Tharmal power plants
-
విద్యుత్ సరఫరాలో అంతరాయం.. పరిష్కారం దిశగా ప్రభుత్వం
సంప్రదాయేతర విధానాలతో కరెంటు ఉత్పత్తి చేసేలా కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేసవిసమయంలో కరెంట్ వినియోగం పెరుగుతోంది. డిమాండ్‌కు సరిపడా సప్లై లేకపోవడంతో గ్రిడ్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. ఫలితంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం చూస్తున్నారు. ఇదే అదనుగా ప్రభుత్వం ఛార్జీల చెల్లింపులో గతంలోనే ఓ విధానాన్ని ప్రవేశపెట్టింది. రోజులో వినియోగ సమయాన్ని బట్టి విద్యుత్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ విధానాన్ని భారీ పరిశ్రమలకు అమలు చేస్తోంది. 2025 ఏప్రిల్ నుంచి గృహవినియోగదారులకు దీన్ని అమలు చేయాలని చూస్తుంది. దీనివల్ల వీరికి పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు.భారత్‌లో అత్యధిక భాగం థర్మల్ విద్యుత్కేంద్రాల నుంచి కరెంట్ తయారవుతోంది. థర్మల్ కేంద్రాల్లో బొగ్గును మండిచడంతో వాయుకాలుష్యం పెరుగుతోంది. దాంతో సంప్రదాయేతర విధానాల్లో కరెంట్‌ను తయారీని పెంచుతూ క్రమంగా థర్మల్ కేంద్రాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే జల, అణు, గ్యాస్, సౌర, పవన తదితర వనరుల నుంచీ కరెంటు అందుతోంది. కానీ అందులో థర్మల్ విద్యుత్ కేంద్రాలను భర్తీ చేసేంత కరెంట్ ఉత్పత్తి కావడం లేదు. అందుకు తగ్గట్టు ఆయా కేంద్రాల సామర్థ్యాన్ని పెంచాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. కాలాలకు అనుగుణంగా, గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ తదితర అవసరాలను బట్టి విద్యుత్తు వినియోగం నిత్యం మారుతుంటోంది. కానీ ఉత్పత్తి ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉన్నపుడు కరెంట్‌ను పెద్దమొత్తంలో స్టోర్చేసే మార్గాలులేవు. దాంతో విద్యుత్ ఉత్పత్తి, వినియోగం ఏకకాలంలో జరగాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో వ్యత్యాసం వచ్చినపుడు మొత్తం సరఫరా వ్యవస్థ (గ్రిడ్) విఫలమయ్యే ప్రమాదం ఉంది.అధిక ఖర్చులు..సంప్రదాయేతర కరెంట్ తయారీలో సౌరవిద్యుత్ ప్రధానమైంది. ఇది పగటిపూట ఎక్కువగా అందుతుంది. పవన విద్యుత్తు వాతావరణ పరిస్థితులను బట్టి మారుతుంది. అవి గ్రిడ్‌కు అనుసంధానం అయినప్పటికీ వాటిద్వారా వెంటనే విద్యుత్ తయారీ సాధ్యం అవ్వకపోవచ్చు. దాంతో కాలుష్యం ఏర్పడుతోందని తెలుస్తున్నా థర్మల్ విద్యుత్వైపే మొగ్గు చూపుతున్నారు. ఇందులోనూ విద్యుత్ తయారీ పెంచడానికి కొంత సమయం పడుతుంది. జల విద్యుత్తు ఉత్పత్తిని పెంచుతూ కరెంట్‌ను బ్యాటరీల్లో నిల్వ ఉంచితే అప్పటికప్పుడు వాడుకునే అవకాశం ఉంటుంది. కానీ వాటిపై పూర్తిగా ఆధారపడలేం. పైగా బ్యాటరీల వినియోగం చాలా ఖర్చుతో కూడుకొంది. ఈ క్రమంలో గ్రిడ్ వైఫల్యం చెందకుండా చూసుకోవడం సవాలుగా మారుతోంది.