
గడువులోగానే 4 ప్రాజెక్టులు పూర్తి: ఎంఈఐఎల్
దాదాపు రూ. 3,100 కోట్ల విలువ చేసే నాలుగు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను గడువులోగానే పూర్తి చేసినట్లు...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దాదాపు రూ. 3,100 కోట్ల విలువ చేసే నాలుగు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను గడువులోగానే పూర్తి చేసినట్లు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) వెల్లడించిం ది. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలోనే రికార్డు స్థాయి పనితీరు కనపర్చినట్లు సంస్థ డెరైక్టర్ బి. శ్రీనివాసరెడ్డి తెలిపారు. పూర్తి చేసిన వాటిల్లో సౌనియోజన, పట్టిసీమ ఎత్తిపోతల పథకం, గజ్వేల్ వాటర్‌గ్రిడ్‌తో పాటు టాంజానియాలో తాగు నీటి పథకం ప్రాజెక్టులు ఉన్నాయని ఆయన వివరించారు. సుమారు రూ. 515 కోట్ల వ్యయంతో గుజరాత్‌లో తలపెట్టిన సౌని యోజన ప్రాజెక్టు పనులు ఈ ఏడాది ఆగస్టు 27న పూర్తికాగా.. ప్రధాని మోదీ 30న జాతికి అంకితం చేశారని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. మిషన్ భగీరథ కింద తెలంగాణలో రూ. 548 కోట్ల వ్యయంతో గజ్వేల్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేశామని, 1,200 కి.మీ. మేర తాగు నీటి పైప్‌లైన్లు వేశామని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సాంకేతికంగా ఆసియాలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకమైన పట్టి సీమ ప్రాజెక్టును కూడా నిర్దిష్ట గడువు కన్నా ముందుగానే పూర్తి చేశామని వివరించారు.