పోలవరం పనుల్లో వేగం.. వారి కోసం ప్రత్యేక రైళ్లు | Corona Virus Pandemic: MEIL Speeds Up Polavaram Project Works | Sakshi
Sakshi News home page

కరోనా సంక్షోభం అయినా కానీ...

Published Tue, Jun 9 2020 12:40 PM | Last Updated on Tue, Jun 9 2020 2:04 PM

Corona Virus Pandemic: MEIL Speeds Up Polavaram Project Works - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా సంక్షోభంలోనూ పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. పనులను మెరుపు వేగంతో ‘మేఘా’ పరుగులు పెట్టిస్తోంది. కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా కార్మికులు వలస వెళ్లిపోతున్నారు. అయినా పోలవరంలో మాత్రం ఎక్కడా ఆ ప్రభావం లేకుండా చూస్తోంది ఆ సంస్థ. ప్రాజెక్ట్‌లోని ప్రధానమైన పనులకు ఆటంకం రాకుండా అధిగమిస్తోంది. స్పిల్‌వే, స్పిల్‌ ఛానెల్‌, అప్రోచ్‌ చానెల్‌, పైలెట్‌, చానెల్స్‌, ఎర్త్‌కమ్ ర్యాక్ఫిల్‌ డ్యాం 1,2,3(గ్యాప్‌లు) ప్రాంతాలతో పాటు గతంలో పూర్తిగా నిలిచిపోయిన జల విద్యుత్‌ కేంద్ర నిర్మాణ పనులు సైతం మొదలయ్యాయి.

అప్పట్లో ఉత్తుత్తి ప్రకటనలు 
చంద్రబాబు హయాంలో పోలవరంలో ఏదో జరిగిపోతోందని ఉత్తుత్తి ప్రకటనలు వచ్చాయి. 2018లోనే ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని ఏకంగా అసెంబ్లీలో ప్రకటనలు చేశారు కానీ ఆచరణలో మాత్రం నిజం చేయలేకపోయారు. నిర్మాణ పనులన్నీ నత్తనడకన సాగాయి. నాడు స్పిల్‌వే, కాఫర్‌ డ్యాం పనులు కొంత మేరకు జరగడం నహా మిగిలిన పనులేవి ప్రారంభించనేలేదు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత ప్రభుత్వం పట్టిన పనులను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచారు. దాని వల్ల వ్యయం తగ్గించడంతో పాటు (ప్రభుత్వానికి ఆదా) అన్ని పనులు ముమ్మరం అయ్యే విధంగా చర్యలు చేపట్టారు.

త్రీ గాడ్జెస్‌ కన్నా ఎక్కువ 
ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్‌వే పోలవరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగంగా ఉంది. దీన్ని చేపట్టిన మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ లక్ష్యం మేరకు ప్రణాళికబద్ధంగా పనులు సాగిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో 50 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించే విధంగా స్పిల్‌వే నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా పరిగణించే చైనాలోని త్రిగాడ్జేస్‌ జలాశయ స్పిల్‌వే వరద నీటి విడుదల సామర్థ్యం 47 లక్షల క్యూసెక్కులు. దానికన్నా పోలవరం ప్రాజెక్ట్‌ 3 లక్షల క్యూసెక్కుల అధిక సామర్థ్యంతో మేఘా ఇంజనీరింగ్‌ నిర్మిస్తోంది. 2019 నవంబర్‌లో మేఘా పనులను ప్రారంభించింది. చదవండి: కాళేశ్వరంలో ‘మేఘా’ పవర్‌!

అప్పటికే జలాశయ నిర్మాణ ప్రాంతంలో ముందు, వెనకా (గత ప్రభుత్వం సరైన ఇంజనీరింగ్‌ పద్ధతిలో నిర్మాణాలు చేపట్టకపోవడం వల్ల ) వరద నీరు చేరింది. దాని వల్ల దాదాపు 4 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికే అధిక సమయం పట్టింది. ఆ తరువాత జనవరిలో పనులు వేగవంతమయ్యాయి. నిర్మాణ పనులకు వేసవి కాలం ముఖ్యంగా మార్చి, ఏప్రిల్‌, మే నెలలు కీలకమైనవి. కానీ కరోనా కష్టాలతో దేశ వ్యాప్తంగా ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు మందగించాయి. పోలవరం నిర్మాణంపై కూడా ఈ ప్రభావం కొంత పడింది. 

పోలవరం నుంచి కార్మికుల వలస 
అతిపెద్ద ప్రాజెక్ట్‌ కావడంతో వేల మంది కార్మికులు ఇక్కడ పని చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో 2 వేల మంది కార్మికులు తమ సొంత రాష్ట్రాలైన బీహార్‌, జార్ఞండ్‌, ఒరిస్సాకు వెళ్లిపోయారు. దాని వల్ల అతికొద్ది మంది కార్మికులు, సిబ్బందితోనే పనులు చేయించాల్సి వచ్చింది. అయినా పనులు ఆగిపోకుండా ముందుకు సాగాయి. ఇందులో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ సమర్థంగా వ్యవహరించాయి.

పనులల్లో స్పిల్‌వే, స్పిల్‌ ఛానెల్‌, జల విద్యుత్‌ కేంద్రం, మట్టి, రాతి పనులు ఈ కాలంలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే జరిగాయి.  నవంబర్‌-డిసెంబర్‌ల్లో నీటి సమస్య వల్ల పనులు నెమ్మదిగా జరిగాయి. నవంబర్‌లో 206, డిసెంబర్‌లో 5,628 ఘనపు మీటర్ల కాంక్రీట్‌ పనులు జరిగాయి. జనవరి నుంచి పనులు ఊపందుకున్నాయి. ఆ నెలలో 20,639 ఘనపు మీటర్లు, ఫిబ్రవరిలో 32,443, మార్చిలో 36,129 ఘనపు మీటర్ల స్పిల్‌వే, స్పిల్‌ చానెల్‌ కాంక్రీట్‌ పనులు జరిగాయి. ఏప్రిల్‌, మే నెలలో కరోనా ప్రభావం పోలవరంపై పడకుండా అటు నిర్మాణ సంస్థ, ఇటు ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించాయి. చదవండి: పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంపు

ప్రత్యేక జాగ్రత్తలతో... 
కరోనాతో ప్రాజెక్ట్‌లకు ఒక్క కార్మికుల సమస్యలే కాదు... మిగిలిన ఇబ్బందులు వచ్చాయి. సిమెంట్‌, స్టీల్‌ ఇతర వస్తువుల సరఫరాపై తీవ్ర ప్రభావం చూపింది. రవాణా వ్యవస్థ ఏప్రిల్‌, మేల్లో స్తంభించిపోయింది. ప్రాజెక్ట్‌కు అవసరమైన ముడిసరుకు చేరకపోవడంతో అనేక అవరోధాలు ఎదురయ్యాయి. పనులు అనుకున్న స్థాయిలో చేయలేకపోయారు. ప్రభుత్వ యంత్రాంగం, కంపెనీ సిబ్బంది దానిని అధిగమించడానికి శతవిధాలా ప్రయత్నించాల్సి వచ్చింది. కార్మికుల కోసం జిల్లా వైద్య సిబ్బంది, మేఘా సంస్థ ప్రత్యేకంగా వైద్యసిబ్బందితో మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేసింది. కార్మికులకు ప్రత్యేక ఇన్సెంటివ్స్‌ కూడా ఇస్తున్నారు.

