ప్రత్యేకత చాటుకుంటున్న ’మేఘా’  | Kaleshwaram Project:Laxmipur (Gayatri) Underground pump house Wet Run Success | Sakshi
Sakshi News home page

ఉవ్వెత్తున్న ఉబుకుతోన్న ’మేఘా’ పంపింగ్

Published Wed, Sep 4 2019 11:10 AM | Last Updated on Wed, Sep 4 2019 11:10 AM

Kaleshwaram Project:Laxmipur (Gayatri) Underground pump house Wet Run Success - Sakshi

కరీంనగర్‌: తెలంగాణలో పుడమిని చీల్చుకుంటూ గోదారమ్మ పొంగిపొర్లుతూ ఉరకలేస్తోంది. భూగర్భంలో నుంచి ’మేఘా’ గాయత్రి పంపింగ్ హౌసులో జలాలు ఉవ్వెత్తున ఉబుకుతున్నాయి. శివుడి శిరస్సుపై నుంచి గంగమ్మ జాలువారినట్టు పుడమిని నమ్ముకున్న రైతన్నల ఆశలకు అంకురార్పణ చేస్తూ తెలంగాణలోని మగాణిని పచ్చదనం పరిచేందుకు గోదారమ్మ బిరబిరా పరుగులెడుతోంది. గాయత్రి భాగర్భ పంపింగ్ కేంద్రం నిర్మాణంతో ఏటిలో నుంచి కాలువల్లోకి పొంగిపొర్లుతూ బీళ్లు బారిన పొలాల గట్లలోకి తడార్చేందుకు జలాలు ఉరకలేస్తున్నాయి. గొంతెండిన పొలాలను పులకరింపజేస్తూ పంటపొలాల్లో విత్తులు మొక్కై ఫలాలు అందించేందుకు భూమి పొరల్లోంచి చీల్చుకుంటూ వస్తోన్నాయి. మానేరులో గోదారమ్మ సాగరాన్ని తలపిస్తూ గాయత్రి పంపింగ్ హౌస్ కళకళలాడుతోంది. బీడుబారిన పొలాలను పులకరింపజేస్తూ మిడ్ మానేరుకు పరుగులు తీస్తోంది. తెలంగాణలో ’మేఘా ఇంజనీరింగ్’ ఓ అత్యద్భుతాన్ని ఆవిష్కరించింది. 

’మేఘా ఇంజినీరింగ్’ భూగర్భంలో విశ్వవిఖ్యాతిగాంచిన గాయత్రి నీటి పంపింగ్ కేంద్రాన్ని తెలంగాణ కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గ్రామ సమీపంలో నిర్మించింది. ఈ కేంద్రాన్ని ఆగస్టు 11న ప్రారంభించి నేటి వరకు 22 రోజులు అవుతుండగా 3 పంపింగ్ మిషన్లతో 11. 40 టిఎంసీల నీరు మిడ్ మానేరుకు చేరుకున్నాయి. తొలిగా ప్రారంభించిన క్రమసంఖ్యలో 5వ మిషన్ 16 రోజుల్లో నిరంతరాయంగా 380 గంటపాటు, రెండోది వరుసలో 4వ మిషన్ 378 గంటలు పని చేయడంతో ఈ రెండు మిషన్లు ఒక్కొక్కటి దాదాపు 4.30 టిఎంసీల నీటిని పంప్ చేశాయి. అలాగే మూడోది 1వ మిషన్ 10రోజుల్లో 248గంటలు పని చేసి 2.80టిఎంసీల నీటిని తోడింది. ’మెగా’ మహాద్భుతం గాయత్రి పంపింగ్ కేంద్రాన్ని భూగర్భంలో 470 అడుగులు 327 మీటర్ల పొడవున నిర్మించి విశ్వవిఖ్యాతి ఘనత సాధించింది. ఈ నిర్మాణంలో తొలిదశలో ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్ధ్యంతో 5 మిషన్లున్నాయి. మోటారు, పంపు కలుపుకుంటే ఓ మిషన్. మలిదశలో మరో రెండు మిషన్లు సిద్ధమవుతుండగా ఇప్పటికే ఓ మిషన్ డ్రైరన్ కూడా పూర్తయింది. 

కాళేశ్వరం ప్రాజెక్టులో భూగర్భ గాయత్రి పంపింగ్ కేంద్రం గుండెకాయల పని చేస్తూ బీళ్లుబారిన లక్షల ఎకరాల చేనులకు సాగునీరు అందించేందుకు గోదారమ్మ పరుగులు పెడుతూ రైతన్నల కళ్ళల్లో ముంగిట్లో బంగారు కలలను , గుండెల్లో మొక్కవోని ధైర్యాన్ని చిగురింపజేస్తోంది. 2019 జూలైలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లింక్ 1లోని లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) నుంచి నీటిని పంపింగ్ చేస్తున్న ’మేఘా’ తన రికార్డును తానే అధిగమించింది. 


