పోలవరంలో మరో కీలక ఘట్టానికి శ్రీకారం | Pressure Tunnel Work Begins At Polavaram Power Station | Sakshi
Sakshi News home page

పోలవరంలో మరో కీలక ఘట్టానికి శ్రీకారం

Published Sat, Aug 7 2021 9:18 AM | Last Updated on Sat, Aug 7 2021 9:18 AM

Pressure Tunnel Work Begins At Polavaram Power Station - Sakshi

యంత్రంతో టన్నెల్‌ తవ్వకం పనులు నిర్వహిస్తున్న మేఘా సంస్థ ప్రతినిధులు

సాక్షి, అమరావతి/దేవీపట్నం: పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో కీలక ఘట్టానికి రాష్ట్ర ప్రభుత్వం తెర తీసింది. ప్రాజెక్టులో అంతర్భాగమైన 960 మెగా వాట్ల జలవిద్యుత్‌ కేంద్రం పనులను వేగవంతం చేసింది. ఈ కేంద్రంలో అత్యంత కీలకమైన 12 ప్రె జర్‌ టన్నెళ్ల తవ్వకం పనులను శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగుళూరు వద్ద మేఘా సంస్థ ప్రారంభించింది. పోలవరం హె డ్‌ వర్క్స్‌ (జలాశయం) పనులతోపాటు జలవిద్యు త్‌ కేంద్రం పనులను రివర్స్‌ టెండరింగ్‌లో దక్కిం చుకున్న మేఘా సంస్థ.. జలవిద్యుత్‌ కేంద్రం పనులను మార్చి 30న ప్రారంభించింది.

ఈ పనుల్లో ఇప్పటికే 18.90 లక్షల క్యూబిక్‌ మీటర్ల కొండ తవ్వకం పనులను పూర్తిచేసింది. జలవిద్యుత్‌ కేం ద్రం పునాది పనులను జలవనరుల శాఖ అదికారులు పర్యవేక్షిస్తుండగా.. విద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనులను జెన్‌కో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఏటా సగటున మూడు వేల టీఎంసీల మేర గోదావరి జలాలు సముద్రం లో కలుస్తున్నాయి. ఈ వరద నీటిని ఒడిసి పట్టి.. ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు భారీగా వి ద్యుత్‌ ఉత్పత్తి చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలి పేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది.

జలవిద్యుత్‌ కేంద్రం పనితీరు ఇలా..
పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌లో ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌)కు ఎడమ వైపున జలవిద్యుత్‌ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక్కో యూనిట్‌లో 80 మెగావాట్ల చొప్పున 12 యూనిట్లలో 960 మెగాగాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో నీటి మట్టం 35.52 మీటర్ల నుంచి నీటిని ప్రెజర్‌ టన్నెళ్ల ద్వారా పంపిస్తారు. టన్నెళ్లకు దిగువన కెప్లాన్‌ టర్బైన్లను ఏర్పాటుచేస్తారు. అధిక ఒత్తిడితో ఎత్తు నుంచి నీరు పడినప్పుడు వర్టికల్‌ కెప్లాన్‌ టర్బైన్లు వేగంగా తిరగడంవల్ల విద్యుత్‌ ఉత్పత్తవుతంది. ఇందుకోసం 145 మీటర్ల పొడవున 9 మీటర్ల వ్యాసంతో 12 ప్రెజర్‌ టన్నెళ్లను తవ్వే పనులను కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది. ఈ టన్నెళ్లకు చివరన తక్కువ వ్యాసంతో ఇనుప పైపులను తొడిగి.. భూ ఉపరితలానికి ఆరు మీటర్ల దిగువన వర్టికల్‌ కెప్లాన్‌ టర్బైన్లను ఏర్పాటుచేస్తారు.

ప్రెజర్‌ టన్నెళ్ల వైపు నీటిని మళ్లించడానికి వీలుగా 206 మీటర్ల పొడవున 294 మీటర్ల వెడల్పుతో జలాశయం నుంచి అప్రోచ్‌ ఛానల్‌ తవ్వుతారు. దీని ద్వారా ప్రెజర్‌ టన్నెళ్లకు నీటిని విడుదల చేయడం ద్వారా వర్టికల్‌ కెప్లాన్‌ టర్బైన్లను తిరిగేలా చేసి.. విద్యుదుత్పత్తి చేస్తారు. టర్బైన్ల నుంచి దిగువకు వచ్చిన నీటిని టెయిల్‌ రేస్‌ ఛానల్‌ ద్వారా ఈసీఆర్‌ఎఫ్‌కు దిగువన నదిలోకి కలుపుతారు. ఈ వర్టికల్‌ కెప్లాన్‌ టర్బైన్లను భోపాల్‌కు చెందిన బీహెచ్‌ఈఎల్‌ సంస్థ తయారుచేస్తోంది. ఈ విద్యుత్‌ కేం ద్రంలో వినియోగిస్తున్న టర్బైన్లు ఆసియాలోనే అత్యంత పెద్దవి. ప్రెజర్‌ టన్నెల్‌ తవ్వకం పనుల ప్రారంభోత్సవంలో జెన్‌కో ఎస్‌ఈ ఎస్‌. శేషారెడ్డి, ఈఈలు ఎ. సోమయ్య, సి. హనుమ, ఎలక్ట్రికల్‌ ఈ ఈ వై. భీమధనరావు, ఇరిగేషన్‌ ఈఈ పాండురంగారావు, మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ రంగరాజన్, జీఎం ముద్దుకృష్ణ, ఏజిఎం క్రాంతికుమార్, కోఆర్డినేటర్‌ ఠాగూర్‌చంద్‌ పాల్గొన్నారు.

హిమాలయ విద్యుత్‌ కేంద్రాల స్థాయిలో..
హిమాలయ నదుల్లో నీటి లభ్యత అధికంగా ఉండటంవల్ల వాటిపై నిర్మించే జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ అధికంగా ఉత్పత్తవుతుంది. అలాగే, గోదావరి నదిపై ఎగువన మహారాష్ట్రలో జైక్వాడ్‌ డ్యామ్‌ నుంచి దిగువన ఏపీలోని ధవళేశ్వరం బ్యారేజీ వరకూ అతిపెద్ద నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు పోలవరం ఒక్కటే. దీని సామర్థ్యం 194.6 టీఎంసీలు. పోలవరం వద్ద నీటి లభ్యత అధికంగా ఉండటంవల్ల హిమాలయ నదులపై ఉన్న విద్యుత్‌ కేంద్రాలకు దీటుగా పోలవరం విద్యుత్‌ కేంద్రంలోనూ కరెంట్‌ను ఉత్పత్తి చేయవచ్చునని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అంతరాయాలు లేకుండా కారుచౌకగా విద్యుత్‌ సరఫరా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా రాష్ట్రంలో భారీఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారని.. అలాగే ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడడానికి అది దోహదం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ అంచనా.

ఇవీ చదవండి:
ఏపీ: దేశంలోని తొలి ప్రయోగం.. వాట్సాప్‌.. రైతుల హేట్సాఫ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement