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 38,30,503 మంది పరీక్షలు చేయించుకోగా, అందులో 2,22,111 మందికి వైరస్ సోకింది. వీరిలో 1,98,790 మంది కోలుకున్నారు. అంటే కోలుకున్నవారి రేటు 89.5 శాతానికి పెరిగింది. ఇక ఇప్పటివరకు 1,271 మంది చనిపోగా, కరోనా మరణాల రేటు రాష్ట్రంలో 0.57 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 22,050 ఉండగా, అందులో ఇళ్లు లేదా ఇతర సంస్థల ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నవారు 18,279 మంది ఉన్నారు. అంటే 82.89 శాతం మంది ఇళ్లు, సంస్థల ఐసోలేషన్‌లోనే చికిత్స పొందుతున్నారు.
దీంతో ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 1,55,478 (70%) మందికి కరోనా లక్షణాలు లేనేలేవు. మిగిలిన 66,633 (30%) మందికి మాత్రమే లక్షణాలున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనివల్ల కూడా ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య తగ్గిందని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10 లక్షల జనాభాలో 1,02,915 మందికి కరోనా పరీక్షలు చేశారు. కాగా, శనివారం ఒక్కరోజే 41,043 పరీక్షలు చేయగా, 1,436 మందిలో వైరస్ గుర్తించారు. అలాగే ఒక్కరోజులో 2,154 మంది కోలుకోగా, ఆరుగురు చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment