pationt troubles
-
ఢిల్లీలో ఆగని మృత్యుఘోష
న్యూఢిల్లీ: ఢిల్లీ ఆస్పత్రుల్లో ప్రాణవాయువు నిండుకుంది. దీంతో ఆస్పత్రుల్లో అత్యవసర విభాగాల్లో కృత్రిమ ఆక్సిజన్‌తో చికిత్స పొందుతున్న రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. శుక్రవారం గంగారాం ఆస్పత్రిలో 25 మంది రోగులు ఆక్సిజన్ అందక మరణించిన ఘటన మరవకముందే ఢిల్లీలో శనివారం మరో ఘోరం జరిగింది. ఢిల్లీలోని తమ ఆస్పత్రిలో 20 మంది రోగులు ఆక్సిజన్ సరిపడ పీడనంతో సరఫరా కాకపోవడంతో కన్నుమూశారని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డీకే బలూజా చెప్పారు. శనివారం ఉదయం 11 గంటల సమయానికి మా ఆస్పత్రిలో 200 మంది రోగులున్నారని, కేవలం అరగంటకు సరిపడ ఆక్సిజన్ మాత్రమే తమ వద్ద ఉందని ఆయన వెల్లడించారు. వీరిలో 80 శాతం మంది రోగులకు కృత్రిమ ఆక్సిజన్ అవసరమని, మిగతా వారిని ఐసీయూలో ఉంచామని చెప్పారు. ఇంకా కష్టాల్లోనే గంగారాం ఆస్పత్రి ‘మాకు రోజుకు 11వేల ఘనపు మీటర్ల ఆక్సిజన్ అవసరం. కానీ మా వద్ద కేవలం 200 ఘనపు మీటర్ల ఆక్సిజన్ ఉంది. రోగులు తమ సొంత ఆక్సిజన్ సిలిండర్లతో ఆస్పత్రిలో చేరుతున్నారు. అందరు ఉన్నతాధికారలు, నోడల్ అధికారులను కలిశాం. వందల ఫోన్‌కాల్స్ చేశాం. స్పందన శూన్యం. మరో రెండు గంటల్లో ఆక్సిజన్ అయిపోతుంది’ అని పరిస్థితిని గంగారాం ఆస్పత్రి చైర్పర్సన్ డీఎస్ రాణా వివరించారు. గత ఐదు రోజులుగా ఢిల్లీలోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత అత్యంత తీవ్రమవడంతో కోవిడ్ బాధితుల మరణాలు పెరుగుతున్నాయి. చికిత్స పొందుతున్న రోగులకు ఆక్సిజన్ సాయంచేయండంటూ ఢిల్లీ ఆస్పత్రులు సామాజిక మాధ్యమాల వేదికగా వేడుకుంటున్నాయి. ఏదో విధంగా ఆక్సిజన్ సరఫరాపై చర్యలు తీసుకోండంటూ మహారాజా అగ్రసేన్ ఆస్పత్రి, జైపూర్ గోల్డెన్ ఆస్పత్రి, బాత్రా ఆస్పత్రి, సరోజ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల యాజమాన్యాలు ఢిల్లీ హైకోర్టు తలుపుతట్టాయి. దీంతో ఢిల్లీ హైకోర్టు ఘాటుగా స్పందించింది. ‘ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాను పెంచాలి. లేదంటే ఆక్సిజన్సరఫరాను అడ్డుకునే ఏ వ్యక్తినైనా సరే మేం ఉరితీస్తాం. ఎవరికీ వదిలిపెట్టం’ అని జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేఖల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఢిల్లీకి రోజుకు 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తామని కేంద్రప్రభుత్వ హామీ ఇచ్చింది. కానీ గత కొద్ది రోజులుగా 380 మెట్రిక్ టన్నులఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. శుక్రవారం కేవలం 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందిందని ఢిల్లీ సర్కార్ చెబుతోంది. వాల్వ్ మూసేయడంతో ఇద్దరి మృత్యువాత మహారాష్ట్రలోని బీడ్ జిల్లా సివిల్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. రోగులకు ఆక్సిజన్‌ను పంపిణీ చేసే వాల్వ్‌ను ఎవరో మూసేయడంతో చికిత్స పొందుతున్న ఇద్దరు కోవిడ్ పేషెంట్లు మరణించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వాల్వ్ మూసేసి ఉన్న సమయంలో ఏ రోగీ కృత్రిమ ఆక్సిజన్‌పై లేరని ఆస్పత్రి సిబ్బంది చెబుతుండగా, ఆక్సిజన్ సరఫరా ఒక్కసారిగా ఆగిపోవడంతోనే ఇద్దరూ మరణించారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగనుంది. పంజాబ్‌లో ఆరుగురి మృతి కోవిడ్ బాధితులకు సరిపడ ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. అమృత్‌సర్‌లోని నీలకంఠ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు కోవిడ్ బాధితులు శనివారం ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో మరణించారు. ఆక్సిజన్ కొరతపై సంబంధిత అధికారులకు తెలిపినా ఎవరూ స్పందించలేదని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. అయితే, ఆక్సిజన్ కొరత తీవ్రతను పేర్కొనలేదని, కేవలం సంబంధిత వాట్సప్ గ్రూప్‌లో ఒక చిన్న మెసేజ్ మాత్రమే ఆస్పత్రి యాజమాన్యం పంపిందని రాష్ట్ర వైద్య విద్య మంత్రి చెప్పారు. మృతి ఘటనపై పంజాబ్ సీఎం విచారణకు ఆదేశించారు. -
పీహెచ్సీలో సిబ్బంది కొరత
మొయినాబాద్(చేవెళ్ల) : ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. సరిపడా సిబ్బంది లేకపోగా ఉన్న సిబ్బంది సైతం సమయపాలన పాటించకపోవడంతో ఆస్పత్రికి వచ్చినవారు ఇబ్బందులు పడుతున్నారు. మొయినాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం ఉదయం 8 గంటలకు సుమారు 50 మందికి పైగా చంటిపిల్లల తల్లులు ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే సిబ్బంది ఎవరూ లేకపోవడంతో అక్కడే కూర్చున్నారు. ఉదయం 8 గంటలకే ఆస్పత్రికి రావాల్సిన వైద్య సిబ్బంది తీరిగ్గా 12.30 గంటలకు వచ్చి అప్పడు టీకాలు వేయడం మొదలు పెట్టారు. అప్పటి వరకు చిన్న పిల్లలతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సర్కారు ఆస్పత్రిలో మంచాల్లేవు..!
డయేరియా బాధితులతో నిండిన ఆస్పత్రి అదుపులోకి రాని వాంతులు, విరేచనాలు, జ్వరాలు స్పందించని అధికారులు సిరిసిల్ల : స్థానిక పెద్దాస్పత్రిలో మంచాలు లేవు. వాంతులు, విరేచనాలు, జ్వరాలతో బాధితులు చేరారు. దీంతో మంచాలేక వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు. కార్మిక వాడల్లో డయేరియా ప్రబలింది. ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలోనే వంద మంది చికిత్స పొందుతుండగా.. ప్రై వేటు ఆస్పత్రులు, ఆర్ఎంపీ, పీఎంపీ వద్ద వందలాది మంది వైద్యం చేయించుకుంటున్నారు. అసలు వర్షాకాలం.. కొత్త నీరు రావడంతో వాంతులు, విరేచనాలు వ్యాపిస్తున్నాయి. ఖాళీ చేయమంటున్నారు.. ఈఫొటోలో కనిపిస్తున్న దంపతుల పేర్లు బండి శ్రీనివాస్, సుజాత, వారి కూతురు అమూల్య(8). సిరిసిల్ల శాంతినగర్‌లో కిరాయి ఇంట్లో ఉండే శ్రీనివాస్ అనారోగ్యంతో ప్రభుత్వ ఆస్పత్రిలో నాలుగు రోజుల కింద చేరారు. శ్రీనివాస్ డయింగ్ కార్మికుడు. ఆరోగ్యం ఇంకా మెరుగుకాలేదు. కానీ డాక్టర్లు బెడ్ ఖాళీ చేసి కరీంనగర్ ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వలేక.. ఎలా వెళ్లాలో తెలియక శ్రీనివాస్, సుజాత దంపతులు కన్నీళ్లు పెడుతున్నారు. ఇక్కడి ఆస్పత్రిలో మంచాలు ఖాళీ లేక ఆరోగ్యం మెరుగు పడకపోయినా మంచం ఖాళీ చేయించేందుకు పంపించేస్తున్నారు. తెల్లవార్లూ ఇదే గోస.. శుక్రవారం తెల్లవారుజామున బీవై నగర్‌కు చెందిన కేశవరాజు లక్ష్మయ్య(50) వాంతులు, విరేచనాలతో బాధపడుతూ సర్కారు ఆస్పత్రికి వచ్చాడు. పెద్దూరు స్పిన్నింగ్ మిల్లులో పని చేసే లక్ష్మయ్య డయేరియా బారిన పడగా.. ఆయన భార్య నిర్మల ఆస్పత్రిలో చేర్చింది. విద్యానగర్‌కు చెందిన షేక్ నయీమ్(30) గురువారం రాత్రి వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. బీవై నగర్‌కు చెందిన తడక దత్తాద్రి(60) సైతం శుక్రవారం తెల్లవారుజామున సర్కారు ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో మంచాలు ఖాళీ లేక బెంచీపై ఉన్నాడు. డయేరియా బాధితులకు గ్లూకోజ్‌లు పెట్టలేక తెల్లవార్లు నిద్రలేకుండా గడిపామని ఆస్పత్రి సిస్టర్ ఒకరు అన్నారు. కొత్త వారికి జాగేదీ..? ప్రాంతీయ ఆస్పత్రిలో కొత్తగా వచ్చే డయేరియాపీడితులకు జాగలేకుండా పోయింది. ఓపీ రికార్డుల ప్రకారం రోజూ 50 మంది డయేరియా, జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరుతున్నారు. తగ్గే వరకు అడ్మిట్ ఉండడంతో ఆస్పత్రిలో మంచాలు లేవు. మరోవైపు బాధితులు, వారి బంధువులతో కిటకిటలాడుతోంది. డయేరియా, విషజ్వరాలు తీవ్రంగా ఉన్నా నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా డయేరియాను కట్టడి చేసేందుకు మున్సిపల్, వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.