
గాంధీఆస్పత్రి: కరోనా సెకండ్‌వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో ఐసీయూ పడకలు రోగులతో నిండిపోయాయి. ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రాణాపాయస్థితిలో ఉన్న 722 మంది రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. గాంధీలో మొత్తం 1850 పడకలు ఉండగా 500 ఐసీయూ (వెంటిలేటర్), 1250 ఆక్సిజన్ బెడ్ల కోసం కేటాయించారు.
ఐసీయూ పడకలు రోగులతో నిండిపోవడంతో వెంటిలేటర్ అవసరమైన రోగులు అంబులెన్స్‌ల్లోనే గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి నెలకొంది. అత్యవసర విభాగం వద్ద కరోనా ట్రైయాజ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి రోగుల చిరునామా ఇతర వివరాలను నమోదు చేసి వైద్యపరీక్షల అనంతరం వార్డుల్లోకి తరలిస్తున్నారు. కరోనా మృతుల సంఖ్య అమాంతం పెరగడంతో కోవిడ్ మార్చురీగా మార్చారు. ఇక్కడ సుమారు 150 మృతదేహాలను భద్రపరిచే అవకాశం ఉంది. సాధారణ పోస్టుమార్టంలను నిలిపివేశారు. ప్రమాదాల్లో మృతి చెందినవారిని ఉస్మానియా మార్చురీకి తరలిస్తున్నారు.
ఆక్సిజన్ కొరత లేదు
సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేదు. ఇక్కడ 20 టన్నులు, 6 టన్నుల కెపాసిటీ కలిగిన రెండు లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు ఆక్సిజన్ ట్యాంకులను నింపుతున్నాం. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి బాధితులు చివరి నిమిషంలో గాంధీఆస్పత్రికి రిఫరల్‌పై వస్తున్నారు. గాంధీ వైద్యులు, సిబ్బంది రౌండ్ ది క్లాక్ సేవలు అందిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన సెకండ్‌వేవ్ పట్ల ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి.
– రాజారావు, సూపరింటెండెంట్
( చదవండి: GHMC Sanitation: పేరు గొప్ప.. ఊరు దిబ్బ )