ఇంజనీర్లు, మేఘా సిబ్బంది శ్రమ 
గత ప్రభుత్వంలో స్పిల్ ఛానల్ పనులు అస్సలు జరగలేదు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ పనిని ప్రారంభించింది. ఏప్రిల్‌లో స్పిల్‌వే కాంక్రీట్‌ పని 18,714 ఘ.మీ, స్పిల్‌ ఛానెల్‌ 9,511 ఘ.మీ కాంక్రీట్‌ పని జరిగింది. మొత్తం మీద 28,225 ఘ.మీ కాంక్రీట్‌ పనిని పూర్తిచేశారు. మే నెలలో అంతకన్నా దాదాపు రెట్టింపు పని జరిగింది. స్పిల్‌ వే 10909, స్పిల్‌ ఛానెల్‌లో 42354 ఘ.మీ చొప్పున జరిగాయి. మొత్తం మీద 53263 ఘనపు మీటర్ల పనిని మేలో చేశారు. ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించినప్పటి నుంచి అంతకు ముందు ఏ నెలలోనూ చేయనంతగా మే నెలలో కరోనాని సైతం ఎదుర్కొని ఆ మేరకు పనిచేశారంటే ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. నవంబర్ నుంచి ఇప్పటివరకు (జూన్ 8, 2020) 2,01,025 ఘ.నపు మీటర్ల స్పిల్ వే, స్పిల్ ఛానెల్ పనులు జరిగాయి.  

మేఘా చేపట్టాకే... 
వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పిల్‌ వే క్రీట్‌ పనులు కొనసాగించడంతో పాటు ప్రధానమైన ఎర్త్‌ కమ్‌ ర్యాక్‌ ఫిల్‌ డ్యాం (3 గ్యాపులు) నిర్మించడానికి అవసరమైన మట్టి పటుత్వ పరీక్షలు (వైబ్రో కంప్యాక్షన్‌ పనులు) మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ చేపట్టింది. అలాగే స్పిల్‌ ఛానెల్‌ పనులు మొదలయ్యాయి. ఇందులో ప్రధానంగా మట్టి తవ్వకం ఊపందుకుంది. స్పిల్‌ ఛానెల్‌కు సంబంధించిన కాంక్రీట్‌ బ్లాక్‌ నిర్మాణం కూడా క్రియాశీల దశకు చేరుకుంది. ఫిబ్రవరిలో ఈ పనులును మేఘా ఇంజనీరింగ్ ప్రారంభించగా ప్రతినెలా పని సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఇప్పటికీ (జూన్ 08,2020) 2,01,025 ఘనపు మీటర్ల  కాంక్రీట్ పనిని పూర్తిచేసింది.

వేగంగా పవర్‌ హౌస్‌ పనులు 
పవర్‌ హౌస్‌ నిర్మాణ పనులు గత ప్రభుత్వ కాలంలో పూర్తిగా నిలిచిపోయాయి. 960 మెగావాట్ల జల విద్యుత్‌ కేంద్రాన్ని పోలవరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించాలి. ఇందుకోసం ఒక్కొక్కటి 80 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 12 వర్టికల్‌ కప్లాంగ్‌ టర్బైన్లను ఏర్పాటు చేయాలి. కానీ ఈ పని చంద్రబాబు ప్రభుత్వ కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం దీనికి కూడా ప్రాధాన్యత ఇవ్వడంతో జల విద్యుత్‌ కేంద్ర నిర్మాణానికి సంబంధించిన కొండ తవ్వకం (బ్లాస్టింగ్‌) పనులు ఊపందుకున్నాయి.

తిరిగి వస్తున్న కార్మికులు
ప్రభుత్వం, మేఘా సంస్థపై నమ్మకంతో పోలవరంలో పనిచేసి స్వరాష్ట్రాలకు వెళ్లిన కార్మికులు తిరిగి వస్తూ పనుల్లో చేరుతున్నారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి ఎలాగైనా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్న మేఘా సంస్థ దాదాపు 2000 మంది కార్మికులను ప్రత్యేక రైళ్ల ద్వారా తిరిగి వెనక్కు తీసుకొచ్చింది. ఇలా వచ్చినవారికి ఇతర సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. అలాగే ప్రత్యేక మెడికల్ టీం ఏర్పాటు చేసి అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తరువాతనే పనుల్లోకి అనుమతిస్తున్నారు. పనిచేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో పనులను మరింత వేగవంతం చేయనున్నారు. అనుకున్న పనులను పూర్తి చేసి వర్షాకాలం మొదలై వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా పనులు చేసేలా మేఘా సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement