విద్యుత్తుకు ‘లైన్’క్లియర్..!
* కొత్త ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ అనుమతుల్లో కదలిక
* ‘కొత్తగూడెం’ విస్తరణకు పర్యావరణ శాఖ అనుమతి
* ‘దామరచర్ల’కు అటవీ భూముల మార్పిడిపై సానుకూలత
* 17న జరిగే సలహా కమిటీ సమావేశంలో వెల్లడి కానున్న నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ కష్టాలు తీరే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఇప్పటికే అటవీ, పర్యావరణ అనుమతుల్లో కదలిక మొదలైంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం థర్మల్ ప్రాజెక్టు విస్తరణకు పర్యావరణ అనుమతుల జారీ విషయంలో ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో ఎన్టీపీసీ, జెన్‌కో ఆధ్వర్యంలో తలపెట్టిన 6,800 మెగావాట్ల మెగా విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఈ నెల 17న అన్నిరకాల అనుమతులు వచ్చే అవకాశం ఉంది. దామరచర్ల మండలం వీర్లపాలెం, దిలావర్‌పూర్ పరిసరాల్లో విస్తారంగా వున్న అటవీ ప్రాంతంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 10,700 ఎకరాల భూమిని గుర్తించింది.
రక్షిత అటవీ క్షేత్రంలోని భూములు కావడంతో ప్రత్యామ్నాయంగా తమ భూములను అటవీ శాఖకు అప్పగించాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భూముల మార్పిడికి సంబంధించిన ప్రతిపాదనలను రెండు నెలల కిందటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు సమర్పించింది. పరస్పర భూముల మార్పిడి విషయంలో సీఎం కేసీఆర్ అప్పట్లో స్వయంగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో మాట్లాడి అనుమతులు కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ నేపథ్యంలో అటవీ, పర్యావరణ అనుమతులను మంజూరు చేసేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ సానుకూలత వ్యక్తం చేసింది. పరస్పర భూ మార్పిడి పద్ధతిలో ఈ ప్రాజెక్టుకు అటవీ భూముల కేటాయింపుతో పాటు ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతుల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు అటవీ శాఖలోని ఉన్నత స్థాయి సలహా కమిటీ ఈ నెల 17న సమావేశమవుతోంది. ఈ భేటీలో నిర్ణయం తీసుకున్న వెంటనే కేంద్ర అటవీ శాఖ అనుమతులు జారీ చేసే అవకాశముంది. దామరచర్ల విద్యుత్ ప్రాజెక్టుకు మంగళవారం అన్ని రకాల అనుమతులు జారీ చేస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటన చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఆశలు చిగురించాయి.
టీఎస్ జెన్‌కో డెరైక్టర్(థర్మల్) సచ్చిదానందం ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆదివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. దామరచర్లలో జెన్‌కో ఆధ్వర్యంలో 4,400(2’600)+4’800)) మెగావాట్లు, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 2,400 (3‘800) మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం 9 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ఇప్పటికే సవివర పథక నివేదిక(డీపీఆర్) సైతం తయారైంది. మెగావాట్‌కు రూ.6.1 కోట్ల వ్యయం చొప్పున ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం రూ.42 వేల కోట్ల వ్యయం అవుతుందని ఈ నివేదికలో తేల్చినట్లు సమాచారం. యుద్ధప్రాతిపదికన మూడేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తైఉత్పత్తి దశకు చేరుకుంటే మెగావాట్‌కు ముగ్గురు చొప్పున దాదాపు 20 వేలకుపైగా కొత్త ఉద్యోగాలు రానున్నాయి.
కొత్తగూడెం విస్తరణకు క్లియరెన్స్..
ప్రస్తుతం కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం 720 మెగావాట్లు, 5, 6వ దశల ప్లాంట్ల కింద మరో 1,000 మెగావాట్లు కలిపి మొత్తం 1,720 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంది. ఈ ప్రాజెక్టు విస్తరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ 800 మెగావాట్ల సామర్థ్యంతో మరో ప్లాంట్‌ను నిర్మిస్తోంది. విద్యుత్ కేంద్రంలో స్థలం అందుబాటులో ఉండడంతో ఈ ప్లాంట్ కోసం భూసేకరణ జరపాల్సిన అవసరం లేకపోయింది. నిర్మాణంలో ఉన్న ఈ కొత్త ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆ శాఖ ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి అందనున్నాయి.