జల విద్యుత్తు కేంద్రాల్లో నీటిని వెనక్కి తోడి మళ్ళీ కరెంటు ఉత్పత్తికి ఉపయోగిస్తారు. దాంతో రెండుసార్లు యంత్రాలు పనిచేయడం వల్ల విద్యుత్ ఎక్కువ వృథా అవుతోంది. పగటిపూట లభ్యమయ్యే సౌర తదితర మిగులు విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాత్రిళ్లు కరెంట్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి ఆ మేరకు సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో సంప్రదాయేతర విద్యుదుత్పత్తి కేంద్రాల పెంపు, గ్రిడ్ స్థిరత్వం లక్ష్యంగా కేంద్రం విద్యుత్తు వినియోగదారుల హక్కుల నియమావళి-2020ని గతంలో సవరించింది. ఇందులో వ్యవసాయానికి మినహాయింపు ఇచ్చింది. రోజులో విద్యుత్తును వాడే సమయాన్ని బట్టి ఛార్జీలు విధించాలని నిర్ణయించింది.ఈ సవరణల్లో భాగంగా పగలు సౌర విద్యుత్తు అందుబాటులో ఉండే ఎనిమిది గంటల పాటు విద్యుత్తు ఛార్జీల్లో ఇరవై శాతం రాయితీ అందిస్తారు. సాధారణంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆరు నుంచి పది గంటల దాకా విద్యుత్తు వినియోగం గరిష్ఠంగా ఉంటుంది. ఈ సమయంలో గృహాలకు 10శాతం, ఇతర వర్గాలకు 20శాతం అధిక ధర వసూలు చేయాలని కేంద్రం సూచించింది. ఈ విధానాన్ని 2025 ఏప్రిల్ నుంచి గృహ వినియోగదారులకూ వర్తింపజేయనుంది. ఈ విధానం అత్యధికంగా విద్యుత్తు వినియోగించే భారీ పరిశ్రమలు, పెద్ద వ్యాపార సముదాయాలకు ఎప్పటి నుంచో అమలులో ఉంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న మీటర్లను మార్చి గంటల వారీగా విద్యుత్తును నమోదు చేసే డిజిటల్ మీటర్లను బిగించాల్సి ఉంటుంది. -
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ చేతికి జీఎంఆర్ కమళంగ ఎనర్జీ
న్యూఢిల్లీ: జీఎమ్ఆర్ ఎనర్జీకి చెందిన ఒడిషాలోని 1,050 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కొనుగోలు చేయనుంది. డీల్ విలువ రూ.5,321 కోట్లు. ఒడిశాలోని ఈ ప్లాంట్‌ను నిర్వహించే జీఎమ్ఆర్ ఎనర్జీకి చెందిన జీఎమ్ఆర్ కమళంగ ఎనర్జీ లిమిటెడ్‌లో వంద శాతం వాటాను కొనుగోలు చేయడానికి షేర్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తెలిపింది. ఈ ప్లాంట్ కొనుగోలుతో తమ మొత్తం స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 5,609 మెగావాట్లకు చేరుతుందని పేర్కొంది. ఈ ప్లాంట్ కొనుగోలుతో దేశపు తూర్పు ప్రాంతంలోకి విస్తరిస్తామని వివరించింది. కాగా ఈ కొనుగోలుకు వివిధ సంస్థల ఆమోదాలు పొందాల్సి ఉంది. ఈ ప్లాంట్ టే కోవర్ పూర్తయితే, జేఎస్డబ్ల్యూకి వంద శాతం అనుబంధ సంస్థగా జీఎమ్ఆర్ కమళంగ ఎనర్జీ లిమిటెడ్(జీకేఈఎల్) మారుతుంది. -
థర్మల్ విద్యుత్‌లో ‘మేఘా’ ప్రస్థానం
విద్యుత్ సరఫరా రంగంలో జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసుకున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) తాజాగా థర్మల్ విద్యుత్ రంగంలోనూ విజయవంతంగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో అతిపెద్ద విద్యుత్ సరఫరా వ్యవస్థ డబ్ల్యూపీపీటీసీఎల్ను రికార్డు సమయంలో నిర్మించడమే కాకుండా జల, సౌర విద్యుత్ రంగంలోనూ అగ్రగామిగా ఉన్న ఎంఇఐఎల్ ఇప్పుడు మొదటి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. తమిళనాడులోని నాగపట్టినమ్ వద్ద 150 మెగావాట్ల నాగాయ్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దాదాపు పూర్తి కావచ్చింది. ప్రస్తుతానికి 60 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసేలా గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. మొత్తం ప్రాజెక్ట్‌ను ఈ నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ఎంఇఐఎల్’ థర్మల్ విద్యుత్ కేంద్రాలు తమిళనాడులో రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఎంఇఐఎల్ ఏర్పాటు చేస్తోంది. ఇందులో 525 మెగావాట్ల ట్యుటీకోరిన్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఎస్ఇపీసీ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కోసం ఇపీసీ పద్ధతిలో ఎంఇఐఎల్ చేపట్టింది. నాగపట్టినమ్ వద్ద ఏర్పాటు చేస్తున్న 150 మెగావాట్ల నాగయ్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కేవీకే ఎనర్జీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఎంఇఐఎల్ ఏర్పాటు చేస్తున్నది. నాగయ్ థర్మల్ పవర్ ప్లాంట్ నాగపట్టణంకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్లాంటు ఉంటుంది. ప్లాంట్ ఏర్పాటుకు 230 ఎకరాల స్థలాన్ని సేకరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 530 టిపిహెచ్ సామర్థ్యం కలిగిన బాయిలర్, 150 మెగావాట్ల టర్బైన్ జనరేటర్, ఏయిర్ కూల్డ్ కండెన్సర్, 125 మీటర్ల ఎత్తైన చిమ్నీని ఎంఇఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ థర్మల్ విద్యుత్ కేంద్రానికి కావాల్సిన 70 శాతం బొగ్గును దేశీయంగానూ, మిగతా 30 శాతం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. ప్లాంట్‌కు కావలసిన 3700 టన్నుల స్టీల్‌ను ఎంఇఐఎల్ సొంతంగా సరఫరా చేసింది. ఈ ప్లాంటులో ఉత్పత్తి అయిన విద్యుత్ ను తరలించేందుకు 24.6 కిలో మీటర్ల ట్రాన్స్ మిషన్ లైన్లను ప్లాంటు నుంచి 230 కెవి తిరువూరు సబ్ స్టేషన్ వరకు ఏర్పాటు చేశారు. ఏడు రోజులకు సరిపడా బొగ్గును నిల్వ చేయడానికి 114 టిపిహెచ్ నిల్వ ఏర్పాట్లు చేశారు. సుమారు 130 మెగావాట్లకు ప్రైవేట్ ఏజెన్సీలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం పూర్తయింది. జులై 10, 2019 నాడు గ్రిడ్ కు అనుసంధాన ప్రక్రియను ప్రారంభించారు. ట్యుటీకోరిన్ థర్మల్ ప్లాంట్ 525 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఎంఇఐఎల్ తమిళనాడు రాష్ట్రంలోని ట్యుటికోరిన్ జిల్లాలో ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పోరేషన్ లిమిటెడ్ (ట్రాన్జెడ్కో) తో ఎస్ఇపిసి సంస్థ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ (పీపీఏ) కుదుర్చుకున్నది. ఈ కేంద్రానికి కావలిసిన స్థలాన్ని వి.