
ఎంఈఐఎల్ చైర్మణ్ పీపీ రెడ్డి (ఎడమ)తో ఎండీ పీవీ కృష్ణా రెడ్డి
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ ఇండియా మేగజీన్.. ‘కలెక్టర్స్ ఎడిషన్ 2019’లో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) చైర్మన్ పీపీ రెడ్డికి విశిష్ట గౌరవం లభించింది. ఈ ఎడిషన్‌లో ఆయనకు సంబంధించి ఒక ప్రత్యేక కథనాన్ని ఫోర్బ్స్ ఇండియా ప్రచురించింది. దేశంలోని అత్యంత సంపన్నులకు సంబంధించి ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన 2019 జాబితాలో పీపీ రెడ్డి 3.3 బిలియన్ డాలర్ల సంపదతో 39వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘మేఘా బిల్డర్’ పేరుతో ఫోర్బ్స్ ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది.
పీపీ రెడ్డితో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణా రెడ్డి కలిసి ఉన్న ఫొటోతో ప్రచురించిన ఈ వ్యాసంలో, 1987లో పైపుల తయారీ సంస్థగా చిన్నగా ప్రారంభమయిన మేఘా ఇంజనీరింగ్, అటు తర్వాత సాగించిన అప్రతిహత పురోగమనాన్ని ప్రస్తావించింది. 14 బిలియన్ డాలర్ల భారీ మొత్తంతో దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు– కాళేశ్వరంను సంస్థ విజయవంతంగా పూర్తిచేసిన విషయాన్ని ఇందులో ప్రస్తావించింది. అలాగే జోర్డాన్, కువైట్, టాంజానియా, జాంబియా వంటి పలు దేశాల్లోని పలు ప్రాజెక్టుల్లో సంస్థ క్రియాశీలంగా వ్యవహరిస్తున్న విషయాన్ని ఉటంకించింది. భారత్ అత్యుత్తమ ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ కంపెనీల్లో ఒకటిగా ఎంఈఐఎల్ నిలుస్తోందని పేర్కొంది. రుణ రహిత కంపెనీగా ఎంఈఐఎల్ కొనసాగుతున్న విషయాన్ని ఫోర్బ్స్ ప్రత్యేకంగా ప్రస్తావించింది.
Comments
Please login to add a commentAdd a comment