వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి గృహ వినియోగదారులకు కొత్త ఛార్జీలు
సౌర విద్యుత్తుకు పెద్దపీట వేసేలా చర్యలు
సంప్రదాయేతర విధానాలతో కరెంటు ఉత్పత్తి చేసేలా కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేసవిసమయంలో కరెంట్ వినియోగం పెరుగుతోంది. డిమాండ్‌కు సరిపడా సప్లై లేకపోవడంతో గ్రిడ్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. ఫలితంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం చూస్తున్నారు. ఇదే అదనుగా ప్రభుత్వం ఛార్జీల చెల్లింపులో గతంలోనే ఓ విధానాన్ని ప్రవేశపెట్టింది. రోజులో వినియోగ సమయాన్ని బట్టి విద్యుత్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ విధానాన్ని భారీ పరిశ్రమలకు అమలు చేస్తోంది. 2025 ఏప్రిల్ నుంచి గృహవినియోగదారులకు దీన్ని అమలు చేయాలని చూస్తుంది. దీనివల్ల వీరికి పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
భారత్‌లో అత్యధిక భాగం థర్మల్ విద్యుత్‌కేంద్రాల నుంచి కరెంట్ తయారవుతోంది. థర్మల్ కేంద్రాల్లో బొగ్గును మండిచడంతో వాయుకాలుష్యం పెరుగుతోంది. దాంతో సంప్రదాయేతర విధానాల్లో కరెంట్‌ను తయారీని పెంచుతూ క్రమంగా థర్మల్ కేంద్రాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే జల, అణు, గ్యాస్, సౌర, పవన తదితర వనరుల నుంచీ కరెంటు అందుతోంది. కానీ అందులో థర్మల్ విద్యుత్ కేంద్రాలను భర్తీ చేసేంత కరెంట్ ఉత్పత్తి కావడం లేదు. అందుకు తగ్గట్టు ఆయా కేంద్రాల సామర్థ్యాన్ని పెంచాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. కాలాలకు అనుగుణంగా, గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ తదితర అవసరాలను బట్టి విద్యుత్తు వినియోగం నిత్యం మారుతుంటోంది. కానీ ఉత్పత్తి ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉన్నపుడు కరెంట్‌ను పెద్దమొత్తంలో స్టోర్‌చేసే మార్గాలులేవు. దాంతో విద్యుత్ ఉత్పత్తి, వినియోగం ఏకకాలంలో జరగాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో వ్యత్యాసం వచ్చినపుడు మొత్తం సరఫరా వ్యవస్థ (గ్రిడ్) విఫలమయ్యే ప్రమాదం ఉంది.
అధిక ఖర్చులు..
సంప్రదాయేతర కరెంట్ తయారీలో సౌరవిద్యుత్ ప్రధానమైంది. ఇది పగటిపూట ఎక్కువగా అందుతుంది. పవన విద్యుత్తు వాతావరణ పరిస్థితులను బట్టి మారుతుంది. అవి గ్రిడ్‌కు అనుసంధానం అయినప్పటికీ వాటిద్వారా వెంటనే విద్యుత్ తయారీ సాధ్యం అవ్వకపోవచ్చు. దాంతో కాలుష్యం ఏర్పడుతోందని తెలుస్తున్నా థర్మల్ విద్యుత్‌వైపే మొగ్గు చూపుతున్నారు. ఇందులోనూ విద్యుత్ తయారీ పెంచడానికి కొంత సమయం పడుతుంది. జల విద్యుత్తు ఉత్పత్తిని పెంచుతూ కరెంట్‌ను బ్యాటరీల్లో నిల్వ ఉంచితే అప్పటికప్పుడు వాడుకునే అవకాశం ఉంటుంది. కానీ వాటిపై పూర్తిగా ఆధారపడలేం. పైగా బ్యాటరీల వినియోగం చాలా ఖర్చుతో కూడుకొంది. ఈ క్రమంలో గ్రిడ్ వైఫల్యం చెందకుండా చూసుకోవడం సవాలుగా మారుతోంది.
జల విద్యుత్తు కేంద్రాల్లో నీటిని వెనక్కి తోడి మళ్ళీ కరెంటు ఉత్పత్తికి ఉపయోగిస్తారు. దాంతో రెండుసార్లు యంత్రాలు పనిచేయడం వల్ల విద్యుత్ ఎక్కువ వృథా అవుతోంది. పగటిపూట లభ్యమయ్యే సౌర తదితర మిగులు విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాత్రిళ్లు కరెంట్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి ఆ మేరకు సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో సంప్రదాయేతర విద్యుదుత్పత్తి కేంద్రాల పెంపు, గ్రిడ్ స్థిరత్వం లక్ష్యంగా కేంద్రం విద్యుత్తు వినియోగదారుల హక్కుల నియమావళి-2020ని గతంలో సవరించింది. ఇందులో వ్యవసాయానికి మినహాయింపు ఇచ్చింది. రోజులో విద్యుత్తును వాడే సమయాన్ని బట్టి ఛార్జీలు విధించాలని నిర్ణయించింది.
ఈ సవరణల్లో భాగంగా పగలు సౌర విద్యుత్తు అందుబాటులో ఉండే ఎనిమిది గంటల పాటు విద్యుత్తు ఛార్జీల్లో ఇరవై శాతం రాయితీ అందిస్తారు. సాధారణంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆరు నుంచి పది గంటల దాకా విద్యుత్తు వినియోగం గరిష్ఠంగా ఉంటుంది. ఈ సమయంలో గృహాలకు 10శాతం, ఇతర వర్గాలకు 20శాతం అధిక ధర వసూలు చేయాలని కేంద్రం సూచించింది. ఈ విధానాన్ని 2025 ఏప్రిల్ నుంచి గృహ వినియోగదారులకూ వర్తింపజేయనుంది. ఈ విధానం అత్యధికంగా విద్యుత్తు వినియోగించే భారీ పరిశ్రమలు, పెద్ద వ్యాపార సముదాయాలకు ఎప్పటి నుంచో అమలులో ఉంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న మీటర్లను మార్చి గంటల వారీగా విద్యుత్తును నమోదు చేసే డిజిటల్ మీటర్లను బిగించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment