కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం అభివృద్ధికేనా..? | is Kovvada nuclear center to be developed for andhra pradesh state | Sakshi
Sakshi News home page

కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం అభివృద్ధికేనా..?

Published Sun, Jul 17 2016 1:29 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం అభివృద్ధికేనా..? - Sakshi

కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం అభివృద్ధికేనా..?

ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో విద్యుత్ ముఖ్యమైనది. విభజన తరువాత విద్యుత్‌లో మనం మిగుల్లో ఉన్నాం. అయినా భవిష్యత్ కోసం విద్యుత్ అవసరం ఎంతైనా ఉంది. అయితే ఏ విద్యుత్ అవసరం అని పరిశీలించాలి. కొవ్వాడ అణు విద్యుత్  కేంద్రం నిర్మాణానికి రూ. 2లక్షల 80 వేల కోట్లు ఖర్చు అవుతుంది. నిర్మాణానికి కనీసం పది సంవత్సరాలకు పైగా సమయం పడుతుంది. ఇప్పటి అంచనాల ప్రకారం ఒక యూనిట్ విద్యుత్ ధర రూ.14లు ఉంటుంది. నిర్మాణ వ్యయం పెరిగితే ఇంకా పెరగవచ్చు.
 
 భారతదేశంలో విస్తారంగా బొగ్గును ఉపయోగించుకొని థర్మల్ పవర్‌ప్లాంట్‌లు ఏర్పడుతున్నాయి బొగ్గు గనులు లేని జపాన్‌లో విధిలేక నిర్మించిన అణు విద్యుత్ కేంద్రాలను కూడా క్రమేణా మూసివేస్తున్నారు. యురేనియంని ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేసే ఆస్ట్రేలియాలో ఒక్క అణు విద్యుత్ కేంద్రం కూడాలేదు. ఏపీలో కృష్ణా, గోదావరి బేసిన్‌లో పుష్కలంగా గ్యాస్ లభిస్తున్నది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుని కోనసీమ, గౌతమి, వేమగిరి, జీవీకే (విస్తరణ) విద్యుత్ ప్లాంట్‌లు నిర్మించారు. కాని కృష్ణా, గోదావరి బేసిన్‌లోని గ్యాస్‌ను రిలయన్స్ కంపెనీ గుజరాత్‌కి పట్టుకెళుతోంది.
 
 ఇక్కడ నిర్మించిన గ్యాస్‌ప్లాంట్‌కు గ్యాస్ ఇవ్వనందున 2000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి కావడంలేదు. గ్యాస్ అయినా ఇవ్వండి! లేదా డబ్బులు అయినా చెల్లించండని ఈ కంపెనీలు సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వంపై కేసు వేశాయి. విశాఖలోని హిందూజా, నెల్లూరులోని మరి కొన్ని థర్మల్‌ప్లాంట్లు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నాయి. సోలార్ విద్యుత్ కూడా మన రాష్ట్రంలో విస్తారంగా పెరుగుతు న్నది. రాయలసీమలో గాలిమరల విద్యుత్‌కు అధిక అవకాశం ఉంది. ఇన్ని వనరులు వున్నా ఏపీ ప్రభుత్వం అణువిద్యుత్ వైపు ఆలోచించడానికి అభివృద్ధి కంటే రాజకీయ కారణాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సొంత ప్రయోజనాలు ప్రధానంగా ఉన్నాయి.
 
 అణు విద్యుత్ అత్యంత ప్రమాద కరం. అణు రియాక్టరు అంటే ఆటంబాంబు. అణు విద్యుత్కేంద్రం అంటే భారీ ఆటం బాంబు. అణు విద్యుత్కేంద్రాల్లో వృథా పదార్థాలుగా మిగిలే ట్రైషియం, స్ట్రోన్షియం, ప్లూటోనియంలు భయంకరమైన రసాయన పదార్థాలు. ఇవి మట్టిలో, గాలిలో కలిసి కని పించవు. రంగు, రుచి, వాసన వుండవు. ఇవి రెండు లక్షల ఏళ్లవరకు ఉండి జీవకోటిని నాశనం చేస్తుంటాయి. అణువులు మనిషిలో చేరి తరతరాలను అనారోగ్యం పాలు జేస్తాయి. అణు రియాక్టరు సజావుగా నడుస్తుంటే వదిలే కాలుష్యమే ఇంత ప్రమాదం చేస్తుంది. ఇక అణు ప్రమాదమే సంభవిస్తే అక్కడ వేరే బాంబు అవసరంలేదు. కొవ్వాడ నుంచి 177 కి.మీ పరిధిలో జనావాసాలు అన్నీ ఖాళీ చేయించాలని అంతర్జాతీయ శాస్త్ర వేత్తలు చెబుతున్నారు.
 
 ప్రమాదం జరిగిన పక్షంలో గంట నుంచి 6గంటల్లో జనాన్ని ఖాళీ చేయించాలని వీరు హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై జరిగిన అణు బాంబు దాడికి  రెండు నగరాలు ధ్వంసమై లక్షల మంది మరణించారు. తరం తర్వాత తరం సంతానం కూడా వికలాంగులుగానే జన్మిస్తున్నారు. అణు రియాక్టర్లలో లీక్, ప్రమాదం వల్ల అమెరికాలోని ‘‘త్రీ మైల్ ఐలండ్’’, రష్యా (ఇప్పటి ఉక్రెయిన్)లోని చెర్నో బిల్, జపాన్‌లోని పుకుషిమాల్లో వేలాదిమంది మరణించారు.
 
 గుజరాత్‌లోని మితివిర్ధిలో అణు విద్యుత్ కేంద్రం పెట్టాలని నాటి కేంద్ర ప్రభుత్వం 2007లో నిర్ణయించింది. 2009లో నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దరఖాస్తు చేసింది. 2013 నాటికి పర్యావరణ, అటవీ, సీఆర్‌జెడ్ అనుమతులు పొందింది. అయితే ఆ అణు విద్యుత్ కేంద్రాన్ని ఆగమేఘాల మీద 2016 జూన్ 4వ తేదీన కొవ్వాడకు తరలించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్‌లో ప్రజలు వ్యతిరేకిస్తే ఉత్తరాం ధ్రలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద కొవ్వాడకు తరలించడం ఎవరి ప్రయోజనం కోసం? టీడీపీ ప్రభుత్వం కొవ్వాడలో తొలిదశలో సేకరించే 2,200 ఎకరాల్లో 1600 ఎకరాలు ప్రభుత్వ భూములనే పేరుతో మత్స్యకారులు, పేదల నుంచి బలవంతంగా చౌకగా లాక్కుంటోంది.
 
దీనివల్ల స్థానికులకు ఎవ్వరికీ ఉద్యోగాలు రావు కానీ అమెరికాలో 40వేల ఉద్యోగాలు వస్తాయి. అమెరికాలోని వెస్టింగ్‌హౌస్ నిర్మించే ఎపి1000 రియాక్టర్లలో అత్య ధిక లాభాలు ఆ దే శానికే వె ళ్తాయి. ప్రమాదం జరిగితే ప్రజలకు, ప్రాణాలకు ఇతర ఆస్తు లకు నష్టపరిహారం అణు రియాక్టర్లు సరఫరా చేసిన కంపెనీలు భరించవు. మనమే భరిం చాలి. ఇటువంటి అణు కుంపటి ఉత్తరాంధ్రలో పెట్టడం ఉత్తరాంధ్ర విధ్వంసానికి తప్ప అభివృద్ధికి మాత్రం కాదు. అభివృద్ధి జపంతో ఒకవైపు ప్రజలను మోసగిస్తూ, మరో వైపు బహుళజాతి సంస్థలకు రెడ్ కార్పెట్ వేసి ఆంధ్రప్రదేశ్‌ను తాకట్టుపెట్టాలని తీవ్రంగా ప్రయ త్నిస్తున్నారు. అందుకే ప్రజానీకం తెలుగుదేశం కుట్రను తిప్పికొట్టాలి.
 వ్యాసకర్త సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు 94900 98789
 - సీహెచ్. నరసింగరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement