
సాక్షి, హైదరాబాద్ : మేఘా ఇంజినీరింగ్ సంస్థపై జీఎస్టీ దాడులు అవాస్తమని ఆ సంస్థ సీఈవో స్పష్టం చేశారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)పై దాడులు జరిపినట్లు ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తెలిపారు. బిల్లులు, ఇతర వ్యవహారాల్లోనూ నియమ నిబంధనలకు లోబడే సంస్థ పని చేస్తోందని సీఈవో పేర్కొన్నారు. గత రెండేళ్లుగా పన్ను చెల్లింపుదారుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా జీఎస్టీని చెల్లించి సంస్థ మేఘానే అన్నారు. జీఎస్టీ అమలులోకి వచ్చాక తమ కంపెనీ మూడువేల కోట్లు చెల్లింపులు చేసిందన్నారు. దేశంలో అత్యంత వేగంగా పురోగమిస్తున్న ఇన్ ఫ్రా సంస్థల్లో మేఘా ఒకటిగా నిలుస్తుందని, పన్ను చట్టాలను ఎప్పుడూ తమ సంస్థ గౌరవిస్తుందన్నారు.
ఆ వార్తల్లో కనీస సమాచారం లేకుండా పూర్తిగా అవాస్తవాలు, ఊహాజనిత విషయాలు ప్రచురించారని, దాడులు వార్తకు సంబంధించి సంస్థ నుంచి నిజనిర్థారణ చేసుకోకుండానే వార‍్తలను ప్రచురించడం కొన్ని అదృశ్య శక్తుల దురద్దేశాలను బట్టబయలు చేస్తున్నాయన్నారు. కొందరు ఉద్ధేశ్యపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో మేఘా ఇంజినీరింగ్ సంస్థపై ఐటీ, ఈడీ, జీఎస్టీ సంస్థలు దాడులు జరిపాయని, జరగబోతున్నాయని కక్షపూరితంగా వ్యాప్తి చేస్తున్నారన్నారు. మేఘాపై తప్పుడు కథనాలతో అనుచితమైన, అనవసర ప్రచారానికి పాల్పడిన ఆంగ్ల దిన పత్రిక తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో ఎంఈఐఎల్ చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతోందని, మరోసారి ఇలాంటి ఊహాజనిత వార్తలు రాయకుండా ఉండేందుకేనని తెలిపారు.