ఓ.చిదంబరం పోర్టు నుంచి లీజుకు తీసుకుంది. వడక్కు కరసేరి గ్రామంలో యాష్ పాండ్ ను ఏర్పాటు చేయడానికి 100 హెక్టార్ల స్థలాన్ని సేకరించారు. ఈ స్థలం ఎస్ఇపిసి కి చెందినది. ఈ ప్రాజెక్టులో భాగంగా టాన్జెడ్కో ఎంఇఐఎల్ కు 48 కిమీల 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ల ను ఏర్పాటు చేసే పనులను అప్పగించింది. ప్లాంటు నుంచి ఒట్టపీడరమ్ సబ్ స్టేషన్ వరకు లైన్ ఏర్పాటు చేశారు. ఎస్ఇపిసి టిఎన్ఈబీ తో విద్యుత్ అమ్మకాలకు సంబంధించి 30 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అదే విధంగా ఈ ప్లాంటుకు అవసరమైన బొగ్గును సరఫరా చేసేందుకు గాను దేశీయ, విదేశీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఈ థర్మల్ విద్యుత్ కేంద్రంలో 1700 టిపిహెచ్ సామర్థ్యం కాలిగిన బాయలర్, 555 మెగావాట్ల సామర్థ్యం కలిగిన టర్భైన్ జనరేటర్, 500 టిపిహెచ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, గంటకు 6700 క్యూమెక్స్ సముద్ర జలాలను తీసుకొనే ఇంటెక్, గంటకు 66000 క్యూమెక్స్ సామర్థ్యం కలిగిన కూలింగ్ వాటర్ సిస్టమ్ ని ఎంఇఐఎల్ ఏర్పాటు చేస్తోంది. అదేవిధంగా 275 మీటర్ల ఎత్తయిన చిమ్నీని ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ కు కావలసిన 15000 టన్నలు స్టీల్ ను ఎంఇఐఎల్ సొంతంగా సరఫరా చేసింది. 2018 డిసెంబర్ 28న బాయిలర్ హైడ్రో టెస్ట్ విజయవంతం అయ్యింది. ఇప్పటికి 90 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎలక్ట్రో మెకానికల్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలో ఈ విద్యుత్ కేంద్రాన్ని ఎంఇఐఎల్ అందుబాటులోకి తేనుంది. సాంప్రదాయేతర విద్యుదుత్పత్తి రంగంలో ఎంఇఐఎల్ ఇప్పటికే 112 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నది. మహారాష్ట్రలో ధూలే జిల్లా సాక్రి వద్ద 50 మెగావాట్లు, చంద్రాపూర్ వద్ద రెండు మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాలను మహాజెన్ కో కోసం ఏర్పాటు చేసింది. దేశంలోనే తొలిసారిగా గుజరాత్ లో సాగునీటి కాల్వలపై 10 మెగావాట్ల కెనాల్ టాప్ సోలార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది వంద సృజనాత్మక ఇన్ఫ్రాస్ట్రక్టర్ ఆవిష్కరణల్లో ఒకటిగా అంతర్జాతీయ కన్సల్టెన్సీ కంపెనీ కేపీఎంజీ తన ఎకానమీ పవర్ ప్రాజెక్టుల నివేదికలో గుర్తించింది. భారత్ నుంచి ఎంపికైన ఆరింటిలో ఇది ఒకటి కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో 50 మెగావాట్ల సోలార్ థర్మల్ కేంద్రాన్ని ఎంఇఐఎల్ విజయవంతంగా పూర్తి చేసి, విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నది. ఇక జల విద్యుత్ రంగంలో హిమాచల్ ప్రదేశ్ లో 25 మెగావాట్ల లాంబడ్గ్ హైడల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో ఉండగా, గుజరాత్ లో సౌరాష్ట్ర భ్రాంచ్ కెనాల్ పై ఏర్పాటు చేసిన 45 మెగావాట్ల మూడు జల విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటికే రెండు విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా, మూడోది అన్ని పనులు పూర్తి చేసుకొని, ప్రారంభానికి సిద్ధంగా ఉంది. -
కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం అభివృద్ధికేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో విద్యుత్ ముఖ్యమైనది. విభజన తరువాత విద్యుత్‌లో మనం మిగుల్లో ఉన్నాం. అయినా భవిష్యత్ కోసం విద్యుత్ అవసరం ఎంతైనా ఉంది. అయితే ఏ విద్యుత్ అవసరం అని పరిశీలించాలి. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం నిర్మాణానికి రూ. 2లక్షల 80 వేల కోట్లు ఖర్చు అవుతుంది. నిర్మాణానికి కనీసం పది సంవత్సరాలకు పైగా సమయం పడుతుంది. ఇప్పటి అంచనాల ప్రకారం ఒక యూనిట్ విద్యుత్ ధర రూ.14లు ఉంటుంది. నిర్మాణ వ్యయం పెరిగితే ఇంకా పెరగవచ్చు. భారతదేశంలో విస్తారంగా బొగ్గును ఉపయోగించుకొని థర్మల్ పవర్ప్లాంట్లు ఏర్పడుతున్నాయి బొగ్గు గనులు లేని జపాన్‌లో విధిలేక నిర్మించిన అణు విద్యుత్ కేంద్రాలను కూడా క్రమేణా మూసివేస్తున్నారు. యురేనియంని ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేసే ఆస్ట్రేలియాలో ఒక్క అణు విద్యుత్ కేంద్రం కూడాలేదు. ఏపీలో కృష్ణా, గోదావరి బేసిన్లో పుష్కలంగా గ్యాస్ లభిస్తున్నది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుని కోనసీమ, గౌతమి, వేమగిరి, జీవీకే (విస్తరణ) విద్యుత్ ప్లాంట్లు నిర్మించారు. కాని కృష్ణా, గోదావరి బేసిన్‌లోని గ్యాస్‌ను రిలయన్స్ కంపెనీ గుజరాత్‌కి పట్టుకెళుతోంది. ఇక్కడ నిర్మించిన గ్యాస్ప్లాంట్కు గ్యాస్ ఇవ్వనందున 2000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి కావడంలేదు. గ్యాస్ అయినా ఇవ్వండి! లేదా డబ్బులు అయినా చెల్లించండని ఈ కంపెనీలు సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వంపై కేసు వేశాయి. విశాఖలోని హిందూజా, నెల్లూరులోని మరి కొన్ని థర్మల్‌ప్లాంట్లు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి. సోలార్ విద్యుత్ కూడా మన రాష్ట్రంలో విస్తారంగా పెరుగుతు న్నది. రాయలసీమలో గాలిమరల విద్యుత్‌కు అధిక అవకాశం ఉంది. ఇన్ని వనరులు వున్నా ఏపీ ప్రభుత్వం అణువిద్యుత్ వైపు ఆలోచించడానికి అభివృద్ధి కంటే రాజకీయ కారణాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సొంత ప్రయోజనాలు ప్రధానంగా ఉన్నాయి. అణు విద్యుత్ అత్యంత ప్రమాద కరం. అణు రియాక్టరు అంటే ఆటంబాంబు. అణు విద్యుత్కేంద్రం అంటే భారీ ఆటం బాంబు. అణు విద్యుత్కేంద్రాల్లో వృథా పదార్థాలుగా మిగిలే ట్రైషియం, స్ట్రోన్షియం, ప్లూటోనియంలు భయంకరమైన రసాయన పదార్థాలు. ఇవి మట్టిలో, గాలిలో కలిసి కని పించవు. రంగు, రుచి, వాసన వుండవు. ఇవి రెండు లక్షల ఏళ్లవరకు ఉండి జీవకోటిని నాశనం చేస్తుంటాయి. అణువులు మనిషిలో చేరి తరతరాలను అనారోగ్యం పాలు జేస్తాయి. అణు రియాక్టరు సజావుగా నడుస్తుంటే వదిలే కాలుష్యమే ఇంత ప్రమాదం చేస్తుంది. ఇక అణు ప్రమాదమే సంభవిస్తే అక్కడ వేరే బాంబు అవసరంలేదు. కొవ్వాడ నుంచి 177 కి.మీ పరిధిలో జనావాసాలు అన్నీ ఖాళీ చేయించాలని అంతర్జాతీయ శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన పక్షంలో గంట నుంచి 6గంటల్లో జనాన్ని ఖాళీ చేయించాలని వీరు హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై జరిగిన అణు బాంబు దాడికి రెండు నగరాలు ధ్వంసమై లక్షల మంది మరణించారు. తరం తర్వాత తరం సంతానం కూడా వికలాంగులుగానే జన్మిస్తున్నారు. అణు రియాక్టర్లలో లీక్, ప్రమాదం వల్ల అమెరికాలోని ‘‘త్రీ మైల్ ఐలండ్’’, రష్యా (ఇప్పటి ఉక్రెయిన్)లోని చెర్నో బిల్, జపాన్‌లోని పుకుషిమాల్లో వేలాదిమంది మరణించారు. గుజరాత్‌లోని మితివిర్ధిలో అణు విద్యుత్ కేంద్రం పెట్టాలని నాటి కేంద్ర ప్రభుత్వం 2007లో నిర్ణయించింది. 2009లో నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దరఖాస్తు చేసింది. 2013 నాటికి పర్యావరణ, అటవీ, సీఆర్‌జెడ్ అనుమతులు పొందింది. అయితే ఆ అణు విద్యుత్ కేంద్రాన్ని ఆగమేఘాల మీద 2016 జూన్ 4వ తేదీన కొవ్వాడకు తరలించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్లో ప్రజలు వ్యతిరేకిస్తే ఉత్తరాం ధ్రలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద కొవ్వాడకు తరలించడం ఎవరి ప్రయోజనం కోసం? టీడీపీ ప్రభుత్వం కొవ్వాడలో తొలిదశలో సేకరించే 2,200 ఎకరాల్లో 1600 ఎకరాలు ప్రభుత్వ భూములనే పేరుతో మత్స్యకారులు, పేదల నుంచి బలవంతంగా చౌకగా లాక్కుంటోంది. దీనివల్ల స్థానికులకు ఎవ్వరికీ ఉద్యోగాలు రావు కానీ అమెరికాలో 40వేల ఉద్యోగాలు వస్తాయి. అమెరికాలోని వెస్టింగ్‌హౌస్ నిర్మించే ఎపి1000 రియాక్టర్లలో అత్య ధిక లాభాలు ఆ దే శానికే వె ళ్తాయి. ప్రమాదం జరిగితే ప్రజలకు, ప్రాణాలకు ఇతర ఆస్తు లకు నష్టపరిహారం అణు రియాక్టర్లు సరఫరా చేసిన కంపెనీలు భరించవు. మనమే భరిం చాలి. ఇటువంటి అణు కుంపటి ఉత్తరాంధ్రలో పెట్టడం ఉత్తరాంధ్ర విధ్వంసానికి తప్ప అభివృద్ధికి మాత్రం కాదు. అభివృద్ధి జపంతో ఒకవైపు ప్రజలను మోసగిస్తూ, మరో వైపు బహుళజాతి సంస్థలకు రెడ్ కార్పెట్ వేసి ఆంధ్రప్రదేశ్‌ను తాకట్టుపెట్టాలని తీవ్రంగా ప్రయ త్నిస్తున్నారు. అందుకే ప్రజానీకం తెలుగుదేశం కుట్రను తిప్పికొట్టాలి. వ్యాసకర్త సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు 94900 98789 - సీహెచ్. నరసింగరావు -
విద్యుత్తుకు ‘లైన్’క్లియర్..!
* కొత్త ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ అనుమతుల్లో కదలిక * ‘కొత్తగూడెం’ విస్తరణకు పర్యావరణ శాఖ అనుమతి * ‘దామరచర్ల’కు అటవీ భూముల మార్పిడిపై సానుకూలత * 17న జరిగే సలహా కమిటీ సమావేశంలో వెల్లడి కానున్న నిర్ణయం! సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ కష్టాలు తీరే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఇప్పటికే అటవీ, పర్యావరణ అనుమతుల్లో కదలిక మొదలైంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం థర్మల్ ప్రాజెక్టు విస్తరణకు పర్యావరణ అనుమతుల జారీ విషయంలో ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో ఎన్టీపీసీ, జెన్కో ఆధ్వర్యంలో తలపెట్టిన 6,800 మెగావాట్ల మెగా విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఈ నెల 17న అన్నిరకాల అనుమతులు వచ్చే అవకాశం ఉంది. దామరచర్ల మండలం వీర్లపాలెం, దిలావర్పూర్ పరిసరాల్లో విస్తారంగా వున్న అటవీ ప్రాంతంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 10,700 ఎకరాల భూమిని గుర్తించింది. రక్షిత అటవీ క్షేత్రంలోని భూములు కావడంతో ప్రత్యామ్నాయంగా తమ భూములను అటవీ శాఖకు అప్పగించాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భూముల మార్పిడికి సంబంధించిన ప్రతిపాదనలను రెండు నెలల కిందటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు సమర్పించింది. పరస్పర భూముల మార్పిడి విషయంలో సీఎం కేసీఆర్ అప్పట్లో స్వయంగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో మాట్లాడి అనుమతులు కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ నేపథ్యంలో అటవీ, పర్యావరణ అనుమతులను మంజూరు చేసేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ సానుకూలత వ్యక్తం చేసింది. పరస్పర భూ మార్పిడి పద్ధతిలో ఈ ప్రాజెక్టుకు అటవీ భూముల కేటాయింపుతో పాటు ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతుల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు అటవీ శాఖలోని ఉన్నత స్థాయి సలహా కమిటీ ఈ నెల 17న సమావేశమవుతోంది. ఈ భేటీలో నిర్ణయం తీసుకున్న వెంటనే కేంద్ర అటవీ శాఖ అనుమతులు జారీ చేసే అవకాశముంది. దామరచర్ల విద్యుత్ ప్రాజెక్టుకు మంగళవారం అన్ని రకాల అనుమతులు జారీ చేస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటన చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఆశలు చిగురించాయి. టీఎస్ జెన్కో డెరైక్టర్(థర్మల్) సచ్చిదానందం ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆదివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. దామరచర్లలో జెన్కో ఆధ్వర్యంలో 4,400(2’600)+4’800)) మెగావాట్లు, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 2,400 (3‘800) మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం 9 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ఇప్పటికే సవివర పథక నివేదిక(డీపీఆర్) సైతం తయారైంది. మెగావాట్‌కు రూ.6.1 కోట్ల వ్యయం చొప్పున ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం రూ.42 వేల కోట్ల వ్యయం అవుతుందని ఈ నివేదికలో తేల్చినట్లు సమాచారం. యుద్ధప్రాతిపదికన మూడేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తైఉత్పత్తి దశకు చేరుకుంటే మెగావాట్‌కు ముగ్గురు చొప్పున దాదాపు 20 వేలకుపైగా కొత్త ఉద్యోగాలు రానున్నాయి. కొత్తగూడెం విస్తరణకు క్లియరెన్స్.. ప్రస్తుతం కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం 720 మెగావాట్లు, 5, 6వ దశల ప్లాంట్ల కింద మరో 1,000 మెగావాట్లు కలిపి మొత్తం 1,720 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంది. ఈ ప్రాజెక్టు విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ 800 మెగావాట్ల సామర్థ్యంతో మరో ప్లాంట్‌ను నిర్మిస్తోంది. విద్యుత్ కేంద్రంలో స్థలం అందుబాటులో ఉండడంతో ఈ ప్లాంట్ కోసం భూసేకరణ జరపాల్సిన అవసరం లేకపోయింది. నిర్మాణంలో ఉన్న ఈ కొత్త ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆ శాఖ ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి అందనున్నాయి.