ప్రపంచ నెంబర్ వన్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా స్థాయిలో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమిస్తూ అతి పెద్ద పంపులు ఏర్పాటు చేసి ఎలాంటి సాంకేతిక సమస్యకు తావివ్వలేదు. అత్యద్భుతమైన ప్రాజెక్టుపై విమర్శలు చేస్తోన్న నోళ్లకు తాళాలు వేసుకునేలా ’మేఘా పంపింగ్ కేంద్రాలు’ గంగమ్మను భూ ఉపరితలంపైకి ఉబికిస్తూ నలుదిక్కులు ఘనతను పిక్కటిల్లెలా చాటుతోంది. ఇప్పటి వరకు అతిపెద్ద పంపింగ్ కేంద్రాలుగా హంద్రీనీవా తొలిదశలోని 12 కేంద్రాలు, రెండోదశలో 18 కేంద్రాలు ఖ్యాతిని గడించాయి. అంతేకాకుండా పట్టిసీమ, పురుషోత్తపట్నం, ముచ్చుమర్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పంపింగ్ కేంద్రం చూసినా ’మేఘా ఇంజనీరింగ్’ నిర్మించినవే. 

ఏపీలోని హంద్రీనీవా అతి పెద్దది, ముఖ్యంగా అతి పొడవైనది అంతే కాకుండా ఎక్కువ పంపింగ్ కేంద్రాలతో రికార్డులను సొంతం చేసుకుంది. తొలిదశలో 12 కేంద్రాలు, 2వ దశలో 18 కేంద్రాలున్నాయి. తొలిదశలో 1వ పంపింగ్ కేంద్రం కృష్ణానది శ్రీశైలం ఎగువ భాగం మాల్యాలో నిర్మించారు. ఈ పంపింగ్ కేంద్రంలో 12 మిషన్లు  ఉన్నాయి. ఒక్కొక్క మిషన్ 9.56 క్యూసెక్కుల నీరు అలాగే 5 మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యంతో నిర్మించారు.  దాదాపు నీటి పంపింగ్ ఎత్తు 38 మీటర్లు. 

కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే లింక్ 1లో ఒక్కొక్క మిషన్ సామర్ధ్యం 40 మెగావాట్లు. ఒక్క లక్ష్మీ మేడిగడ్డ కేంద్రంలోనే 17 మిషన్లు వున్నాయి. మొత్తం సామర్ధ్యం 680 మెగావాట్లు. హంద్రీనీవా మాల్యా పంపింగ్ కేంద్రం మొత్తం సామర్ధ్యం 60 మెగావాట్లు. అంటే హంద్రీనీవా కంటే కాళేశ్వరం లక్ష్మీ పంపింగ్ కేంద్రం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఐతే కాళేశ్వరంలోనే ఈ లక్ష్మీ మేడిగడ్డ కేంద్రంతో పోల్చితే గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రం మరింత అత్యంత పెద్దది. ఇందులో ఒక్కొక్కటి 139 మెగావాట్ల చొప్పున 7మిషన్లు 973 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మించింది. అందులోనూ భూగర్భంలో 470 అడుగుల దిగువన నిర్మించడం విశేషం. ఏపీ, తెలంగాణలో ఏ పంపింగ్ కేంద్రముతోనూ గాయత్రి పంపింగ్ కేంద్రానికి పోలిక లేనేలేదు. 

హంద్రీనీవా అతిపెద్ద పంపింగ్ పధకం ఐనప్పటికీ అందులో మరింత పెద్దదిగా పరిగణించేది మాల్యాలోని తొలి కేంద్రం. 2012 నుంచి అంటే 8 ఏళ్లు 1242 రోజుల పాటు పంపింగ్ జరుగుతున్నప్పటికి 163.4 టిఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోసారు. అలాగే పట్టిసీమ నుంచి ఐదేళ్లలో 289 టిఎంసీల నీటిని అందించగలిగారు. ఐతే కాళేశ్వరంలోని ’మేఘా ఇంజనీరింగ్’ నిర్మించిన లింక్1, లింక్2 లోని 4 మెగా పంపింగ్ కేంద్రాలు పనిచేస్తే  ఏ స్థాయిలో తెలంగాణలో బీళ్లు బారిన లక్షల ఎకరాల భూములకు సాగునీరు చేరుతుందో నోటి మాటతో లెక్కకట్టి చెప్పడం సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు. 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నిర్దిష్ట సమయంలో పూర్తి చేయడంతో పాటు ’మేఘా ఇంజనీరింగ్’ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా పంపింగ్ చేస్తుండటంతో విశ్వంలోనే ’మేఘా’ ప్రత్యేకతను చాటుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ఫలాలు అందించేందుకు ఆరంభంలోనే ఈ పరిమాణంలో నీరు అందిస్తే భవిష్యత్తులో హంద్రీనీవా, పట్టిసీమ పథకాల్లాగే ఏళ్లపాటు వేల గంటలు పంపింగ్ జరిగితే ప్రపంచంలో నీటి కోసం యుద్ధాలు ఎక్కడైనా జరగొచ్చు కానీ తెలంగాణలో మాత్రం సాగు, తాగు నీరుకు చిరకాలం కరువే అనే మాట కనుచూపు మేరల్లో ఉండదు. తెలంగాణ మాగాణులు పచ్చదనంతో పరిడవిళ్లుతాయి. ఈ ఘన చరిత్రలో, తెలంగాణ భవిష్యత్తులో ’మేఘా ఇంజనీరింగ్’ నిర్మాణ భాగస్వామవడం ఓ మైలురాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement