‘రివర్స్‌’ సూపర్‌ సక్సెస్‌.. రూ. 782 కోట్లు ఆదా! | Polavaram Reverse Tendering Super Success | Sakshi
Sakshi News home page

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ సూపర్‌ సక్సెస్‌

Published Mon, Sep 23 2019 4:20 PM | Last Updated on Mon, Sep 23 2019 8:04 PM

Polavaram Reverse Tendering Super Success - Sakshi

సాక్షి, అమరావతి:  ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టులో చేపట్టిన ‘రివర్స్‌ టెండరింగ్‌’  సూపర్‌ సక్సెస్‌ అవుతోంది. తాజాగా పోలవరం ప్రధాన డ్యామ్‌ వద్ద మిగిలిన పనులకు సంబంధించి చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌లో ప్రభుత్వ ఖజానాకు  ఏకంగా రూ. 782 కోట్లు ఆదా అయ్యాయి. రూ. 4,987.55 కోట్లు విలువచేసే.. పోలవరం ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలువగా.. 12.6శాతం తక్కువ మొత్తానికే ఈ పనులు చేపట్టేందుకు ‘మేఘ’ సంస్థ ముందుకొచ్చింది. ఈ పనుల కోసం రూ. 4,358.11 కోట్లు కోట్‌ చేస్తూ.. మేఘ సంస్థ బిడ్డింగ్‌ వేసింది. ఈ మేరకు ఆర్థిక బిడ్‌ను ఏపీ ప్రభుత్వం సోమవారం తెరిచింది. దీంతో ఏపీ ఖజానాకు రూ. 628.43 కోట్లు ఆదా కాగా.. గతంలో 4.8శాతం ఎక్సెస్‌ ధరకు తన అస్మదీయులకు చంద్రబాబు సర్కారు ఈ టెండర్లు కట్టబెట్టింది. దీనివల్ల  ఖజానాపై రూ. 154 కోట్ల అదనపు భారం పడింది. ఈ భారాన్ని కూడా కలుపుకుంటే ప్రస్తుతం ఖజానాకు రూ. 782 కోట్లు ఆదా అయినట్టు అయింది. ఇంతకుముందు పోలవరం 65వ ప్యాకేజీ పనులకు సంబంధించి చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌లో రూ.58.53 కోట్లు ఖజానాకు ఆదా అయిన సంగతి తెలిసిందే.

పోలవరం ప్రధాన డ్యాము వద్ద మిగిలిన రూ. 1,771.44 కోట్ల పనుల కోసం, 960 మెగావాట్ల జలవిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రూ. 3,216.11 కోట్ల పనుల కోసం తాజాగా ఏపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ను నిర్వహించింది. ఈ మేరకు పనులను చేపట్టేందుకు మేఘ సంస్థ బిడ్డింగ్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో హైడల్‌ ప్రాజెక్టు పనులను 4.8శాతం అధిక ధరకు నవయుగ సంస్థకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. ఎక్సెస్‌ రేటుకు కట్టబెట్టడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 154 కోట్ల అదనపు భారం పడింది. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవినీతి, అక్రమాలపై నిపుణుల కమిటీ విచారణ జరిపింది. పోలవరం టెండర్లను గత ప్రభుత్వం కావాలనే అధిక మొత్తానికి కటబెట్టినట్టు నిపుణల కమిటీ నిర్ధారించింది. ఒకే సంస్థకు నామినేటెడ్‌ పద్ధతిలో గత చంద్రబాబు సర్కారు పోలవరం పనులను కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని చేపట్టింది. రివర్స్‌ టెండరింగ్‌లో గణనీయమైన రీతిలో ప్రభుత్వ ఖజానాకు భారం తగ్గింది. పోలవరం 65వ ప్యాకేజీ పనుల్లో రూ. 59 కోట్లు ఆదా కాగా.. ప్రస్తుతం ప్రధాన పనుల విషయంలో ఏకంగా రూ. 782 కోట్లు ఆదా అయ్యాయి. 
చదవండి: రివర్స్‌ టెండరింగ్‌: తొలి అడుగులోనే 58.53 కోట్లు ఆదా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement