- డయేరియా బాధితులతో నిండిన ఆస్పత్రి
- అదుపులోకి రాని వాంతులు, విరేచనాలు, జ్వరాలు
- స్పందించని అధికారులు
సర్కారు ఆస్పత్రిలో మంచాల్లేవు..!
Published Fri, Jul 29 2016 11:21 PM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM
సిరిసిల్ల : స్థానిక పెద్దాస్పత్రిలో మంచాలు లేవు. వాంతులు, విరేచనాలు, జ్వరాలతో బాధితులు చేరారు. దీంతో మంచాలేక వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు. కార్మిక వాడల్లో డయేరియా ప్రబలింది. ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలోనే వంద మంది చికిత్స పొందుతుండగా.. ప్రై వేటు ఆస్పత్రులు, ఆర్‌ఎంపీ, పీఎంపీ వద్ద వందలాది మంది వైద్యం చేయించుకుంటున్నారు. అసలు వర్షాకాలం.. కొత్త నీరు రావడంతో వాంతులు, విరేచనాలు వ్యాపిస్తున్నాయి.
ఖాళీ చేయమంటున్నారు..
ఈఫొటోలో కనిపిస్తున్న దంపతుల పేర్లు బండి శ్రీనివాస్, సుజాత, వారి కూతురు అమూల్య(8). సిరిసిల్ల శాంతినగర్‌లో కిరాయి ఇంట్లో ఉండే శ్రీనివాస్ అనారోగ్యంతో ప్రభుత్వ ఆస్పత్రిలో నాలుగు రోజుల కింద చేరారు. శ్రీనివాస్ డయింగ్ కార్మికుడు. ఆరోగ్యం ఇంకా మెరుగుకాలేదు. కానీ డాక్టర్లు బెడ్ ఖాళీ చేసి కరీంనగర్ ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక.. ఎలా వెళ్లాలో తెలియక శ్రీనివాస్, సుజాత దంపతులు కన్నీళ్లు పెడుతున్నారు. ఇక్కడి ఆస్పత్రిలో మంచాలు ఖాళీ లేక ఆరోగ్యం మెరుగు పడకపోయినా మంచం ఖాళీ చేయించేందుకు పంపించేస్తున్నారు.
తెల్లవార్లూ ఇదే గోస..
శుక్రవారం తెల్లవారుజామున బీవై నగర్‌కు చెందిన కేశవరాజు లక్ష్మయ్య(50) వాంతులు, విరేచనాలతో బాధపడుతూ సర్కారు ఆస్పత్రికి వచ్చాడు. పెద్దూరు స్పిన్నింగ్ మిల్లులో పని చేసే లక్ష్మయ్య డయేరియా బారిన పడగా.. ఆయన భార్య నిర్మల ఆస్పత్రిలో చేర్చింది. విద్యానగర్‌కు చెందిన షేక్ నయీమ్(30) గురువారం రాత్రి వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. బీవై నగర్‌కు చెందిన తడక దత్తాద్రి(60) సైతం శుక్రవారం తెల్లవారుజామున సర్కారు ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో మంచాలు ఖాళీ లేక బెంచీపై ఉన్నాడు. డయేరియా బాధితులకు గ్లూకోజ్‌లు పెట్టలేక తెల్లవార్లు నిద్రలేకుండా గడిపామని ఆస్పత్రి సిస్టర్ ఒకరు అన్నారు.
కొత్త వారికి జాగేదీ..?
ప్రాంతీయ ఆస్పత్రిలో కొత్తగా వచ్చే డయేరియాపీడితులకు జాగలేకుండా పోయింది. ఓపీ రికార్డుల ప్రకారం రోజూ 50 మంది డయేరియా, జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరుతున్నారు. తగ్గే వరకు అడ్మిట్ ఉండడంతో ఆస్పత్రిలో మంచాలు లేవు. మరోవైపు బాధితులు, వారి బంధువులతో కిటకిటలాడుతోంది. డయేరియా, విషజ్వరాలు తీవ్రంగా ఉన్నా నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా డయేరియాను కట్టడి చేసేందుకు మున్సిపల్, వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Advertisement