సాక్షి, హైదరాబాద్: మౌలిక వసతులు, నిర్మాణ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలకు పైగా విస్తరించిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్) తాజాగా రక్షణ రంగంలో అడుగుపెడుతోంది. దేశ రక్షణకు సంబంధించిన ఆయుధాలను, వివిధ పరికరాలను తయారు చేసేందుకు ఎంఈ ఐఎల్‌కు అనుమతిస్తూ కేంద్ర హోం, వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వ శాఖలు ఉత్తర్వులు జారీ చేశాయి. వివిధ దశల్లో రూ.500 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఈ సంస్థ ఆయుధాలు, రక్షణ రంగ పరికరాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేం దుకు అనుమతి పొందింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ 2020కి అనుగుణంగా రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు, వాహనాలు, విడి పరికరాలు, సాయుధ సంపత్తి ఉత్పత్తి చేసేందుకు అనుమతి కోరుతూ ఎంఈఐఎల్ దరఖాస్తు చేసుకోగా, కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఉత్పత్తులు ఇవే...
ఎంఈఐఎల్ ఏర్పాటు చేసే డిఫెన్స్ పరిశ్రమలో యుద్ధట్యాంకులు వాటికి సంబంధించిన విడి పరికరాలు, తేలికపాటి యుద్ధ వాహనాలు, ఆర్మర్డ్ ఇంజనీర్ వెహికిల్స్, ఆర్మర్డ్ రికవరీ వెహికిల్స్‌ను ఉత్పత్తి చేయనుంది. అలాగే సైనికులను తీసుకువెళ్లే వాహనాలు (ఏపీసీ) ఇన్ఫ్యాన్ట్రీ కంబాట్ వెహికిల్స్ (ఐసీవీ), సాయుధ బహుళ వినియోగ వాహనాలు, మైన్ లేయింగ్ వెహికిల్స్, బ్రిడ్జ్ లేయింగ్ వెహికిల్స్, అన్ని ప్రాంతాల్లోనూ తిరగలిగే తేలికపాటి యుద్ధ వాహనాలు (ఏసీటీవీ) మొదలైనవి ఉత్పత్తి చేయనుంది. మిస్సయిల్స్, మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్, మిషన్ గన్స్, రాకెట్లు, ఫిరంగులు (క్యానన్), మిస్సయిల్స్ వ్యవస్థను ఉపయోగించడానికి అనుకూలమైన ఎక్యూప్‌మెంట్‌ను కూడా ఉత్పత్తి చేయనుంది. దేశంలో నిర్మాణ, మౌలిక వసతుల రంగంతో చమురు–ఇంధన వాయువు, విద్యుత్, సౌర విద్యుత్, విమానయాన రంగంలో విస్తరించిన మేఘా ఇంజనీరింగ్Š సంస్థ ఈ పరిశ్రమ ద్వారా రక్షణ రంగంలో అడుగుపెడుతోంది.
ఇప్పటికే డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రంగంలో..
మేఘా గ్రూప్‌కి చెందిన పూర్తి అనుబంధ సంస్థ అయిన ఐకామ్ టెలి లిమిటెడ్ ఇప్పటికే దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన వివిధ విభాగాలకు శాస్త్రసాంకేతిక రంగాల్లో సహాయసహకారాలు అందిస్తోంది. óఐకామ్ సంస్థ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌తో పాటు విద్యుత్ ప్రసారం, సౌర రంగాల్లో కూడా నిమగ్నమై ఉంది. అధునాతన కమ్యూనికేషన్ రేడియోలు, జామర్లు, ఈడబ్ల్యూ షెల్టర్స్, యాంటినాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కంటెయినర్లు, విండ్ ప్రొఫైల్స్ రాడర్లను అభివృద్ధి చేసి సరఫరా చేస్తోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి దేశంలోనే తొలిసారిగా ఐకామ్ తయారు చేసిన మొబైల్ వైరాలజీ ల్యాబ్ గత ఏప్రిల్ నెలలో ప్రారంభించిన విషయం తెలిసిందే.
మేకిన్ ఇండియాలో భాగస్వామ్యం..
దేశీయంగా ఆధునిక రక్షణ పరికరాలను తయారు చేయడానికి అవసరమైన అనుమతులన్నింటిని ఎంఈఐఎల్ పొందిందని సంస్థ ప్రెసిడెంట్ శ్రీనివాస్ బొమ్మారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో అత్యాధునిక శాస్త్రసాంకేతిక సామర్థ్యంతో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కల, లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని.. ఆయన లక్ష్యంలో మేఘా గ్రూప్ కూడా భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని శ్రీనివాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment