సాక్షి, పోలవరం: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు మేఘ ఇంజనీరింగ్ సంస్థ శుక్రవారం భూమి పూజ చేసింది. ప్రాజెక్ట్ పనులు ప్రారంభించేందుకు అనుమతినిస్తూ హైకోర్టు ఉత్తరువులు ఇవ్వడంతో మేఘా సంస్థ పనులు ప్రారంభించింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ అధికారులు ఇవాళ ఉదయం స్పిల్‌వే బ్లాక్ నంబర్ 18 వద్ద జలవనరుల శాఖ ఈఈ ఏసుబాబు సమక్షంలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.
కాగా అన్ని వనరులు ఉపయోగించి నిర్ణీత గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మేఘా సంస్థ అన్ని ఏర్పాటు చేసుకుంటోంది. కాళేశ్వరం లాంటి క్లిష్టమైన ప్రాజెక్టులు నిర్మించిన అనుభవంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని ఒప్పంద గడువు ప్రకారం పూర్తి చేసి రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది. ఇన్ని రోజులు పోలవరం పనులు చేపట్టేందుకు అడ్డంకిగా ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేయడంతో పనులు చేయడానికి మార్గం సుగమం అయ్యింది.
హైకోర్టు ఉత్తరువులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో మేఘా ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టును కాళేశ్వరం తరహాలో యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2005లో పనులు ప్రారంభిస్తూ హెడ్వర్క్స్, కుడి, ఎడమ కాలువ పనులను ప్యాకేజ్ వారిగా అప్పగించారు. అదే సమయంలో ఆయన కీలకమైన అన్ని అనుమతులను సాధించారు.
పాత కాంట్రాక్టును రద్దు చేసి మళ్లీ రివర్స్ టెండర్‌కు వెళ్లి పోలవరం హెడ్ వర్కులతో పాటు జల విద్యుత్ కేంద్రాలను కలిపి ప్రభుత్వం రివర్స్ టెండర్ పిలిచింది. మేఘా ఇంజనీరింగ్ గతంలో ఈ టెండర్‌లో పనులు చేపట్టిన సంస్థల కంటే తక్కువ -12.6 శాతానికి రూ. 4358 కోట్ల మొత్తానికి పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చింది. ప్రభుత్వానికి దీనివల్ల రూ 628 కోట్ల మొత్తంలో నిధులు ఆదా అవుతున్నాయి. ఈ ప్రాజెక్‌లో జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా ఆ పనికి మేఘా ఇంజనీరింగ్ ఒక్కటే 4358 మొత్తానికి టెండర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా ఈ బహుళార్ధ సాధక ప్రాజెక్టును పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ఎంఈఐఎల్ వడివడిగా అడుగులు వేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment