‘గాంధీ’లో మామూలే...
- బెడ్లు లేవని రోగిని బయటకు నెట్టేసిన సిబ్బంది
గాంధీ ఆస్పత్రి: రోగులంటే వారికి చిన్నచూపు.. జాలి, దయ, కరుణ వంటివి అక్కడ మచ్చుకైనా కని పించవు. మంచాలు, సెలైన్‌స్టాండ్స్ లేవనే సాకుతో రోగిని బలవంతంగా బయటకు పంపించారు. బాధితురాల కథనం ప్రకారం...ఉప్పల్ చిలుకానగర్‌కు చెందిన నాగరాజు(30) పక్షవాతంలో బాధపడుతున్నాడు. నిరుపేదలైన తల్లిదండ్రులు నాగరాజును వైద్యం కోసం బుధవారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
మంచాలు లేవని ఆసుపత్రి సిబ్బంది అతడిని గంటల తరబడి వార్డు బయటే నిల్చోబెట్టారు. కొద్దిసేపటి తర్వాత నాగరాజు చేతికి సిరంజీ గుచ్చి.. సెలైన్ బ్యాటిల్‌ను పట్టుకోమని వృద్ధురాలైన అతడి తల్లి లక్షి చేతికిచ్చారు. తనకు నిల్చోడానికే శక్తి చాలడంలేదని, సెలైన్‌బ్యాటిల్‌ను పట్టుకునే పరిస్థితి లేదని చెప్పడంతో, మేము పటుకుని నిల్చోవాలా? అంటూ వైద్య సిబ్బంది అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో స్టాండ్లు కూడా అందుబాటులో లేవంటూ.. నాగరాజు చేతికి పెట్టిన సెలైన్‌ను ఊడపీకి, ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని గద్ధించారు.
చేసేదిలేక తల్లి నడలేవని స్థితిలో ఉన్న తన కొడుకుని తీసుకుని, నానా తంటాలు పడి ఏఎంసీ వార్డు ముందుకు తీసుకొచ్చి బోరుమంది. రోదిస్తున్న ఆమెను మీడియా ప్రతినిధులు ఏం జరిగిందని ఆరా తీయగా... అసలు విషయం చెప్పింది. తాము వైద్యం చేయిస్తామని చెప్పగా, బతికుండగా గాంధీ ఆస్పత్రికి రానని చెప్పి కొడుకుని తీసుకుని ఆటోలో ఇంటికి వెళ్లిపోయింది.