లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి ఈటల, సీఎస్ సోమేశ్, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ తదితరులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సాగునీటి రంగంలోని ఇంజనీరింగ్ విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు అనుబంధంగా ఉన్న సాగునీటి ఇంజనీరింగ్ విభాగాలను పునర్ వ్యవస్థీకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. గురువారం సాయంత్రం మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏటా 530 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తి పోసేందుకు ఇంజనీరింగ్ అధికారులు సన్నద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. మేలో రాష్ట్రంలోని అన్ని సాగునీటి కాల్వలకు అవసరమైన మరమ్మతులు చేయాలని ఆదేశిం చారు. సాగునీటికి సంబంధించిన అన్ని ఇంజనీరింగ్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తేవాలని సూచించారు. సాగునీటి ఇంజనీరింగ్ వ్యవస్థను 11 సర్కిళ్లుగా విభజించనున్నట్లు చెప్పారు. సర్కిల్ అధిపతిగా చీఫ్ ఇంజనీర్ వ్యవహిస్తారని పేర్కొన్నారు. సర్కిల్ పరిధి లో సాగునీటికి సంబంధించి ఏ అంశం పై అయినా సంబంధిత చీఫ్ ఇంజనీర్ బాధ్యత వహిస్తారని తెలిపారు.
జూన్‌లోగా ఖాళీల భర్తీ..
జూన్‌లోగా ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆపరేషన్ మెయిం టెనెన్స్ ప్రభావవంతంగా చేపట్టేందుకు వీలుగా ఇంజనీరింగ్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బం దికి సంబంధిత ప్రాజెక్టుల వద్ద కనీస వసతి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పనులు వెంటనే ప్రారంభించి ఏప్రిల్‌లోగా ఇరిగేషన్ అధికారులు, సిబ్బందికి క్వార్టర్స్ నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించారు.
530 టీఎంసీల ఎత్తిపోత లక్ష్యంగా..
గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 530 టీఎంసీల మేర ఎత్తి పోసేందుకు అధికారు లు అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లి రిజర్వాయర్లలో ప్రస్తుతం ఉన్న నీటిని ఏప్రిల్ 10లోగా ఖాళీ చేయాలన్నారు. తద్వారా వర్షాకాలంలో మరింతగా గోదావరి జలాలను ఒడిసి పట్టే ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మధ్య సమాచారం చేరేందుకు వీలుగా వైర్‌లెస్‌సెట్లు కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల ఆపరేషన్ రూల్స్ కార్యచరణ సిద్ధం చేయాలన్నారు. గోదావరి ప్రధాన ఉపనది అయిన ప్రాణహితలో వాస్తవ నీటి పరిమాణాన్ని తెలుసుకునేందుకు వీలుగా కాళేశ్వరం నుంచి తమ్మిడిహెట్టి వరకు 5 నుంచి 6 చోట్ల గేజ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. పనులు దక్కించుకున్న ఏజెన్సీలు సకాలంలో పనులు పూర్తి చేయట్లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటివి గుర్తించి ఆయా ఏజెన్సీలను పనుల నుంచి తొలగించాలని సీఎం ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. భగీరథ పథకం పైపులు విరగొట్టే వారిని గుర్తించి ముందుగా నోటీసులు జారీ చేయాలన్నారు. అప్పటికి వినకపోతే రూ.5 వేల జరిమానా విధించాలని సీఎం సూచించారు.
ఆ జిల్లాలకు కొత్త కలెక్టరేట్‌లు..
కరీంనగర్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో కొత్త కలెక్టరేట్ల నిర్మాణానికి సీఎం ఆదేశాలు జారీ చేశా రు. సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా ప్రజాపరిషత్ చైర్‌పర్సన్ కె.విజయ, ఎమ్మెల్యేలు రవిశంకర్, రసమయి బాలకిషన్, కొరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి, ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
చెరువులన్నీ నింపాలి
రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి కాలువలకు మే ఆఖరులోగా అవసరమైన అన్ని మరమ్మతులు చేపట్టాలన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే మంజూరు చేసిన 161 చెక్ డ్యాంల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు. మే 15లోగా చెక్ డ్యాంల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు మరిన్ని చెక్ డ్యాంలు కావాలని కోరుతున్నందున ఆ దిశగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
చిన్ననాటి సహచరుడితో మాటాముచ్చట..
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తీగలగుట్టపల్లి ఉత్తర తెలంగాణ భవన్ నుంచి వెళ్తుండగా.. గురువారం ఉదయం తనను కలిసేందుకు వచ్చిన తన చిన్ననాటి స్నేహితుడిని సీఎం కేసీఆర్.. చిరునవ్వుతో పలకరించారు. ఆప్యాయతతో అక్కున చేర్చుకొని కుశల ప్రశ్నలు వేసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన ఆ చిన్ననాటి స్నేహితుడి పేరు సంపత్‌కుమార్. తనింట్లో జరిగే శుభకార్యానికి రావాలని ఆహ్వానిస్తూ సంపత్ పత్రిక అందజేశారు. హైదరాబాద్‌లో ఒకే గదిలో కలసి ఉన్నప్పటి జ్ఞాపకాలను సీఎం గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment