ఖమ్మం, నేలకొండపల్లి: గురుకుల పాఠశాలల్లో రాత్రివేళ కటిక నేలపై అటూఇటూ బొర్లుతూ నిద్రపట్టక అవస్థ పడుతున్న విద్యార్థులు ఇక హాయిగా..మెత్తటి పరుపుల(స్లిమ్‌బెడ్స్)పై పడుకోనున్నారు. చాప లేదా పల్చటి దుప్పటి గచ్చుపై వేసుకొని..ఇంతకాలం కష్టంగా నిద్దరోయిన పిల్లలు ఆ అవస్థకు దూరమై చక్కటి స్లిమ్‌బెడ్లపై పడుకుంటున్నారు. ఈ ఏడాది కొత్తగా ప్రారంభించిన దానవాయిగూడెం, ఎర్రుపాలెం, కూసుమంచి, ముదిగొండ, మధిర, సత్తుపల్లి, తిరుమలాయపాలెం, దానవాయిగూడెం(డిగ్రీ)గురుకులాల్లో మెత్తటి పరుపులను అందజేశారు.
ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న విద్యాలయాలకు తగిన సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో..జిల్లా వ్యాప్తంగా 8విద్యాలయాల్లోని 2,752 మందికి పరుపులు పంపిణీ చేశారు. అద్దె భవనాలు విశాలంగా లేకపోవడం, అందరికీ సరిపడా మంచాలు వేసే వీలు ఉండకపోవడంతో ఒక రకమైన పడక (స్లిమ్‌బెడ్స్)ను రూపొందించి అందజేశారు. అవసరమైనప్పు డు వేసుకుని, తర్వాత మలుచుకుని దా చుకునే విధంగా ఉన్నాయి. నేలపై చాప పరుచుకుని, ఆపైన పరుపు వేసుకుంటే బెడ్(పడక)పై నిద్రపోతున్న భావన కలిగేలా రూపొందించారు.
రూ.15.14 లక్షలతో కొనుగోలు..
రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు పరుపుల కోసం రూ.15.14 లక్షలు ఖర్చు చేసింది. జిల్లాలో 8 గురుకుల పాఠశాలలు నూతనంగా ఏర్పాటు అయ్యాయి. ఒక్క పరుపు ఖరీదు దాదాపు రూ.550 విలువ చేస్తుంది. మొత్తం 2,752 మంది విద్యార్థులకు రూ.15.14 లక్షలతో గురుకులాల సంస్థ హైదరాబాద్‌లో కొనుగోలు చేసి..ఇక్కడికి పంపించింది. విద్యార్థులు రాత్రివేళ ఈ పరుపులపై నిద్రించి, ఉదయం లేచాక ఎంచక్కా మలిచి పెట్టెల్లో భద్ర పరుచుకుంటున్నారు.
కార్పొరేట్ స్థాయిలో అందించాం..
కార్పొరేట్ హాస్టళ్లల్లో మాదిరి..విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు సంస్థ కృషి చేస్తోంది. అందులో భాగంగానే పరుపులు (స్లిమ్‌బెడ్స్)ను అందించాం. గురుకుల విద్యాలయాల బలోపేతానికి గురుకులాల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ ఎంతో శ్రద్ధ పెడుతున్నారు. – పుల్లయ్య, ఆర్‌సీఓ
చాలా సంతోషంగా ఉంది..
మొన్నటి దాకా కింద పడుకున్నాం. ఇప్పుడు పరుపులు వచ్చాక వాటిని వేసుకుని నిద్ర పోతున్నాం. చాలా హాయిగా నిద్ర పడుతోంది. పెట్టెలో దాచుకుంటున్నాం. – వివేక్, గురుకుల విద్యార్థి, ముదిగొండ
ప్రవీణ్‌కుమార్ సార్‌కు థాంక్స్..
గురుకుల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ సార్‌కు రుణపడి ఉంటాం. ఇంట్లో లెక్కనే..మంచిగా పరుపులు అందజేశారు. స్టూడెంట్స్ అంతా హ్యాపీగా ఉన్నారు. – యశ్వంత్, గురుకుల విద్యార్థి, ముదిగొండ
Comments
Please login to add a commentAdd a comment