సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉన్న పడకల్లో 50శాతం బెడ్‌లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. జనరల్ వార్డుల్లోని బెడ్‌లతోపాటు ఐసీయూ విభాగాల్లోని 50 శాతం పడకల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోవిడ్–19 బాధితులకు చికిత్స అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలపై ఇప్పటివరకు 1,039 ఫిర్యాదులు వచ్చాయని, వీటిని తీవ్రంగా పరిగణిస్తూ ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్టు వివరించారు. ఇప్పటికైనా ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోకుంటే తాజాగా నిర్దేశించిన కార్యాచరణను అమలు చేస్తామని తేల్చిచెప్పారు. ప్రైవేటు ఆస్పత్రులపై వచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదులను పరిశీలించిన మంత్రి ఈటల.. సంబంధిత అధికారులతో సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
అధిక బిల్లులపైనే ఎక్కువ ఫిర్యాదులు..
ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల్లో ముఖ్యంగా ఎక్కువ బిల్లులు వేయడం, కొన్ని సందర్భాల్లో బిల్లులు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేయడం, రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల అడ్వాన్స్ చెల్లిస్తే తప్ప ఆస్పత్రిలో చేర్చుకోకపోవడం లేదా బెడ్‌లు ఖాళీ లేవని పేషెంట్లను కనీసం పరీక్ష చేయకుండానే తిప్పి పంపుతున్నారనే అంశాలతో ఉన్నాయని ఈటల చెప్పారు. అదేవిధంగా ఇన్సూరెన్స్, క్రెడిట్‌కార్డు అంగీకరించకపోవడం, డబ్బులు చెల్లించినప్పటికీ రోగులను సరిగా పట్టించుకోకపోవడం, చికిత్స జరుగుతున్న క్రమంలో మరణిస్తే పూర్తి బిల్లు చెల్లించే వరకు మృతదేహాన్ని ఇవ్వకపోవడం వంటి ఫిర్యాదులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా లేని వారి దగ్గర కూడా కరోనా ఉందా.. లేదా తెలుసుకోవడానికి పరీక్షల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికమొత్తంలో ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు.
ఇతర జబ్బుల కోసం చికిత్స చేయించుకోవడానికి హాస్పిటల్‌కు వచ్చిన వారికి కూడా కరోనా నిర్ధారణ పరీక్షల కోసం కరోనా ప్యాకేజ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. వాస్తవానికి కరోనా నిర్ధారణకు ర్యాపిడ్ పరీక్ష లేదా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకోవడానికి ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతులు ఉన్నాయని.. కానీ వీటిని పక్కనపెట్టి సీటీ స్కాన్, ఎక్స్‌రే, రక్త పరీక్షల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రక్త పరీక్ష ల్లో కూడా డీ–డిమ్మ ర్, ఎల్డీహెచ్, సీఆర్పీ, ఫెరిటిన్, ఐఎల్–6 వంటి పరీక్షలను అవసరం లేకున్నా చేస్తున్నారన్నారు. హైదరాబా ద్‌లోని దాదాపు అన్ని ఆస్పత్రులపై ఫిర్యాదులు అందడంతో ప్రతి ఆస్పత్రికీ షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరినట్లు మంత్రి తెలిపారు. ఈ వివరణలను పరిశీలించడానికి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ వివరణలపై విచారణ చేసి తప్పులు చేసిన ఆస్పత్రులపై ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ కింద కఠిన చర్య లు తీసుకోవాలని మంత్రి సూచించారు.
డాక్టర్ నరేష్ మృతి బాధాకరం: ఈటల
కోవిడ్ చికిత్స అందిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ నరేష్ చనిపోవడం చాలా బాధాకరమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా వైరస్ సోకినవారికి తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టి మరీ వైద్యులు, వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారని.. వారి సేవలు వెల కట్టలేనివని అభిప్రాయపడ్డారు. డాక్టర్ నరేష్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. నరేష్ భార్యకు సముచిత స్థానం గల ఉద్యోగం కల్పించాలని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment