విద్యుత్ సరఫరా రంగంలో జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసుకున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) తాజాగా థర్మల్ విద్యుత్ రంగంలోనూ విజయవంతంగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో అతిపెద్ద విద్యుత్ సరఫరా వ్యవస్థ డబ్ల్యూపీపీటీసీఎల్‌ను రికార్డు సమయంలో నిర్మించడమే కాకుండా జల, సౌర విద్యుత్ రంగంలోనూ అగ్రగామిగా ఉన్న ఎంఇఐఎల్ ఇప్పుడు మొదటి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. తమిళనాడులోని నాగపట్టినమ్ వద్ద 150 మెగావాట్ల నాగాయ్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దాదాపు పూర్తి కావచ్చింది. ప్రస్తుతానికి 60 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసేలా గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. మొత్తం ప్రాజెక్ట్‌ను ఈ నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
‘ఎంఇఐఎల్’ థర్మల్ విద్యుత్ కేంద్రాలు
తమిళనాడులో రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఎంఇఐఎల్ ఏర్పాటు చేస్తోంది. ఇందులో 525 మెగావాట్ల ట్యుటీకోరిన్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఎస్ఇపీసీ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కోసం ఇపీసీ పద్ధతిలో ఎంఇఐఎల్ చేపట్టింది. నాగపట్టినమ్ వద్ద ఏర్పాటు చేస్తున్న 150 మెగావాట్ల నాగయ్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కేవీకే ఎనర్జీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఎంఇఐఎల్ ఏర్పాటు చేస్తున్నది.
నాగయ్ థర్మల్ పవర్ ప్లాంట్
నాగపట్టణంకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్లాంటు ఉంటుంది. ప్లాంట్ ఏర్పాటుకు 230 ఎకరాల స్థలాన్ని సేకరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 530 టిపిహెచ్ సామర్థ్యం కలిగిన బాయిలర్, 150 మెగావాట్ల టర్బైన్ జనరేటర్, ఏయిర్ కూల్డ్ కండెన్సర్, 125 మీటర్ల ఎత్తైన చిమ్నీని ఎంఇఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ థర్మల్ విద్యుత్ కేంద్రానికి కావాల్సిన 70 శాతం బొగ్గును దేశీయంగానూ, మిగతా 30 శాతం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
ప్లాంట్‌కు కావలసిన 3700 టన్నుల స్టీల్‌ను ఎంఇఐఎల్ సొంతంగా సరఫరా చేసింది. ఈ ప్లాంటులో ఉత్పత్తి అయిన విద్యుత్ ను తరలించేందుకు 24.6 కిలో మీటర్ల ట్రాన్స్ మిషన్ లైన్లను ప్లాంటు నుంచి 230 కెవి తిరువూరు సబ్ స్టేషన్ వరకు ఏర్పాటు చేశారు. ఏడు రోజులకు సరిపడా బొగ్గును నిల్వ చేయడానికి 114 టిపిహెచ్ నిల్వ ఏర్పాట్లు చేశారు. సుమారు 130 మెగావాట్లకు ప్రైవేట్ ఏజెన్సీలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం పూర్తయింది. జులై 10, 2019 నాడు గ్రిడ్ కు అనుసంధాన ప్రక్రియను ప్రారంభించారు.
ట్యుటీకోరిన్ థర్మల్ ప్లాంట్
525 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఎంఇఐఎల్ తమిళనాడు రాష్ట్రంలోని ట్యుటికోరిన్ జిల్లాలో ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పోరేషన్ లిమిటెడ్ (ట్రాన్జెడ్కో) తో ఎస్ఇపిసి సంస్థ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ (పీపీఏ) కుదుర్చుకున్నది. ఈ కేంద్రానికి కావలిసిన స్థలాన్ని వి.ఓ.చిదంబరం పోర్టు నుంచి లీజుకు తీసుకుంది. వడక్కు కరసేరి గ్రామంలో యాష్ పాండ్ ను ఏర్పాటు చేయడానికి 100 హెక్టార్ల స్థలాన్ని సేకరించారు. ఈ స్థలం ఎస్ఇపిసి కి చెందినది.
ఈ ప్రాజెక్టులో భాగంగా టాన్జెడ్కో ఎంఇఐఎల్ కు 48 కిమీల 400 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్ల ను ఏర్పాటు చేసే పనులను అప్పగించింది. ప్లాంటు నుంచి ఒట్టపీడరమ్ సబ్ స్టేషన్ వరకు లైన్ ఏర్పాటు చేశారు. ఎస్ఇపిసి టిఎన్ఈబీ తో విద్యుత్ అమ్మకాలకు సంబంధించి 30 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అదే విధంగా ఈ ప్లాంటుకు అవసరమైన బొగ్గును సరఫరా చేసేందుకు గాను దేశీయ, విదేశీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది.
ఈ థర్మల్ విద్యుత్ కేంద్రంలో 1700 టిపిహెచ్ సామర్థ్యం కాలిగిన బాయలర్, 555 మెగావాట్ల సామర్థ్యం కలిగిన టర్భైన్ జనరేటర్, 500 టిపిహెచ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, గంటకు 6700 క్యూమెక్స్ సముద్ర జలాలను తీసుకొనే ఇంటెక్, గంటకు 66000 క్యూమెక్స్ సామర్థ్యం కలిగిన కూలింగ్ వాటర్ సిస్టమ్ ని ఎంఇఐఎల్ ఏర్పాటు చేస్తోంది. అదేవిధంగా 275 మీటర్ల ఎత్తయిన చిమ్నీని ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ కు కావలసిన 15000 టన్నలు స్టీల్ ను ఎంఇఐఎల్ సొంతంగా సరఫరా చేసింది. 2018 డిసెంబర్ 28న బాయిలర్ హైడ్రో టెస్ట్ విజయవంతం అయ్యింది. ఇప్పటికి 90 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎలక్ట్రో మెకానికల్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలో ఈ విద్యుత్ కేంద్రాన్ని ఎంఇఐఎల్ అందుబాటులోకి తేనుంది.
సాంప్రదాయేతర విద్యుదుత్పత్తి రంగంలో ఎంఇఐఎల్ ఇప్పటికే 112 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నది. మహారాష్ట్రలో ధూలే జిల్లా సాక్రి వద్ద 50 మెగావాట్లు, చంద్రాపూర్ వద్ద రెండు మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాలను మహాజెన్ కో కోసం ఏర్పాటు చేసింది. దేశంలోనే తొలిసారిగా గుజరాత్ లో సాగునీటి కాల్వలపై 10 మెగావాట్ల కెనాల్ టాప్ సోలార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది వంద సృజనాత్మక ఇన్ఫ్రాస్ట్రక్టర్ ఆవిష్కరణల్లో ఒకటిగా అంతర్జాతీయ కన్సల్టెన్సీ కంపెనీ కేపీఎంజీ తన ఎకానమీ పవర్ ప్రాజెక్టుల నివేదికలో గుర్తించింది. భారత్ నుంచి ఎంపికైన ఆరింటిలో ఇది ఒకటి కావడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో 50 మెగావాట్ల సోలార్ థర్మల్ కేంద్రాన్ని ఎంఇఐఎల్ విజయవంతంగా పూర్తి చేసి, విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నది. ఇక జల విద్యుత్ రంగంలో హిమాచల్ ప్రదేశ్ లో 25 మెగావాట్ల లాంబడ్గ్ హైడల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో ఉండగా, గుజరాత్ లో సౌరాష్ట్ర భ్రాంచ్ కెనాల్ పై ఏర్పాటు చేసిన 45 మెగావాట్ల మూడు జల విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటికే రెండు విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా, మూడోది అన్ని పనులు పూర్తి చేసుకొని, ప్రారంభానికి సిద్ధంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment